టోల్ ప్లాజా మూసేసినా తొలగించని నిర్మాణాలు - తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
రద్దీ సమయాల్లో పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద వాహనదారులు ఇబ్బందులు - కొత్తగా ఈ రహదారిపై ప్రయాణించే వారికి తప్పని అవస్థలు - వేగ నిరోధకాలు, ఇతర నిర్మాణాలను తొలగించని వైనం

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 22, 2026 at 6:42 PM IST
Pottipadu Toll Plaza Problems in Krishna District: అక్కడ టోల్ ప్లాజా లేదు. డబ్బు చెల్లించాల్సిన పనీ లేదు. కానీ వాహన వేగం మాత్రం తగ్గాల్సిందే. కౌంటర్ల మధ్య అప్రమత్తంగా వెళ్లాల్సిందే. ఎందుకంటే టోల్ ప్లాజా శాశ్వతంగా మూసేసినా నిర్మాణాలు మాత్రం తొలగించలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై పొట్టిపాడు వద్ద ఉన్న టోల్ ప్లాజాను ఇటీవలే నిలిపివేశారు.
విజయవాడ బైపాస్ అందుబాటులోకి రావడంతో కొత్త టోల్ ప్లాజా ఏర్పాటు చేసి 20 ఏళ్లుగా ఉన్న ఈ ప్లాజాను శాశ్వతంగా మూసివేశారు. టోల్ ప్లాజా మూసివేసినా టోల్ బూత్లు, వేగ నిరోధకాలు, ఇతర నిర్మాణాలు తొలగించకపోవడంతో రద్దీ సమయాల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ జాతీయ రహదారిపై కొత్తగా ప్రయాణించే వారు ఇక్కడ టోల్ ప్లాజా ఉందేమో అనుకుని పొరబడుతున్నారు.
వినియోగంలో లేని టోల్ ప్లాజా: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు వద్ద 20 ఏళ్ల క్రితం నిర్మించిన టోల్ ప్లాజాను ఇటీవల మూసివేశారు. విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రారంభం కావడంఅందులో కొత్తగా నిర్మించిన టోల్ ప్లాజా అందుబాటులోకి రావడంతో ఈ టోల్ ప్లాజాను శాశ్వతంగా నిలిపివేశారు. అయితే ఇక్కడ ఉన్న వేగ నిరోధకాలు, టోల్ బూత్లు, ప్లాజా పక్కన ఉన్న నిర్మాణాలు తొలగించడం మాట మరిచిపోయారు.
విజయవాడ బైపాస్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. వాస్తవానికి రెండేళ్ల కిందటే పొట్టిపాడు టోల్ ప్లాజాను తొలగించాల్సి ఉంది. అప్పట్లోనే అధికారులు టోల్ ప్లాజా తొలగింపునకు ప్రతిపాదనలు రూపొందించారు. టోల్ ప్లాజాను మొత్తం కూల్చివేయడంతో పాటు, 6 వరసల రహదారి, సర్వీసు రోడ్ల నిర్మాణం అనుసంధానం చేసేలా పనులకు అంచనాలు రూపొందించారు. టోల్ ప్లాజా కూల్చివేత కోసమే సుమారు రూ.24 లక్షలు కేటాయించారు.
వాహనదారులకు అయోమయం: ఈనెల ఒకటి నుంచి పొట్టిపాడు వద్ద టోల్ వసూలు నిలిపివేశారు. దీంతో రద్దీ తగ్గినా వాహనదారులకు మాత్రం సాఫీగా ముందుకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. కనీసం వేగ నిరోధకాలైనా తొలగించకపోవడం, భారీ వాహనాల నిలిపివేతను నివారించలేకపోవడం ఇబ్బందిగా మారింది. రెండేళ్లు గడిచినా, విజయవాడ బైపాస్ అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ టోల్ ప్లాజాను తొలగించకపోవడంతో ఇప్పటికీ ఈ మార్గంలో ప్రయాణించే వారు ఇక్కడ టోల్ ప్లాజా ఉందేమో అనుకుని ఒక్కసారిగా వాహనాల వేగాన్ని తగ్గిస్తున్నారు. టోల్ ప్లాజా తొలగించినట్లు ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో వాహనాలు ఒక లైన్ నుంచి మరో లైన్‌కు మారుతూ వెనుక వచ్చే వాహనదారులను అయోమయానికి గురిచేస్తున్నారు.
ఏ బూత్ వైపు వెళ్తుందో అర్ధం కాని పరిస్థితి: ఈ టోల్ ప్లాజా అందుబాటులో ఉన్నప్పుడే ఇక్కడ నిర్వహణ అధ్వానంగా ఉండేది. ఇరువైపులా 8 బూత్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేలా వసతులు కల్పించలేదు. దీంతో ఏ వాహనం ఏ క్షణంలో ఏ బూత్ వైపు వెళ్తుందో అర్ధం కాని పరిస్థితి. చివరి బూత్ నుంచి వచ్చే వాహనాల ఎదురుగా సర్వీసు రోడ్డు ఉండడంతో ప్రధాన మార్గంలోకి వచ్చేందుకు ఒక్క సారిగా మలుపు తిప్పేయడం తరచుగా ప్రమాదాలకు కారణమవుతోంది. వినియోగంలో లేని ఈ టోల్ ప్లాజాను త్వరితగతిన తొలగిస్తే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.
"విజయవాడ బైపాస్ అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ టోల్ ప్లాజాను తొలగించలేదు. ఇప్పటికీ ఈ మార్గంలో ప్రయాణించే మాలాంటి ఎంతో మంది ఇక్కడ టోల్ ప్లాజా ఉందేమో అనుకుని ఒక్కసారిగా వాహనాల వేగాన్ని తగ్గిస్తున్నారు. టోల్ ప్లాజా తొలగించినట్లు ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో వాహనాలు ఒక లైన్ నుంచి మరో లైన్‌కు మారుతూ ఇప్పటికీ వెనుక వచ్చే వారంతా అయోమయానికి గురవుతున్నారు. వినియోగంలో లేని ఈ టోల్ ప్లాజాను త్వరితగతిన తొలగిస్తే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని మేమంతా ఈ సందర్భంగా కోరుతున్నాం"-వాహనదారులు
పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లాలంటే రూ.250 కట్టాల్సిందే - వాహనదారుల ఆందోళన

