YUVA : అరుదైన ఘనత సాధించిన ఆదివాసీ యువతి - అక్కడ ఎంబీబీఎస్ సీటు సాధించిన తొలి విద్యార్థినిగా రికార్డు
ఎంబీబీఎస్ సీటు సాధించిన ఆంద్ తెగ యువతి శివానంద - ఆదిలాబాద్ జిల్లా ఆంద్ తెగ నుంచి కాబోయే మొదటి డాక్టర్ - పాఠశాల నుంచి ఇంటర్ వరకు సర్కారు బడుల్లోనే

Published : October 18, 2025 at 4:47 PM IST
Poor Tribal Girl Got MBBS Seat : అదో కుగ్రామం. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే ఆదివాసీ గూడెం. అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉండే పల్లె ప్రాంతం. అందులోనూ అరుదైన ఆంద్ తెగకు నిలయమైన ఆవాసం. అక్కడ చదువుకోవడమే అరుదు. అందులోనూ వైద్యులు అసలే లేరు. ఆ వెలితే ఓ యువతిని ఆలోచనల్లో పడేసింది. తానే ఎందుకు డాక్టర్ కాకూడదని ఆలోచించింది. అంతటితో ఊరుకోలేదు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పట్టుదలతో చదివింది. నీట్ ఫలితాల్లో మంచిర్యాంకుతో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్‌కు చెందిన చెందిన శివానంద స్ఫూర్తిదాయక గాథ ఇది.
చిన్నప్పటి నుంచి ప్రభుత్వ బడుల్లోనే చదువు : ఆంద్ తెగకు చెందిన ఈ యువతి పేరు శివానంద. ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్ స్వస్థలం. జవాదే పూజ, రామేశ్వర్ దంపతుల మూడోసంతానం. సామాన్య వ్యవసాయ కుటుంబం. స్థానిక సర్కార్ బడిలో ఐదో తరగతి చదివిన ఈ విద్యార్థిని ఇంద్రవెల్లి ప్రభుత్వ వసతిగృహంలో పదో తరగతి, ఇచ్చోడ గురుకులంలో బైపీసీ పూర్తి చేసింది.

డాక్టర్ కావాలనేది ఆమె కల. దాన్ని నిజం చేసుకునేందుకు నిరంతరం శ్రమించింది. ఇంటర్ చదివేటప్పుడే జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఎంపికచేసే స్టార్ బ్యాచ్‌కి ఎంపికైంది. ఆ శిక్షణతో వైద్యవిద్యలో ప్రవేశానికి నీట్ పరీక్ష రాసి సీటు సాధించింది. నీట్ 2025 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 376 మార్కులు ఎస్టీ కేటగిరీలో 4979 ర్యాంకుతో మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సీటు సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల్లో అరుదైన ఆంద్ తెగలో ఎంబీబీఎస్ సీటు సాధించిన తొలి యువతిగా రికార్డు నెలకొల్పింది.
తనలాంటి ఎంతోమందికి ప్రేరణగా : అడవిని ఆనుకుని వ్యవసాయమే ఆధారంగా జీవించే ఆదివాసీల్లో అరుదైన ఆంద్ తెగ ఈ అమ్మాయిది. వారి జనాభా కూడా తక్కువే. అయితే ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకొని నీట్‌లో సీట్ సంపాదించడం అంత సులువేం కాదు. అందుకే తనలాంటి ఆదివాసీ తెగల విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తోంది శివానంద. గురువుల సలహాలు, సూచనలతో డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నట్లు చెబుతోందీ మన్యం మాణిక్యం. ఏ సమస్య వచ్చిన దేవుళ్లని, మొక్కలని ప్రార్థించే వీరు అంతే సమానంగా ప్రాణాలు కాపాడే వైద్యుడ్ని చూస్తారు. ఆ తెగలో చదువుకున్న వారే అరుదు. అందులోనూ డాక్టర్లు అసలే లేరు. అందుకే తాను వైద్యుడ్ని కావాలనుకున్నానని చెబుతోంది విద్యార్థిని.
"ఎంబీబీఎస్ సీటు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఆంద్ తెగలో ఇప్పటి వరకు ఎవరూ డాక్టర్లు కాలేదు. అందుకే నేను వైద్యురాలిని కావాలనుకున్నాను. మా ఆంద్ జాతి అంటే ఇప్పటికీ చాలా మందికి తెలియదు. నేను డాక్టర్‌గా సేవలందిస్తూ మా జాతిని మంచి స్థాయికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నా. సమాజానికి నా వంతగా సేవ చేస్తాను"- శివానంద, ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని
ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం : తల్లిదండ్రులది సాధారణ వ్యవసాయ కుటుంబం కావడంతో కళాశాల ఫీజుల కోసం ఉట్నూర్ ఐటీడీఏ తరఫున అధికారులు 50వేల రూపాయలు ఆర్ధికసాయం అందించారు. ఆమె ప్రతిభ ఏజెన్సీ పిల్లల్లో ప్రేరణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదువుకు ప్రత్యామ్నాయం లేదనీ, ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన జరగాలంటే ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదివాసీ పెద్దలు కోరుతున్నారు. అటవీప్రాంత ఆవాసంలో జన్మించిన శివానంద చదువుకు ప్రాధాన్యత ఇచ్చింది. తన చదువు తనకే కాదు జాతికి ప్రయోజనకరంగా నిలవాలని ఆకాంక్షించి ఎంబీబీఎస్ సాధించింది. భవిష్యత్‌లో ఏజెన్సీ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమంటోంది శివానంద.
ఫుట్‌బాల్ క్రీడాలో రాణిస్తున్న గిరిజన యువతి - ఆ పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారిణిగా రికార్డు

