ETV Bharat / state

కిలాడీ సాధిక్‌ఖాన్‌ జాడ ఎక్కడ? - ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కొనసాగుతున్న విచారణ - నిందితుడు సాధిక్‌ ఖాన్‌ ఆచూకీ కోసం ముమ్మరంగా అన్వేషణ - సాధిక్ ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ఇస్తామని పోలీసుల ప్రచారం

AE Nookaraju Case Updates
AE Nookaraju Case Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 20, 2026 at 10:55 AM IST

2 Min Read
Choose ETV Bharat

AE Nookaraju Case Updates : కాకినాడకు చెందిన పంచాయతీరాజ్‌ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకిన ఘటనలో నిందితుడు సాధిక్‌ఖాన్‌ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి పరారీలో ఉన్న అతన్ని పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. విజయవాడ, హైదరాబాద్‌, విశాఖ, బెంగళూరు, రాయగడలో అన్వేషిస్తున్నాయి. మరోవైపు నూకరాజు కుటుంబ ఆర్థిక లావాదేవీలపైనా పోలీసులు దృష్టి సారించారు.

పిఠాపురం ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్యను బెదిరించి వేధింపులకు గురిచేయడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సౌజన్య, ఆమె భర్త జగదీశ్వరరెడ్డికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఆస్తి పత్రాలు సాధిక్ ఆధీనంలోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నూకరాజు కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి సాధిక్‌ ఖాతాకు ఏమైనా భారీగా మొత్తాలు బదిలీ అయ్యాయా? అనే కోణంలో విచారణ సాగుతోంది.

కిలాడీ సాధిక్‌ఖాన్‌ జాడ ఎక్కడ? - ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు (ETV Bharat)

ఆ వాహనాలను ఎవరు ఉపయోగించారు?: బ్యాంకు స్టేట్‌మెంట్లను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నూకరాజు కుటుంబానికి నాలుగైదు కార్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో రెండు మృతిచెందిన అల్లుడు జగదీశ్వరరెడ్డి పేరుతో ఉన్నట్లు నిర్ధారించారు. ఆ వాహనాలను ఎవరు ఉపయోగించారు? వాటిలో ఏమైనా పత్రాలు దాచారా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. నూకరాజు ఇంటిని బంధువుల సమక్షంలో పోలీసులు పరిశీలించి, ఓ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. అందులోని సమాచారాన్ని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తున్నారు. నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.

కొనసాగుతున్న పోలీసుల నిఘా: కాకినాడ టూటౌన్ పీఎస్ పరిధిలో ఉంటున్న నిందితుడు సాధిక్‌ఖాన్‌ నివాసం వద్ద పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. తల్లి, చెల్లితో కలిసి ఉంటున్న అతడి అన్నయ్య విశాఖలో మెడికల్‌ రిప్రజెంటేటివ్ కాగా మరో సోదరి రాజమహేంద్రవరంలో ఉన్నారు. పోలీసులు సాధిక్ కుటంబాన్ని విచారించగా ఏమీ తెలియదని చెప్పినట్లు సమాచారం. కాకినాడ గొడారిగుంటలో అతను నిర్వహించే రైఫిల్ షూటింగ్ అకాడమీకి వచ్చే విద్యార్థులతోనూ మాట్లాడుతున్నారు. సాధిక్ ఆచూకీ తెలిపిన వారికి రివార్డు అందిస్తామని, సామాజిక మాధ్యమాల్లో పోలీసులు ప్రచారం చేస్తున్నారు. సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి జులై 2న మృతిచెందగా అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేసే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.

నూకరాజు మృతదేహానికి పంచనామా: ఏఈ నూకరాజు భార్య, కుమార్తె ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వారి కోసం ధవళేశ్వరం బ్యారేజీ ఎగువన ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది నదిలో విస్తృతంగా గాలిస్తున్నారు. పోలీసులు, మత్స్యకారులు కలిసి గత రెండు రోజులుగా ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. 15 మందితో కూడిన ఎస్‌డీఆర్‌ఆఫ్‌ బృందం, మరో 10 మంది మత్స్యకారులు ప్రత్యేక బోట్ల సహాయంతో గాలిస్తున్నప్పటికీ, మంగళవారం సాయంత్రం వరకు నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్యల ఆచూకీ లభించలేదు. ఈ ప్రమాదంలో నూకరాజు మృతదేహానికి పంచనామా పూర్తయింది. మిగతావారి ఆచూకీ తెలిశాక నూకరాజు మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని కుటుంబసభ్యులు కోరారు. కాగా, ఈ ఘటనలో 10 ఏళ్ల కుమారుడు కార్తికేయరెడ్డి నదిలో ఈదుకుంటూ వచ్చి, స్థానిక మత్స్యకారుల సాయంతో ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే.


ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసు - వెలుగులోకి సౌజన్య లేఖలు, సాధిక్‌ అకృత్యాలు

ఇంకా లభించని నూకరాజు కుటుంబ సభ్యుల ఆచూకీ - కొనసాగుతున్న గాలింపు చర్యలు