హైదరాబాద్‌లో భారీగా కల్తీ నెయ్యి పట్టివేత - నిందితుడు అరెస్టు
బంజారాహిల్స్‌లో భారీగా కల్తీ నెయ్యి పట్టివేత - నెయ్యిలా వాసన వచ్చేందుకు రసాయనాలను ఉపయోగించిన నిర్వహకుడు - రూ.18 లక్షలకుపైగా విలువైన కల్తీ నెయ్యి, తయారీ యంత్రాలు సీజ్

Published : March 4, 2026 at 5:53 PM IST
|Updated : March 5, 2026 at 3:14 PM IST
Adulterated Ghee Seize in Hyderabad : హైదరాబాద్ నగరంలో కల్తీనెయ్యి కలకలం రేపింది. కల్తీ నెయ్యి విలువ సుమారు రూ.18 లక్షలు ఉంటుందని సమాచారం. మొత్తం 460 కిలోల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిందితుడు జునైద్ హుస్సెన్‌ను అరెస్టు చేశారు.
నెయ్యిలా వాసన వచ్చేందుకు : నగరంలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న స్థావరంలో బుధవారం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. పామాయిల్, మీగడ, ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసిన 460 కిలోల నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు జునైద్ హుస్సేన్ (26)ను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ భోలానగర్‌కు చెందిన జునైద్ ప్రైడ్ డెయిరీ పేరుతో అనుమతి తీసుకొని ఇంటినే అడ్డాగా మార్చుకున్నజునైద్ హుస్సేన్, గేదె, ఆవు, పాల నుంచి మీగడ సేకరించి దానిలో పామాయిల్, వనస్పతిలను, ఇతర రసాయనాలతో దీనిని తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నెయ్యిలా వాసన వచ్చేందుకు రసాయనాలను ఉపయోగించేవాడు. వీటిని ప్యాకెట్లుగా మార్చి నాణ్యమైన నెయ్యిగా చెబుతూ తక్కువ ధరకు శుభకార్యాలకు, హోటళ్లకు భారీ ఎత్తున విక్రయించేవాడు.
కల్తీ నెయ్యి, తయారీ యంత్రాలు సీజ్ : కొద్దినెలలుగా సాగుతున్న ఈ కల్తీపై టాస్క్‌ఫోర్స్ డీసీపీ అందె శ్రీనివాసరావుకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్, ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు విజయానంద్, చందన, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. రూ.18.26 లక్షల విలువైన 460 కిలోల కల్తీ నెయ్యి, 70 కేజీల కల్తీ మిశ్రమం, సుమారు 3,260 కేజీల మీగడ, 28 డబ్బాల వనస్పతిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కల్తీ నెయ్యి, తయారీ యంత్రాలు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లో వాడే నెయ్యి నాణ్యమైనదో లేదో కొన్ని పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
- నెయ్యి స్వచ్ఛతను నిర్ధారించేందుకు స్టవ్‌పై ఉంచి వేడిచేస్తే సువాసన వచ్చినట్లయితే అది నాణ్యమైన నెయ్యి అని అర్థం. స్వచ్ఛమైన నెయ్యి వేడిచేస్తే అంతగా పొగరాదు. కల్తీది అయితే మాత్రం పొగ ఎక్కువగా వస్తుంది. కాలిన వాసన వస్తుంది. ఇలా వచ్చిందంటే ఆ నెయ్యిలో ఏదైనా పదార్థాలు కలిపినట్లుగా అర్థం చేసుకోవాలి.
- నెయ్యి స్వచ్ఛతను పరీక్షించేందుకు ఓ గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. అందులో కొంత నెయ్యి వేసి బాగా కలపాలి. నాణ్యమైన నెయ్యి అయితే ఆ ద్రావణంలో పూర్తిగా కరిగిపోతుంది. కల్తీ నెయ్యి అయితే మాత్రం నీటిపై తేలిపోయి విడిపోయినట్లుగా ఉంటుంది. మలినాలు కనిపిస్తాయి.
- పైన వివరించిన రెండు పద్ధుతులే కాకుండా మరికొన్ని విధాలుగా కూడా నెయ్యి నాణ్యతను పరీక్షించవచ్చు. ఇందుకోసం తెల్లటి గుడ్డపై కొద్ది పరిమాణంలో నెయ్యిను వేయండి. కొన్ని సమయం పాటు అలా ఉంచండి. నాణ్యమైన నెయ్యి అయితే అది ఎండిపోయిన తర్వాత మరకలు లాంటివి ఏవీ కనిపించవు. ఒక వేళ గుడ్డపై ఏవైనా అవశేషాలు, మరకలు లాంటివి కనిపించినా అది కల్తీ అయ్యిందని తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
- నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు కొన్ని గంటల పాటు దానిని ఫ్రిజ్‌లో ఉంచండి. అది నాణ్యమైనది అయితే ఐస్ ముద్దలా గడ్డకడుతుంది. అందులో ఎలాంటి పగుళ్లూ కనిపించవు. ఒక వేళ అది కల్తీది అయినట్లయితే పొరలు పొరలుగా కనిపిస్తుంది. ఇది తక్కువ నాణ్యతకు సంకేతంగా నిపుణులు వివరిస్తున్నారు.
- నాణ్యమైన నెయ్యి రుచికరంగా ఉంటుంది. లేత బంగారు రంగులో ఉండేటువంటి నెయ్యి సువాసను కలిగి ఉంటుంది. అయితే కల్తీ నెయ్యి మాత్రం చేదుగా ఉంటుంది. టేస్ట్‌లో కూడా తేడాను గమనించవచ్చు. పైన వివరించిన విధంగా మీరు కొన్న నెయ్యి కల్తీదో స్వచ్ఛమైనదో పరీక్షించుకోవచ్చు

