2,769 ప్రభుత్వ బడుల్లో ఈసారి ప్రీ ప్రైమరీ - నాలుగేళ్లు నిండిన చిన్నారులు యూకేజీలో
క్యూర్ పరిధిలో 529 చోట్ల యూకేజీ - హైదరాబాద్‌లో 275, మేడ్చల్ జిల్లాలో 145 - 4,131కి చేరుకోనున్న శిశు విద్య పాఠశాలలు - ఒక్కో పాఠశాలకు వసతుల కల్పనకు రూ.1.70 లక్షలు కేటాయింపు

Published : May 28, 2026 at 7:32 AM IST
Pre Primary Education in Govt Schools in Telangana : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే విద్యాసంవత్సరం (2026-27) 2,769 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. క్యూర్(CURE-Core Urban Region Economy) పరిధిలో 529 చోట్ల యూకేజీ విద్యను అమలు చేయనున్నారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 275, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో 145 చోట్ల కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. దీంతో రాష్ట్రంలో శిశు విద్య పాఠశాలల సంఖ్య 4,131కు చేరుకోనుంది.
గతేడాది వెయ్యి పాఠశాలల్లో : తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం మరో 2,769 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య యూకేజీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. గత విద్యా సంవత్సరంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ తరగతులను ప్రారంభించారు. రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం 2 వేల నుంచి 2,500 పాఠశాలల్లో కొత్తగా పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో 18 వేల స్కూళ్లు : జిల్లా విద్యా అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా చివరకు 2,769 యూకేజీ క్లాసులు అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం శిశు విద్య తరగతులున్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 4,131కు చేరనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 18 వేల వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అంటే సుమారు 23 శాతం స్కూళ్లలో నాలుగేళ్లు నిండిన చిన్నారులు యూకేజీలో చేరొచ్చన్నమాట.
మొత్తం 2,769 పాఠశాలలు : హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ ప్రాంతంలో అంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల 529 నాన్ క్యూర్ ప్రాంతాల్లో 2,240 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభిస్తారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 175, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 145 పాఠశాలలు ప్రీ ప్రైమరీ విద్యకు ఎంపికయ్యాయి. ఆ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులు వెంటనే చేయాలని ఫర్నిచర్, ఇండోర్, అవుట్ డోర్ ఆట వస్తువులు సమకూర్చాలని, గోడలపై పిల్లలకు నచ్చే చిత్రాలు వేయించాలని డైరెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
తాత్కాలిక ఉద్యోగాల ఏర్పాటు : ఒక్కో పాఠశాలలకు ఆయా వసతుల కల్పనకు సుమారు రూ. 1.70 లక్షలు కేటాయించారు. కలెక్టర్లు ఒక్కో చోట ఒక ఆయాను, ఒక ఇన్‌స్ట్రక్టర్‌ను నియామకం చేస్తారు. ఆయాకు నెలకు రూ. 6 వేలు, ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ. 8 వేల చొప్పున గౌరవ వేతనం అందించనున్నారు. ప్రీ ప్రైమరీ వల్ల ఒక్కో చోట ఇద్దరు చొప్పున 2,769 బడుల్లో మొత్తం 5,538 మందికి తాత్కాలిక ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతంతో అంగన్వాడీలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.
కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కింద రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, విద్యాభివృద్ధి కోసం పలు సంస్థలు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి.
ఈ పాఠశాలలకే నిధుల ఖర్చు
- మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతులు నిర్వహించేందుకు నిర్మాణం చేసే కొత్త క్యాంపస్‌కు మొత్తం ఖర్చులో 40 శాతం అంటే రూ.19.66 కోట్లను రాంకీ సంస్థ ఖర్చు చేస్తుంది.
- రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జిల్లా పరిషత్ హై స్కూల్‌ను ఉన్నతీకరిస్తారు. అందులో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతులను అధునాతనంగా నిర్మించి అందుబాటులోకి తెస్తారు. అందుకయ్యే ఖర్చులో 40 శాతం అంటే రూ.10.40 కోట్లను రాంకీ సంస్థ వెచ్చిస్తుంది.
- రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు క్లాసుల కోసం అవసరమైన రూ.50.50 కోట్లను రహేజా గ్రూపు భరించనుంది.
- మేడ్చల్ జిల్లా ఉప్పల్ సుభాష్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ నుంచి 7వ తరగతి వరకు నడిపేందుకు అవసరమైన రూ.12.20 కోట్లను యశోద(హస్పిటల్స్) ఫౌండేషన్ ఖర్చు చేయనుంది.
అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం - రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం

