ETV Bharat / state

సంక్రాంతికి ఊరెళ్తున్నారా? - ఈ డైవర్షన్లు తెలిస్తే ట్రాఫిక్​ నుంచి తప్పించుకున్నట్లే

సంక్రాంతి నేపథ్యంలో ట్రాఫిక్​కు అంతరాయం కలగకుండా పోలీసుల చర్యలు - టోల్​గేట్లు, జాతీయ రహదారిపై వంతెనల నిర్మాణంతో ట్రాఫిక్​ జామ్​ ఏర్పడే పరిస్థితి - ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్న పోలీసులు

Hyderabad To Vijayawada
SANKRANTI TRAFFIC (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 9, 2026 at 11:48 AM IST

3 Min Read
Choose ETV Bharat

Traffic Diversions on Hyderabad-Vijayawada Highway : మూడు నాలుగు రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా హైదరాబాద్‌ నుంచి ఏపీకి భారీ సంఖ్యలో వాహనాలు వెళ్లే అవకాశం ఉంది. టోల్‌ గేట్లు, నేషనల్​ హైవేల వంతెనల నిర్మాణం తదితరాలతో ట్రాఫిక్‌కు అక్కడక్కడ అంతరాయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు ప్రణాళికలను రూపొందించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పలుచోట్ల ట్రాఫిక్​ డైవర్షన్లు ఏర్పాటు చేశారు.

ట్రాఫిక్‌ డైవర్షన్లు ఇలా : హైదరాబాద్‌ నుంచి గుంటూరు వైపు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద నల్గొండ, మిర్యాలగూడ, పిగుడురాళ్ల మీదుగా దారి మళ్లించనున్నారు.

రాజమండ్రి-విశాఖపట్నం : నకిరేకల్‌ మీదుగా అర్వపల్లి, మరిపెడ బంగ్లా నుంచి ఖమ్మం మీదుగా దారి మళ్లిస్తారు. అక్కడ కూడా ట్రాఫిక్ సమస్య ఉంటే టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారి మీదుగా రాజమండ్రి వైపునకు మళ్లించనున్నారు.

హైదరాబాద్‌-విజయవాడ : టేకుమట్ల డైవర్షన్‌ను ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. టేకుమట్ల నుంచి ఖమ్మం నేషనల్​ హైవేపైకి వెళ్లి, యూటర్న్‌ తీసుకొని తిరిగి సూర్యాపేట వైపునకు రావాల్సి ఉండగా, జాతీయ రహదారిపై సరాసరి వాహనాలు వచ్చే విధంగా తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేశారు.

ఖమ్మం-హైదరాబాద్‌ : రాయినిగూడెం వైపునకు వచ్చి యూటర్న్‌ తీసుకోవాల్సి ఉండగా చివ్వెంల, ఐలాపురం వద్ద దారి మళ్లించి సూర్యాపేట మీదుగా నేరుగా హైదరాబాద్‌ వెళ్లే విధంగా ముందస్తు ప్రణాళికలను రూపొందించారు.

SANKRANTI TRAFFIC
సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద వేసిన సీసీ రోడ్డు (Eenadu)

డ్రోన్‌ కెమెరాతో నిరంతరం నిఘా : సూర్యాపేట జిల్లా పోలీసులు ఈ ఏడాది జాతీయ రహదారిపై డ్రోన్‌ కెమెరాలతో అత్యంత పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడైనా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోతే వెంటనే తగిన చర్యలు చేపట్టే విధంగా డ్రోన్ సేవలను వినియోగించుకోనున్నారు. సూర్యాపేట రూరల్​, సూర్యాపేట, మునగాల, కోదాడ, కోదాడ రూరల్​ సీఐల ఆధ్వర్యంలో పండుగకు ముందు, ఆ తర్వాత ఐదేసి రోజులు పోలీసు సిబ్బంది నిరంతరం ట్రాఫిక్‌ను పర్యవేక్షించే విధంగా చర్యలు ఉండనున్నాయి. అనుకోని ప్రమాదాలు సంభవిస్తే రోడ్డును క్లియర్​ చేయడానికి క్రేన్లు, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి అంబులెన్సులు, వాహనాలను తీసుకెళ్లడానికి టోయింగ్‌ వాహనాలను సిద్ధం చేశారు. నాలుగు హైవే పెట్రోలింగ్‌ వాహనాలు నిరంతరం గస్తీ చేపట్టనున్నాయి.

బ్లాక్‌ స్పాట్ల వద్ద : సూర్యాపేట జిల్లాలో ప్రధానంగా 24 బ్లాక్‌ స్పాట్లను గుర్తించారు. వీటితో పాటు ప్రమాదకరమైన క్రాసింగ్‌ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీసీ టీవీ కెమెరాలను, సైన్‌ బోర్డులు, విద్యుత్తు దీపాలను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. వేగ నియంత్రికలను, బారికేడ్లను ప్రస్తుతానికి తొలగించారు. గుంతలు పడిన చోట రోడ్డుపై మరమ్మతులు చేపట్టారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని, క్షేమంగా వాహనదారులు తమ గమ్యస్థానం చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

"వాహనదారులు తొందరపాటుతో దూసుకుపోవడం సరికాదు. ప్రతి ఒక్కరూ వేగ నియంత్రణను తప్పనిసరిగా పాటించాలి. సంక్రాంతిని ఆనందంగా జరుపుకొని తిరిగి సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానం చేరేందుకు నిరంతరం పటిష్టమైన నిఘా బృందాలను ఏర్పాటు చేశాం" -నరసింహ, సూర్యాపేట ఎస్పీ

శనివారం నుంచే రద్దీ : సంక్రాంతి సెలవులు వచ్చిన ప్రతిసారి రోడ్లపై వాహనాల జాతర నెలకొంటుంది. రాజధాని హైదరాబాద్ నుంచి పల్లెలకు భారీ స్థాయిలో ప్రయాణికులు వెళుతుంటారు. 10వ తేదీన రెండో శనివారం కావడంతో 9న అంటే శుక్రవారం సాయంత్రం నుంచే రద్దీ మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సుమారు రూ.300 కోట్ల వ్యయంతో చౌటుప్పల్​లో ఒక ఫ్లైఓవర్​ను, 13 అండర్​పాస్​ బ్రిడ్జి​లు, 10 చోట్ల సర్వీసు రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉన్నా, అవి ఇంకా నత్తనడకన కొనసాగుతుండటంతో వాహనదారులకు అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.

మనిషి రక్త బ్యాగుల్లో మేకలు, గొర్రెల రక్తం - కాచిగూడలోని ఆ ల్యాబ్​లో అసలు ఏం జరుగుతోంది?

ఆ హైవేపై 'వర్క్​ ఇన్​ ప్రోగ్రెస్' - సంక్రాంతి ప్రయాణం వేళ కాస్త చూసుకుని డ్రైవ్ చేయండి