పెద్ద దస్తగిరి ఇంట్లో ఆస్తిపత్రాలు - వైఎస్సార్సీపీ కీలక నేత కుటుంబీకుల పేరిట భూములు
పెద్ద దస్తగిరి ఇంట్లో ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు - వైఎస్సార్సీపీ కీలక నేత భార్య, కుమారుడి పేరిట భూములు ఉన్నట్లు గుర్తింపు - ఆస్తి పత్రాల్లోని ఇతరుల పేర్లపైనా కూపీ లాగుతున్న అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 21, 2026 at 9:33 AM IST
|Updated : April 21, 2026 at 1:11 PM IST
Big Twist in Pedda Dasthagiri Murder Case: హత్యకు గురైన వైఎస్సార్సీపీ నాయకుడు పెద్ద దస్తగిరి ఇంట్లో లభ్యమైన ఆస్తి పత్రాల్లో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఓ వైఎస్సార్సీపీ కీలక నేత భార్య, కుమారుడి పేరిట పలు భూములు ఉన్నట్లు వెల్లడైంది. ఆస్తిపత్రాల విశ్లేషణ ఇంకా కొనసాగుతోంది. ఇది పూర్తైతే హత్య కేసులో పెద్ద వారి ప్రమేయం వెలుగులోకి వచ్చే అవకాశముంది.
కడప రిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో ఇటీవల దారుణహత్యకు గురైన వైఎస్సార్సీపీ నాయకుడు, స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసు విచారణలో కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా పెద్ద దస్తగిరి సెటిల్‌మెంట్లు, వివాదాల ద్వారా కొల్లగొట్టిన అత్యంత విలువైన భూములను ఆ పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడు, మాజీ ప్రజాప్రతినిధి భార్య, కుమారిడి పేరిట రాసినట్లు పోలీసు, రెవెన్యూ బృందాలు గుర్తించాయి. అయితే వీటిలో ఎక్కువ శాతం భూములన్నీ కమలాపురం నియోజకవర్గంలోని సీకే దిన్నె మండల పరిధిలోనే ఉన్నట్లుగా తేల్చాయి.
హత్య వెనక పెద్ద వారి ప్రమేయం: పెద్ద దస్తగిరి నివాసంలో ఇటీవల చేపట్టిన సోదాల్లో రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆస్తులకు సంబంధించిన ఒరిజనల్ సేల్ డీడ్‌లు, క్రయ, విక్రయ ఒప్పంద పత్రాలను రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు రెండు రోజులుగా విశ్లేషిస్తున్నారు. విలువైన ఆస్తులకు సంబంధించిన కొన్ని పత్రాలు వైఎస్సార్సీపీ కీలక నాయకుడి భార్య, కుమారుడి పేరిట ఉన్నట్లుగా గుర్తించడం గమనార్హం. ఆ ముఖ్య నాయకుడికి, పెద్ద దస్తగిరికి మధ్య మరిన్ని లావాదేవీలు జరిగినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద దస్తగిరి హత్య వెనక వైఎస్సార్సీపీ నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఒక్కరే కాకుండా మరికొన్ని పెద్దల ప్రమేయం సైతం ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఆస్తి పత్రాల విశ్లేషణ సమగ్రంగా పూర్తైన తర్వాత వారెవరన్నది తెలిసే అవకాశముంది.
ఎక్కువ శాతం వివాదాల్లో ఉన్న భూములే: అంతేకాకుండా రూ. 100 కోట్ల విలువైన ఆస్తులు పెద్ద దస్తగిరివేనా లేదా ఒకవేళ కీలక నేతలకు సంబంధించిన బినామీ ఆస్తులా అనే కోణంలో పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి విశ్లేషిస్తున్నారు. దస్తగిరి పేరిట ఉన్న భూములు ఎవరి నుంచి అతనికి సంక్రమించాయి, వాటిని ఆయన ఎవరికి బదిలీ చేశారు, ఈ లావాదేవీలు ఎందుకు జరిగాయని శోధిస్తున్నారు, వైఎస్సార్సీపీ కీలక నేత భార్య, కుమారుడి పేరిట పెద్ద దస్తగిరి ఎందుకు ఆస్తులు రాశారు, వారి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నడిచాయనే కోణంలో పోలీసులు తమ విచారణ ముమ్మరం చేశారు. పెద్ద దస్తగిరి ఇంట్లో లభ్యమైన ఆస్తి పత్రాల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ, ప్రైవేటు, స్థిరాస్తి వివాదాల్లో ఉన్న భూములవే ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ఆ పత్రాల్లో కొన్ని ఇతరుల పేరిట ఉండటంతో వారెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఫోన్లను ఇళ్ల వద్దే ఉంచి పరార్: దస్తగిరి ఇంట్లో లభ్యమైన ఖాళీ స్టాంపులు, రెవెన్యూ అధికారుల సీళ్లను ఫోర్జరీ పత్రాల తయారీకి వినియోగిస్తున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక నిందితుడైన వైఎస్సార్సీపీ నేత నిత్యానందరెడ్డి నివాసంతో పాటు ఆయన అనుచరుల ఇళ్లలో పోలీసులు సోమవారం సోదాలను నిర్వహించగా, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వారు ఫోన్లను ఇంటి వద్దే వదిలేసి పరారవ్వడం గమనార్హం.
పెద్ద దస్తగిరి హత్య కేసు - వైఎస్సార్సీపీ నాయకుడు నిత్యానందరెడ్డిది కీలక పాత్ర!

