ETV Bharat / state

'నన్ను ఇలానే మోసం చేశారు - అందుకే నేనూ అదే చేస్తున్నా' - అప్పట్లో బాధితులే ఇప్పుడు నేరగాళ్లు

గొలుసుకట్టు, సైబర్​ నిందితులూ ఒకప్పుడు బాధితులే - నష్టాలను పూడ్చుకునేందుకు కొందరు నేరాల బాట - ప్రతీకార చర్యగా భావిస్తున్న మరికొందరు మోసగాళ్లు - పోలీసుల విచారణలో విస్తుపోయే సమాధానాలు చెబుతున్న నిందితులు

సైబర్​ నేరగాళ్లవుతున్న బాధితులు
Cyber Victims Turning Into Cyber Criminals (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 2, 2026 at 5:04 PM IST

3 Min Read
Choose ETV Bharat

Cyber Victims Turning Into Cyber Criminals : 'కోల్పోయిన చోటే వెతుక్కోవాలి' అనేది ఒకప్పటి సామెత. వంచించి కాజేసిన సొమ్మును తిరిగి మోసం ద్వారానే సంపాదించాలన్నది ప్రస్తుతం మోసగాళ్లు అవలంబిస్తున్న పద్ధతి. గతంలో సైబర్​, డిజిటల్ మోసాలు, ఇతర ఆర్థిక నేరాల వల్ల మోసానికి గురైన బాధితులే, వారి అనుభవాలతో ఇప్పుడు నేరాలకు పాల్పడుతున్నారు. ఒకవేళ పోలీసులకు చిక్కినా దోచుకున్న సొమ్ముతో ఎలాగైనా బయటపడతామనే ధీమాగా ఉంటూ తప్పులు చేయడానికి వెనుకాడడం లేదని ఒక పోలీసు ఉన్నతాధికారి వివరించారు. హైదరాబాద్​ మహానగరంలోని ఠాణాల్లో నమోదవుతున్న ఫిర్యాదుల్లో ఒకప్పుడు బాధితులే ప్రస్తుతం నిందితులుగా మారుతున్నట్లు విచారణలో గుర్తించామని పోలీసులు చెబుతున్నారు.

రూ.3లక్షలకు రూ.10లక్షల వసూలు : కరీంనగర్​ పట్టణానికి చెందిన ఓ యువకుడు బీటెక్​ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్​లో ఓ కంప్యూటర్ కోర్సులో శిక్షణ పొందాడు. ఈ క్రమంలో అతని మిత్రుడు గొలుసుకట్టు కంపెనీ గురించి చెప్పడంతో, అందులో రూ.3 లక్షల పెట్టుబడి పెట్టాడు. ఇందులో భాగంగా సభ్యుల్ని చేర్పించాలి. కానీ, అప్పట్లో ఇతరులను చేర్పించలేక మధ్యలోనే ఆగిపోయాడు. సంవత్సరం తర్వాత మాదాపూర్​లోని ఒక కంపెనీలో సాఫ్ట్​వేర్​గా అతనికి ఉద్యోగం వచ్చింది.

గతంలో చేసిన అప్పులను తిరిగి కట్టడానికి క్యూనెట్​లో చేరాడు. మోసపోయిన అనుభవంతో సహచరులను సులభంగా చేర్పించాడు. దీని ద్వారా రూ.10 లక్షల వరకు సంపాదించాడు. బాధితుల ఫిర్యాదుతో ఇటీవల అతణ్ని సీసీఎస్​ పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. అటు కంపెనీలోనూ అతణ్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ​

ఉద్యోగావకాశం పేరిట ఉన్నకాడికి దోచుకొని : ఇద్దరు యువకులు ఎస్సార్​నగర్​లో ఓ నకిలీ ఐటీ కంపెనీని సృష్టించి, వందల సంఖ్యలో యువతీ యువకులను మోసం చేసి రూ.2.5 కోట్లు వసూలు చేశారు. ఆ ఇద్దరు ఉన్నత విద్యను అభ్యసించి, గతంలో ఇదే తరహా మోసానికి గురయ్యారు. దీన్నే వారు కూడా సంపాదించే అస్త్రంగా మలచుకున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్​పల్లి, అమీర్​పేట్​ ప్రాంతాల్లో సాఫ్ట్​వేర్​ జాబ్స్​ కోసం శిక్షణ పేరుతో పలు సంస్థలు ఏర్పాటు చేశారు. అందులో చేరిన వారికి ఉద్యోగ అవకాశాల పేరిట నిలువునా ముంచేస్తున్నారు. ఈ వ్యవహారంలో తమ ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు వారి భార్యల పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

డేటింగ్ యాప్​తో 10 మందికి మస్కా : పోలీసుల దర్యాప్తులో నిందితులు విస్తుపోయే విషయాలు చెబుతున్నారు. మోసాల వల్ల కొందరు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోవడంతో, ప్రతీకారం తీర్చుకునేందుకు తామూ అదే నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఓ యువతి ప్రేమ పేరుతో మోసపోవడంతో డేటింగ్​ యాప్​ ద్వారా దాదాపు 10 మంది యువకులను బురిడీ కొట్టించి భారీ మొత్తంలో నగదు కాజేసింది. సదరు యువతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించే క్రమంలో 'ఇందులో తప్పేముంది? నేను ఇలాగే మోసపోయా అందుకే నేనూ అదే చేశా' అని జవాబిచ్చినట్లు ఓ ఇన్​స్పెక్టర్​ చెప్పారు.

పార్శిల్​లో ఫోన్​కు బదులు ప్లాస్టిక్​ : తక్కువ ధరకే సెల్​ఫోన్ వస్తుందని ఆన్​లైన్​లో ప్రకటను చూసి రాజేంద్రనగర్​కు చెందిన ఓ వ్యక్తి ఆ వస్తువు ఆర్డర్​ చేశాడు. తీరా పార్శిల్​ తెరిచి చూస్తే అందులో ప్లాస్టిక్​ వస్తువు వచ్చింది. దానికి ముందే డబ్బు చెల్లించడంతో మోసపోయినట్లు గ్రహించాడు. దీన్నే తానూ ఉపాధిగా ఎంచుకున్నాడు. ఏకంగా ఓ కాల్​సెంటర్​ను ఏర్పాటు చేసుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వేలాది మందిని మోసం చేశాడు. ఇలాంటి వ్యవహారాల్లో కోల్పోయిన సొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం ఉండటం లేదంటూ కొందరు ఇలాంటి నేరాలే చేస్తున్నారు.

అరెస్టైనా తీసుకొస్తామని చెప్పి : కొందరు యూట్యూబ్, వెబ్​సిరీస్​లో వీడియోలను చూసి ఈజీ మనీకి ఆకర్షితులవుతున్నారు. అడ్డు దారిలో సంపాదించడమే వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఏదో విధంగా ఆర్థికంగా నష్టపోయిన వారిని సైబర్​ నేరగాళ్లు పావులుగా మలచుకుంటున్నారు. తాము చెప్పినట్లు చేస్తే నష్టాల నుంచి బయటపడొచ్చని ఆశ కలిగిస్తున్నారు. వారి ద్వారా సిమ్​కార్డులు, మ్యూల్​ ఖాతాలను వినియోగిస్తున్నారు. గతంలో బాధితులైన వారినే ఏజెంట్లుగా ఎంచుకొని షెల్​ కంపెనీలు ఓపెన్​ చేసి బ్యాంకుల్లో కరెంట్​ అకౌంట్స్ తెరిపిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నా, బయటకు తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు.

సైబర్​ మోసాల బాధితుల్లో మనమే టాప్​ - రోజుకు 75 సైబర్‌ నేరాలు

డిజిటల్​ అరెస్ట్​ నుంచి పెళ్లిపత్రికల వరకు - ఈ సైబర్​ మోసాల గురించి తెలుసుకోవాల్సిందే!