'కుదిరితే అమ్మేద్దాం - కుదరకపోతే భిక్షాటన చేయిద్దాం' - పిల్లల కిడ్నాప్ వెనక మాస్టర్ ప్లాన్లు!
గచ్చిబౌలి పరిధిలోని లేబర్ క్యాంపులో చిన్నారుల అదృశ్యం - చిన్నారులను అపహరించిన పశ్చిమ బెంగాల్ వాసి చాకూసోరేన్ - 4 గంటల్లోనే ఛేదించి చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

Published : August 27, 2026 at 4:47 PM IST
Police Rescue Missing Children in Gachibowli : మూడంతస్తుల భవన సముదాయంలో వలస వచ్చి జీవిస్తున్న ఉత్తరాదీలు. చుట్టూ అంతా తెలిసిన వారే కావడం, సమీపంలోనే పని చేసే ప్రాంతం కావడంతో చిన్న పిల్లల్ని ఇంట్లోనే వదిలి తల్లిదండ్రులు పనికి వెళ్లి వచ్చేవారు. అలా ఓ జంటకు 'అన్నా నేను ఉన్నాగా. పిల్లల్ని నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా పనికి వెళ్లండి' అంటూ వారి సన్నిహితుడు భరోసా ఇచ్చాడు. పని నుంచి తిరిగొచ్చిన ఆ జంటకు ఊహించని షాక్ తగిలింది.
ఇంట్లో పిల్లలు కనిపించలేదు. అర్ధరాత్రి ఒంటిగంట అయ్యింది. అయినా వెతుకులాట మాత్రం ఇంకా కొనసాగుతోంది. చివరకు ఆశలు కోల్పోయిన ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మరి పోలీసులు పిల్లలను కనిపెట్టారా? అసలు పిల్లలు ఏమయ్యారు? 'నేనున్నాను' అని ఆ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చిన వ్యక్తి ఎక్కడికి వెళ్లాడు? పిల్లల కోసం ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన పోలీసుల వేటకు ఫలితమేంటి? ఈ కథనంలో చూద్దాం.
ఇటీవల హైదరాబాద్‌కు వలసలు బాగా పెరిగాయి. ఉత్తరాది నుంచి ఎంతో మంది వచ్చి దినసరి కూలీలుగా జీవిస్తున్నారు. అంతా ఒకేచోట ఉంటారు. చుట్టూ అంతా తెలిసిన వారే కావడంతో ఓ కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవారు. ఉత్తరాది నుంచి వచ్చారని తెలిస్తే చాలు ఆరా తీయకుండా వారు అక్కున చేర్చుకునే వారు. అలా పశ్చిమ బంగాల్ నుంచి వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినందుకు 2 కుటుంబాలకు ఊహించని చుక్కెదురైంది. చాలాసేపటి వరకు నానా కంగారు పడిన ఆ కుటుంబాల వాళ్లు పోలీసులను ఆశ్రయించడంతో అతని బండారం బయటపడింది. అసలు ఎవరా వ్యక్తి? అతనేం చేశాడు?
మత్తు కలిపిన చాక్లెట్స్ ఇచ్చి : ఝార్ఖండ్‌కు చెందిన డేవిడ్ ముర్ము, హోపన్ హేమరామ్ అనే ఇద్దరు వ్యక్తులు కుటుంబంతో గచ్చిబౌలి పరిధిలోని కొండాపూర్ లేబర్ క్యాంప్‌లో నివాసముంటున్నారు. ఇటీవల అదే క్యాంపులో ఉంటున్న పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన చాకుసోరెన్ అనే వ్యక్తి వారికి పరిచయమయ్యాడు. అప్పుడప్పుడు వారికి సహాయంగా ఉంటూ, పిల్లల్ని ఆడిస్తూ వారితో సన్నిహితంగా మెలిగే వాడు. ప్రతిరోజులాగానే వారు పనికి వెళ్లారు. వారి కుమార్తెలు నాలుగేళ్ల ప్రమీల ముర్ము, మూడున్నరేళ్ల సంగీత ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నారు. వారిపై కన్నేసిన సోరెన్ ఎవ‌్వరూ చూడకుండా వారికి మత్తు కలిపిన చాక్లెట్స్ ఇచ్చాడు. అవి తిన్న వారు స్పృహతప్పి పడిపోయారు. ఎవ‌్వరూ గమనించకుండా నిందితుడు వారిని తీసుకుని పరారయ్యాడు.
చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు : ఇంటికి తిరిగొచ్చి పిల్లలు కనిపించకపోవడంతో చాలా సేపు వెతికిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌లో పశ్చిమబంగాల్ వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. కిడ్నాప్ వెనక అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఈ కేసును గంటల్లోనే ఛేదించి చిన్నారులను తల్లిదండ్రుల ఒడికి చేర్చారు.
భిక్షాటన కోసం కిడ్నాప్ : నిందితుడు చాకు సోరెన్ స్వస్థలం పశ్చిమ బంగాల్‌లోని కరంఢిఘి ప్రాంతం. సోరెన్‌పై పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే 2 క్రిమినల్ కేసులు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వాటిలో ఒకటి హత్యాయత్నం కేసు, మరొకటి అత్యాచారానికి సంబంధించినదిగా పోలీసులు తెలిపారు. నిందితుడు పిల్లలను కిడ్నాప్ చేసి భిక్షాటన కోసం ఇతరులకు విక్రయించే పథకం వేసినట్లు గుర్తించారు.
తల్లిదండ్రుల కళ్లలో సంతోషం : కేసు నమోదైన వెంటనే పలు పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేసిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. రాష్ట్రం సరిహద్దు దాటక ముందే చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన గచ్చిబౌలి ఎస్సై జయప్రకాశ్, కానిస్టేబుల్ అలీంలను డీసీపీ శ్రీనివాస్ అభినందించారు. పిల్లలను తిరిగి పొందినప్పుడు తల్లిదండ్రుల కళ్లలో సంతోషం చూస్తే ఆనందంగా ఉందని ఎస్సై జయప్రకాశ్ తెలిపారు.
తమ ప్రాంతం వాడే అన్న అభిమానంతో బాధితులు నిందితుడి వివరాలు తెలుసుకోకుండానే పరిచయం పెంచుకున్నారు. చివరకు అతని వక్రబుద్ధి తెలుసుకుని ఆందోళన చెందారు. చివరకు పిల్లలు తమ ఒడి చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
"సోరెన్‌పై పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే 2 క్రిమినల్ కేసులు ఉన్నాయి. హత్యాయత్నం కేసు, మరొకటి అత్యాచారానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. 5 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించాడు. మార్చిలో జైలు నుంచి విడుదలయ్యాడు. అక్కడ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వారిని అమ్మడం కానీ భిక్షాటన చేయించడం కానీ చేస్తానని సోరెన్ ఒప్పుకున్నాడు" - శ్రీనివాస్, షేర్ లింగంపల్లి జోన్ డీసీపీ
చిన్నపిల్లల మిస్సింగ్ కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన- వాటిని కిడ్నాప్లుగా పరిగణించాలని ఆదేశం
రూ.30 వేల అప్పు తీర్చలేదని - 21 రోజుల పసికందు కిడ్నాప్! - టిఫిన్ చేయిస్తానని చెప్పి

