ETV Bharat / state

'పని చేయకపోతే వీఆర్‌ఎస్‌ తీసుకుని వెళ్లిపోండి' - మున్సిపల్ సిబ్బందిపై కలెక్టర్ సీరియస్

ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - పనితీరు మార్చుకోకపోతే వీఆర్ఎస్ ఇచ్చి వెళ్లిపోవాలని వార్నింగ్ - టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందిని మార్చాలని అధికారులకు ఆదేశం

​Prakasam Collector Warning
​Prakasam Collector Warning (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 2, 2026 at 6:30 PM IST

3 Min Read
Choose ETV Bharat

​Prakasam Collector Warning : "పని చేయనప్పుడు మీకు ఉద్యోగం ఎందుకు? ప్రతి నెలా జీతం ఎందుకు తీసుకుంటున్నారు? ప్రభుత్వ కార్యాలయం అంటే సత్రం అనుకుంటున్నారా? తక్షణమే మీ పద్ధతి మార్చుకోండి. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదు. లేదా ఉద్యోగానికి వీఆర్ఎస్ పెట్టి ఇంటికి వెళ్లిపోండి" అంటూ ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు మున్సిపల్ సిబ్బందిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

కుర్చీల్లో కూర్చుని ఏం చేస్తున్నారు? : కలెక్టర్ రాజాబాబు ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకోగానే ముందస్తు సమాచారం లేకపోవడంతో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కార్యాలయంలోని ప్రతి విభాగాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఏ సెక్షన్​లో ఎంత మంది పని చేస్తున్నారు? వారి బాధ్యతలు ఏమిటి? తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రతి ఉద్యోగి జాబ్ చార్ట్​ను క్షుణ్ణంగా పరిశీలించారు. వారు కుర్చీల్లో కూర్చుని ఆ సమయంలో చేస్తున్న పనిని ప్రత్యక్షంగా గమనించారు.

'పని చేయకపోతే వీఆర్‌ఎస్‌ తీసుకుని వెళ్లిపోండి' - మున్సిపల్ సిబ్బందిపై ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సీరియస్ (ETV)

ఈ తనిఖీల్లో పలువురు ఉద్యోగుల తీరుపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించారు. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను గాలికి వదిలేస్తే ఎలా అని నిలదీశారు. పనితీరు మార్చుకోకపోతే ఇక నుంచి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటామంటే కుదరదని మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.

గంటన్నర పాటు తనిఖీ : సుమారు గంటన్నర పాటు కార్పొరేషన్​లో కలెక్టర్ తనిఖీలు సాగాయి. ఆఫీసులోని ప్రతి గదికీ ఆయన వెళ్లారు. ఫైళ్ల నిర్వహణ ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. పెండింగ్ ఫైల్స్​ను వెంటనే క్లియర్ చేయాలన్నారు. ఎక్కడా కూడా ఫైళ్లు పేరుకుపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదేనని గుర్తు చేశారు.

ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ విభాగంలోని సిబ్బందిని తక్షణమే మార్చాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై కూడా ఆయన ఆరా తీశారు. పారిశుద్ధ్య విభాగాన్ని మినహాయించి, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది పూర్తి వివరాలను తనకు సమర్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే యాక్షన్ తప్పదు : కార్యాలయంలో క్రమశిక్షణపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ విధానంలోనే హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు. విధుల్లో భాగంగా ఫీల్డ్ వర్క్​కు బయటకు వెళ్లే సమయంలో మూమెంట్ రిజిస్టర్​లో కచ్చితంగా సంతకం చేయాలన్నారు. ఈ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్​కు సూచించారు. కార్పొరేషన్ ప్రాంగణంతో పాటు కార్యాలయం లోపల కూడా పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

"మున్సిపల్ ఆఫీసు పనితీరుపై రెగ్యులర్​గా మీడియాలో నెగిటివ్ వార్తలు వస్తున్నాయి. వాటర్ సప్లై, శానిటేషన్ ఇష్యూస్​పై వస్తున్నాయి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రాపర్ ఇంప్లిమెంటేషన్స్ సరిగ్గా జరగడం లేదని పలు ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై దృష్టి సారించే ఇక్కడ తనిఖీ చేశాను. ప్రతి సెక్షన్​లో కూడా ఎంతమంది సిబ్బంది ఉన్నారు? పెండింగ్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి? అనే విషయాలపై రివ్యూ చేశాం. విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని అందరికీ కఠిన సూచనలు ఇచ్చాం." -రాజాబాబు, ప్రకాశం జిల్లా కలెక్టర్

'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంటాం'

రైతు అవతారంలో సబ్ కలెక్టర్ తనిఖీ... నిబంధనలు పాటించని షాపులపై చర్యలు