మీ సేవలకు జోహార్లు - అమ్మమ్మ, తాతయ్యలకు భరోసా ఇస్తున్న పోలీసు సేవలు
పండుటాకుల్లో భరోసా నింపేలా పోలీసు సేవలు - వృద్ధులపై దాడుల అడ్డుకట్టకు కార్యాచరణ - ఒంటరి వృద్ధులకు అండగా నగర పోలీసులు

Published : October 18, 2025 at 4:49 PM IST
Police Providing Security to Senior Citizens : ఎన్నో పున్నములు చూశారు. మరెన్నో జీవితాలను చక్కదిద్దిన ఆలుమగలు వృద్ధాప్యంలో ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇది ప్రస్తుతం కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. ప్రయోజకులైన పిల్లలు, ఆస్తిపాస్తులు, బంధుగణం ఉన్నా పలకరింపులకు దూరమై నాలుగు అడుగులు వేయాలన్నా ఇతరులపై ఆధారపడాల్సిన స్థితిలో ఉన్నారు. వీరి నిస్సహాయతను ఆసరా చేసుకొని అయిన వాళ్లు, పని వాళ్ల చేతుల్లోనే దాడులకు గురై ప్రాణాలు కోల్పోతున్న వృద్ధుల సంఖ్య పెరుగుతోంది.
ఈ దాడులకు గురయ్యేది వారి తల్లిదండ్రులే! : ఇలాంటి దాడులకు ఎక్కువగా గురయ్యేది తమ పిల్లలు విదేశాల్లో, నగరాల్లో స్థిరపడటంతో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులు నేరగాళ్లకు లక్ష్యంగా మారుతున్నారు. వీరు దోపిడీ, దొంగతనాలు, ఆస్తి వివాదాలు, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం, పని వాళ్ల దాడులు అనేక రూపాల్లో ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. అలాగే సైబర్ నేరగాళ్లు కూడా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేసి వృద్ధులకు భద్రత కల్పించాలనే సంకల్పంతో నగర పోలీసు యంత్రాంగం సిద్ధమైంది.
తొలి అడుగు విజయవంతం : ఉత్తర మండలం డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ తమ పరిధిలో ఒంటరి వయోధికుల జాబితా సిద్ధం చేయించారు. మారేడుపల్లి, తిరుమలగిరి, కార్ఖానా పరిధిలో విశ్రాంత ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. వారికి పోలీసు యంత్రాంగం సహాయ పడేందుకు ఉన్న మార్గాలను పరిశీలించారు. మూడు నెలల పాటు వారికి చేదోదుగా ఉంటూ వారికి ఎటువంటి అపాయం రాకుండా చూడగలిగారు. వయోధికుల రక్షణకు చేపట్టిన చర్యలు ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో తెలుసుకున్న నగర సీపీ సజ్జనార్ దీన్ని నగర వ్యాప్తంగా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
ఇటీవల జరిగిన ఘటనలు : అంబర్‌పేట పరిధిలో ఏడాది క్రితం వృద్ధ జంటను హత్య చేసిన నిందితులు ఎవరనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది. తాజాగా హిమాయత్‌నగర్‌లో ఉంటున్న ఆనందరావు(86), అనసూయ(83) దంపతులకు సహాయకుడిగా వచ్చిన వ్యక్తి వారిపై దాడి చేసి విలువైన వస్తువులతో పారిపోయాడు.
''కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు ఎక్కువగా నివసిస్తున్న మూడు ప్రాంతాలపై దృష్టి సారించాం. వారానికోసారి స్వయంగా వెళ్లి పరిశీలిస్తున్నాం. పని మనుషులను నియమించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌన్సెలింగ్ ఇచ్చాం. వృద్ధుల గురించి వాకబు చేసి సహాయం చేసే బాధ్యతలను సెక్టార్ ఎస్సైలకు అప్పగించాం. అలాగే అత్యవసర సమయంలో స్పందించేందుకు చుట్టుపక్కల వారు ముందుకొచ్చారు.''- సాధన రష్మిపెరుమాళ్, డీసీపీ, ఉత్తర మండలం
పోలీసుల కొత్త కార్యాచరణ సిద్ధం : ఇలాంటి ఘటనలు నగర పరిధిలో ఏడాదికి 300లకు పైగా కేసులు నమోదు అవుతున్నట్టు అంచనా వేస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో నగర పోలీసులు కొత్త కార్యాచరణను సిద్ధం చేశారు. దీనిని నగర వ్యాప్తంగా అమలు చేసేందుకు సీపీ వీసీ సజ్జనార్ పోలీసు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు.
''తల్లిదండ్రులను వేధించే వారిపై సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. చిక్కడపల్లిలో మద్యం తాగొచ్చి తల్లులతో గొడవ పడుతున్న ఇద్దరు కుమారులపై కేసులు నమోదు చేశాం. సహాయకులుగా నియమించుకునే వారిలో నేరచరిత్ర ఉన్నవారిని ముందుగా గుర్తిస్తే ప్రమాదాలను అడ్డుకోవచ్చు.'' - శిల్పవల్లి, డీసీపీ, మధ్య మండలం
సైబర్ నేరగాళ్ల వలలో వృద్ధులు - మోసం పోయామని గుర్తించాక మానసిక వేదనతో కుంగుబాటు
వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోవట్లేదా? - కుంగిపోకుండా మీరూ వీళ్లలా చేయండి!

