ETV Bharat / state

హైదరాబాద్‌లో కోళ్ల వ్యర్థాల అక్రమ రవాణా - 120 టన్నుల చికెన్ వేస్ట్ సీజ్​

చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న 7 లారీలను సీజ్‌ చేసిన అధికారులు - 120 టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు - వీటిని చేపలకు ఆహారంగా వాడుతున్నట్లు గుర్తింపు

Chicken Waste Illegal Transport Hyderabad
Chicken Waste Illegal Transport Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 10, 2026 at 10:36 PM IST

3 Min Read
Choose ETV Bharat

Chicken Waste Illegal Transport Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న 7 లారీలను పోలీసులు సీజ్ చేశారు. వీటిని చేపలకు ఆహారంగా వాడుతున్నట్లు గుర్తించిన పోలీసులు 120 టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యర్థాలు గుంటూరు, భీమవరం వినుకొండ, అద్దంకిలోని చేపల చెరువులకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యర్థాలు తిన్న చేపలతో ఆరోగ్యానికి ప్రమాదకరమని పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం టాస్క్ ఫోర్స్ డీసీపీ, వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.

ప్రశ్న : ఈ దందా ఎక్కడ జరుగుతుంది? ఈ వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారు?
ఈ రోజు హెచ్​ ఫాస్ట్​ టీమ్​ చికెన్ వేస్ట్​​ ట్రాన్స్​పోర్ట్​ గ్యాంగ్​పై దాడులు నిర్వహించింది. దీనిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. 7 వాహనాలను సీజ్​ చేశాం. భారీ మొత్తంలో చికెన్​ వేస్ట్​ లభించింది. నగర వ్యాప్తంగా వృధా అయిన చికెన్​ను చిన్నచిన్న షాపుల నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్​కు పంపుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, చికెన్​ వ్యర్థాలను జీహెచ్​ఎంసీ పరిధిలోని శుద్ధి కర్మాగారానికి పంపాలి. అక్కడ దీనిని ప్రాసెస్ చేసిన తర్వాత డాగ్ ఫీడింగ్, ఫిష్​ ఫీడింగ్​, పౌల్ట్రీ ఫారమ్​లకు పంపిణీ చేయొచ్చు.

అయితే ఆలా చేయకుండా అనేకమంది అక్రమంగా చికెన్​ షాపుల నుంచి వీటిని కొనుగోలు చేసి నేరుగా ఆంధ్రప్రదేశ్​లోని పలు ప్రాంతాలకు అమ్ముతున్నారు. ఇలా పాడైన చికెన్ వ్యర్థాల​ను చేపలకు ఆహారంగా వీటిని వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరం, దీనిలో అనేక హానికర రసాయనాలు కూడా ఉంటాయి. ఈ ఆహారం తీసుకున్న చేపలను మనం తినడంతో క్యాన్సర్​ లాంటి వ్యాధులు వస్తాయి. ఈరోజు నలుగురిని అరెస్టు చేశాం. దీనిలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే విషయంపై గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరిపైన కూడా చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న : ఇవి ప్రధానంగా నగరంలోని ఏయే ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు?
హైదరాబాద్​ కమిషనరేట్​లోని అనేక ప్రాంతాల నుంచి వీరు సేకరిస్తున్నారు. అంబర్​పేట్​, జియాగూడ, అత్తాపూర్​ ప్రాంతాలను గుర్తించాం. ఆటోల ద్వారా చిన్న షాపుల నుంచి గొడౌన్​లోకి డంపింగ్​ చేస్తున్నారు. అక్కడి నుంచి పెద్ద వాహనాలలో వీటిని ఏపీకి తరలిస్తున్నారు. దీనిలో అనేక మంది ఏజెంట్ల భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక వీరిపైనా చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న : కల్తీ చర్యలకుపాల్పడిని వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
గత 3 నెలల నుంచి హెచ్​ ఫాస్ట్​ టీమ్ చాలా బాగా పని చేస్తోంది. హైదరాబాద్​ సిటీ కమిషనరేట్​ పరిధిలో ఎవరైనా ఆహారాన్ని కల్తీ చేసి, సరఫరా చేసే వారిపై నిఘాపెట్టాం. వీరిపై అనేక కేసులు వేశాము. వెజ్​, నాన్​వెజ్​ ప్రొడక్ట్స్, నాన్​వెజ్​ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్​ ఇలా అనేక తిండి పదార్ధాల కల్తీకి పాల్పడుతున్న వారిపై కేసులు బుక్ చేశాం.

దీనిలో రిపీట్​గా ఇలాంటి వ్యవహారాల్లో పాల్గొనే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. వీరికి ట్రేడ్​ లైసెన్స్, షాప్​ లైసెన్స్​​ క్యాన్సిల్​ చేస్తాం. నగరంలోని వ్యాపారులందరికీ మా విజ్ఞప్తి ఒక్కటే, వ్యాపారులంతా సక్రమంగా, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్​పోర్టింగ్​ చేసి వ్యాపారాలు కొనసాగించాలి. ప్రతి ఒక్కరూ నిబంధనలను అతిక్రమించరాదు. పాడైపోయిన, కుళ్లిని ఆహార పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న : చేపల చెరువులో ఇలాంటి వ్యర్థాలు వేయడం వల్ల జరిగే అనర్థాలు ఏంటి?
చికెన్​ వేస్ట్​ను సైంటిఫిక్​గా ప్రాసెస్​ చేసి ఫిష్​ ఫీడ్​గా వినియోగించుకోవచ్చు. కానీ ఈ ముఠాలు వీటిని ప్రాసెస్​ చేయకుండా అక్రమంగా తరలిస్తూ చేపల చెరువులకు వేస్తున్నారు. దీనిలో కార్సినోజెనిక్​ ఏజెంట్లు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ చేపలను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

ప్రశ్న : నగరంలో ఎన్ని రోజుల నుంచి ఈ దందా నడుస్తున్నట్లు మీ దృష్టికి వచ్చింది? దీనికి మీరు ఎలా స్పందించారు?
దీనిలో మాకు వచ్చిన సమాచారం ఆధారంగా అనేక ఆధారాలను సేకరించాం. ఈ ముఠాలు ఏయే ప్రాంతాల్లో ఉంటున్నాయి ఎలా దందా చేస్తున్నాయి అనే విషయాలను సేకరించి ఈ రోజు వీరిని పట్టుకోగలిగాం.

ఆహారం కల్తీ చేస్తే పీడీ యాక్ట్ - పోలీసుల యాక్షన్ షురూ!

ఐస్‌క్రీమ్​లు, బన్నులు, కేక్‌లు ఏదీ వదలట్లేదు - హైదరాబాద్​లో రెచ్చిపోతున్న కల్తీ మాఫియా