డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసు - అనంతబాబుతో కుమ్మకైన ఖాకీలపై సస్పెన్షన్ వేటు
సుబ్రహ్మణ్యం హత్యకేసులో కీలక పరిణామం - నిందితుడికి సహకరించిన నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్, విచారణలో లోపాలపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు, దిల్లీలో అనంతబాబు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 22, 2026 at 11:48 AM IST
Driver Subramanyam Case Latest Updates: అప్పట్లో ఏపీలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితునితో కలిసి కుమ్మకైన నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. వీరు కేసులో వివిధ రూపాల్లో అనంతబాబుకు సహకరించినట్లు పలు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా కేసుకు బాధ్యులుగా గుర్తించిన వారిని ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ విచారణలో లోపాలపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. మరొకవైపు అజ్ఞాతంలో ఉన్న అనంతబాబు దిల్లీలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
కాకినాడకు చెందిన దళిత యువకుడైన సుబ్రహ్మణ్యం హత్యకేసులో ప్రధాన నిందితుడు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. దీని ప్రకారం అప్పట్లో నిందితునితో పోలీసులు కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని ఇప్పటి ప్రభుత్వమైనా వారిపై చర్యలెందుకు తీసుకోలేదని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు.
ఎస్సీ సంఘాల ఒత్తిళ్లతో అరెస్టు: కేసులో పరిపాలన, పర్యవేక్షణ లోపాలకు బాధ్యులుగా పేర్కొంది. నాడు డీఎస్పీలుగా పనిచేసిన భీమారావు, మురళీకృష్ణారెడ్డి, సీఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్సై సతీశ్‌బాబును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జారీచేశారు. వీరిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించారు. నాటి కేసులో అధికారుల పాత్రను పరిశీలిస్తే సుబ్రహ్మణ్యం మృతదేహంపై ఎర్రమట్టి, ఇసుక కనిపించినా, మృతుని కుటుంబసభ్యులు హత్యచేసి ఉంటారని ఫిర్యాదు చేసినా సరే ఎస్సై సతీశ్‌బాబు పట్టించుకోకపోవడం గమనార్హం.
అంతేకాకుండా ఉన్నతాధికారుల ఆదేశాలకు లొంగిపోయి అనుమానాస్పద మృతి కింద ఎఫ్ఆర్ను నమోదు చేశారు. నిందితుడిని విడిచిపెట్టారని అప్పటి డీఎస్పీ భీమారావుపైనా పలు ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోకుండా సాక్ష్యాలను తారుమారు చేయడానికి, సాక్షులను అనంతబాబు బెదిరించడానికి అవకాశం ఇచ్చారనే అభియోగం ఉంది. అయితే 3 రోజుల తర్వాత మృతుని బంధువులు, ఎస్సీ సంఘాల ఒత్తిళ్లతో అరెస్టు చేయించారు.
డీఎస్పీ మురళీకృష్ణారెడ్డిపై ఆరోపణలు: నిందితునికి అనుకూలంగా సీసీ కెమెరాల్లో పుటేజీలను మాయం చేయడానికి సాయం చేశారనే అరోపణలు సీఐ ఆకుల మురళీకృష్ణపై ఉన్నాయి. అనంతబాబు నివాస పరిసరాల్లో సేకరించిన చాలా పుటేజీలను తప్పించారు. ఇందులో కొన్ని డిలీట్ చేయించినట్లు సమాచారం. సీసీ కెమెరాల పుటేజీని రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషించిన అనంతరం లోపభూయిష్టంగా నివేదిక వచ్చేలా చూశారని మరో డీఎస్పీ మురళీకృష్ణారెడ్డిపై సైతం ఆరోపణలున్నాయి.
నిందితుని భార్య ఉన్న పుటేజీలను పక్కన పెట్టించి ఈ కేసులో వేరొకరు లేరని రెడ్‌విత్ 34 సెక్షన్‌ను తొలగించినట్లు సమాచారం. సుబ్రహ్మణ్యం మృతదేహంపై ఎర్రమట్టి, ఇసుక కనిపించినప్పటికీ అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుకు పట్టలేదు. అపార్ట్‌మెంట్ గేటు దగ్గర అనంతబాబు క్షణికావేశంలో తోయడం వల్ల కింద పడిపోయి చనిపోయాడని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రిమాండ్ రిపోర్టు, కోర్టుకు సమర్పించిన అరెస్టు సమాచారంలో అనంతబాబుకు నేరచరిత్ర లేదని చూపించారు.
లొసుగులపై సమగ్ర నివేదిక: అనంతబాబుపై రౌడీషీట్ ఉండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని తొలగించుకున్నారు. దీంతో పాటు మరో 17 కేసులు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని రుజువు కాకపోగా, మరికొన్ని నిరూపణ కాకపోవడంతో కొట్టివేశారు. అదే విధంగా కేసు విచారణ అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, ఏలూరు ఐజీగా పనిచేసిన పాలరాజు పర్యవేక్షణలో సాగింది. అనంతబాబు హత్య చేసినట్లు ఎస్పీకి తెలిసినా సరే దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడం, శవపంచనామాను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన లొసుగులపై నివేదికను డీజీపీ కార్యాలయానికి పంపించారు.
సుబ్రహ్మణ్యం హత్యకేసు విచారణను గతేడాది నవంబరు 30వ తేదీలోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో అనంతబాబు శుక్రవారమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన దిల్లీలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. కేసు విషయమై న్యాయనిపుణులు, నేతలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన భార్య లక్ష్మీదుర్గ కొన్నిరోజులుగా పరారీలోనే ఉన్నారు. ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేశారు.
గతంలో: దళిత యువకుడు తన వద్ద డ్రైవర్‌గా పని చేసిన సుబ్రహ్మణ్యాన్ని 2022 మే 19న కాకినాడలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కరరావు అలియాస్ అనంతబాబు దారుణంగా హతమార్చారు. మృతదేహాన్ని కాకినాడలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు స్వయంగా డోర్ డెలివరీ చేశారు. ఈ కేసును అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలి నుంచీ నీరుగార్చే ప్రయత్నాలే చేసింది.
డెడ్‌బాడీ డోర్ డెలివరీ కేసులో కొత్త ఆధారాలు - సీసీటీవీలో ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబ సభ్యులు!
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు - తదుపరి విచారణకు కోర్టు పచ్చజెండా

