నకిలీ బాబాల లీలలు అన్నీ ఇన్నీ కాదు! - పూజలు పేరు చెప్పి లైంగిక వేధింపులు
మంత్రతంత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న దొంగ బాబాలు - మూఢ నమ్మకాలే పెట్టుబడిగా సొమ్ము చేసుకుంటున్న వైనం - ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలుంటాయన్న పోలీసులు

Published : October 16, 2025 at 6:36 PM IST
Police urge people to be vigilant about Fake babas : అత్యాధునిక సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని(టెక్నాలజీ) సొంతం చేసుకున్న మానవుడు ఈ భూ ప్రపంచంపైనే కాకుండా అంతరిక్షంలోనూ రోజురోజుకూ ఎన్నో కొత్త విషయాలను కనుగొంటున్నాడు. ఇలాంటి కంప్యూటర్ యుగంలోనూ కొంతమంది మూఢనమ్మకాలతో బాబాలను, స్వాములను, మంత్ర తంత్రాలను నమ్ముతూ ఏదో ఓ చోట మోసపోతూనే ఉన్నారు. ఈ కోవలోనే విద్యావంతులు సైతం ఉండటమనేది గమనార్హం. మూఢనమ్మకాలే పెట్టుబడిగా బాబాలు, స్వాములు వారికి మాయ మాటలను చెబుతూ నమ్మించి క్షుద్ర పూజలు చేస్తూ అందినకాడికి కాజేస్తున్నారు. మరికొందరు నమ్మించి యువతులు, మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు.

లైంగిక వేధింపులు : ఆదిలాబాద్‌లోని ఓ కాలనీకి చెందిన బాలిక(17)కు కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతోంది. దీంతో గాదిగూడ మండలంలోని మారెగాంకు చెందిన షేక్ కలీం బాబాను బాలిక కుటుంబ సభ్యులు సంప్రదించారు. ఆమెకు దుష్టశక్తి సోకిందని నమ్మించి పూజల పేరుతో అమ్మాయిని లైంగికంగా వేధించాడు. ఆ విషయం పసిగట్టిన కుటుంబ సభ్యులు బాబాపై వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
నాగదోషం పేరుతో : పట్టణంలోని ఒక కాలనీకి చెందిన బాలిక(17) ఆరోగ్యం బాగాలేకపోవటంతో మాంత్రికుడిచే పూజలు చేయిస్తే నయమవుతుందని బాధితురాలి తల్లికి తెలిసిన ఓ వ్యక్తి నమ్మించాడు. బాలికను మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకా సార్ఖని గ్రామానికి చెందిన అంబిహేకుమార్ అనే వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాడు. నాగదోషం ఉందని చెప్పి, పూజల పేరిట ఒక గదిలోకి బాలికను ఒంటరిగా తీసుకెళ్లి నగ్నంగా పడుకోబెట్టాడు. అతడి వ్యవహారంపై అనుమానం వచ్చిన బాధితురాలి తల్లి తలుపులను తీయగా మాంత్రికుడి బండారం బయట పడింది.

నాటు వైద్యంతో నడుం విరగ్గొట్టి : కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన మహిళ అనారోగ్యం బారిన పడింది. దీంతో బోథ్ మండలంలోని గొల్లపూర్ గ్రామంలో నాటు వైద్యంతో నయం చేస్తాడని తెలిసి అతడి వద్దకు వెళ్లారు. నిందితుడు వైద్యం చేస్తానని చెప్పి బాధిత కుటుంబం నుంచి రూ.1.70 లక్షలు తీసుకోవటంతో పాటు నాటు వైద్యం పేరుతో ఆమె నడుముపై తన్నటంతో ఎముకలు విరిగిపోయాయి. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా బాధిత కుటుంబానికి రూ.23 లక్షలు ఖర్చు కాగా, ఆమె మంచానికే పరిమితమైంది.
శిక్ష ఇలా : క్షుద్ర పూజలు, మంత్ర తంత్రాలు, నాటు వైద్యం చేసే వారిపై పోలీసులు ‘ది డ్రగ్ అండ్ బ్లాక్ మ్యాజిక్ రిమిడీస్ యాక్ట్-1954’ ప్రకారం కేసులు నమోదు చేస్తారు. నేరం రుజువు అయితే మొదటి సారి ఆరు నెలల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. నిందితుడు రెండోసారి కూడా అదే విధంగా చేస్తే ఏడాది జైలు లేదా జరిమానా, రెండూ విధించేందుకు అవకాశాలుంటాయి.

మోసం చేస్తే కేసులు : మంత్ర తంత్రాల పేరుతో క్షుద్ర పూజలు చేసి ప్రజలను మోసం చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. ప్రజలు సైతం ఇలాంటి వారిని నమ్మొద్దని కోరారు. అనారోగ్యం బారిన పడితే గుర్తింపు ఉన్న డాక్టర్లు, హాస్పిటల్స్‌లో మాత్రమే చికిత్సలు తీసుకోవాలని అన్నారు.
పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన బాబా.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

