మలుపులు తిరుగుతోన్న కుమ్మెర ఘటన - షాకింగ్ విషయాలు చెప్పిన పోలీసులు
కీలక మలుపులు తిరుగుతున్న కుమ్మెర ఘటన - చిన్నారిపై గాయాల్లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలిందన్న పోలీసులు - చిన్నారి అనారోగ్య సమస్యలతో మృతి చెందిందన్న పోలీసులు

Published : February 27, 2026 at 8:16 AM IST
|Updated : February 27, 2026 at 9:52 AM IST
Kummera Mallanna Jathara Issue : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుమ్మెర ఘటన మలుపులు తిరుగుతోంది. మృతి చెందిన చిన్నారికి శరీరం లోపల, బయటా ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలిందని పోలీసులు తెలిపారు. గాయాల వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని ఏ చిన్న సాక్ష్యం దొరికినా నిందితులపై హత్య నేరం మోపి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న కుమ్మెర ఘటనలో పోలీసులు, అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కాలితో తన్నడం వల్లే 2 నెలల చిన్నారి చనిపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా పాప ఒంటిపైన, అంతర్గతంగా ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ద్వారా తేలిందని పోలీసులు వెల్లడించారు. కదల్లేని స్థితిలో ఉన్న పాపను నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లగా, చిన్నారి చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారన్నారు. మెడికో లీగల్ కేసుకు, పోస్టుమార్టం ఎగ్జామినేషన్-పీఎంఈకి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని పోలీసులు చెబుతున్నారు.
నెలలు నిండకుండానే తక్కువ బరువుతో జన్మించింది : ఆసుపత్రి రికార్డుల ప్రకారం నెలలు నిండకుండానే పాప 31 వారాల్లోనే తక్కువ బరువుతో జన్మించింది. నిలోఫర్‌లో 30 రోజుల పాటు చికిత్స అందించారు. జాండిర్స్, న్యూమోనియా సహా శ్వాస సంబంధిత రుగ్మతలతో చిన్నారి బాధపడినట్లు నిలోఫర్ రికార్డులు చెబుతున్నాయి. అంతేకాదు గతేడాది నవంబర్ 25న గర్భిణిగా ఉన్న మౌనికను భర్త కొట్టారని ఆసుపత్రి రికార్డుల్లో నమోదై ఉందని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు ప్రకారం 18న పాపపై దాడి జరిగింది. అప్పటి నుంచి పాప చనిపోయే వరకూ ఏం చికిత్స అందించారని అడిగినా సమాచారం ఇవ్వడం లేదని పోలీసులు అంటున్నారు. కాగా హిప్టో పాథాలజీ, తదితర రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయని, పాప గాయాల వల్లే చనిపోయినట్లు సాక్ష్యం లభిస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు : పాప చనిపోయిన తర్వాత ఈ నెల 22న మౌనిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 18న స్వామివారి దర్శనం కోసం శ్రీనివాస్ రెడ్డి రూ.100 అడిగారని, తనను కులం పేరుతో దూషించారని, సాయంత్రం గణేష్‌పైనా దాడి చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా అంతకన్నా ముందు అదే 18న గణేశ్ శ్రీనివాస్ రెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం తన భార్యను కులం పేరుతో దూషించినట్లుగా, భార్య, పాపపై దాడి జరిగినట్లుగా ఎక్కడా ప్రస్తావించలేదు. ఎస్సీ పేరుతో దూషించారని చెప్పడంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కుల ధ్రువీకరణ కోసం అవసరమైన ఆధార్ లాంటి ధ్రువపత్రాలు బాధితులు ఇవ్వడం లేదని పోలీసులు అంటున్నారు.
"నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రి రికార్డుల ప్రకారం చిన్నారి నెలలు నిండకుండానే 31 వారాల్లోనే తక్కువ బరువుతో పుట్టింది. ఆమెకు శ్వాస సంబంధిత సమస్య వల్ల ఐసీయూలో పెట్టారు. అనంతరం నిలోఫర్‌కు రిఫర్ చేశారు. అక్కడ దాదాపు 30 రోజుల పాటు చికిత్స అందించారు. గర్భిణిగా ఉన్న సమయంలో మౌనికపై తన భర్త దాడి చేశారనే రికార్డు ఉంది. పాపపై దాడి జరిగిందనే ఏదైనా చిన్న సాక్ష్యం దొరికినా మర్డర్ కేసుగా నమోదు చేసి చర్యలు చేపడతాం"- సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎస్పీ
నిందితుల కోసం గాలింపు : గురువారం సాయంత్రం నుంచి ఆందోళన చేస్తున్న కుటుంబసభ్యులు ధర్నాలో కనిపించకుండా పోయారు. వారిని ధర్మసమాజ్ పార్టీ నాయకులే తీసుకు వెళ్లారని, తాము ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా ఎక్కడికో తీసుకువెళ్లారని పోలీసులు అంటున్నారు. వారికి ఏం జరిగినా తమది బాధ్యత కాదంటూ పోలీసులు చెబుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకునే విషయంలో ఎలాంటి పురగోతి లేదు. ముగ్గురు నిందితులను 23నే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం 3 బృందాలు ఏర్పాటు చేసి వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు.
జాతర గొడవలో 2 నెలల చిన్నారి మృతి - 4 రోజులైనా పట్టించుకోని పోలీసులు!
పసిగుడ్డు ఏం అడిగిందని పొట్టనపెట్టుకున్నారు? - కుమ్మెర ఘటనపై అసెంబ్లీలో పోరాటం చేస్తాం : కేటీఆర్

