ETV Bharat / state

హైదరాబాద్​-విజయవాడ హైవేపై సంక్రాంతి వాహనాల రద్దీ - ట్రాఫిక్​ తప్పాలంటే ఈ దారుల్లో వెళ్లండి

సంక్రాంతి సందర్భంగా నేషనల్ హైవేలపై భారీగా పెరిగిన వాహనాల రద్దీ - ఈ నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులకు కీలక సూచనలు చేసిన పోలీసులు

Sankranti Traffic Advisory in Hyderabad-Vijayawada NH
Sankranti Traffic Advisory in Hyderabad-Vijayawada NH (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 10, 2026 at 7:35 AM IST

3 Min Read
Choose ETV Bharat

Sankranti Traffic Advisory on NH-65 : విద్యాసంస్థలకు ఈరోజు నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్​-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మొదలైంది. అయితే సాధారణంగా దిల్​సుఖ్​నగర్ నుంచి చౌటుప్పల్​కు 1 గంటలో చేరుకోవచ్చు. కానీ గత ఏడాది సంక్రాంతి సమయంలో భోగి ముందు రోజు 3-4 గంటల సమయం పట్టింది. అంతకు 2 రోజుల ముందు కూడా చాలా సమయం పట్టింది.

ఇవాళ్టి నుంచే సెలువులు ప్రారంభమవుతుండటంతో ఈ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు జాతీయ రహదారిపై అండర్​పాస్​ వంతెన, సర్వీసు రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరం నుంచి తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్​లో చిక్కుకొని ఇబ్బందులు పడే బదులు దానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఈ మార్గాల్లో వెళ్తే సులువుగా :

  • హైదరాబాద్​ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నార్కట్​పల్లి వరకు వెళ్లి, అద్దంకి నేషనల్​ హైవేపై నుంచి వెళ్తుంటారు. ఒకవేళ వీరు విజయవాడ హైవే మీదుగా వస్తే హయత్​నగర్​, అబ్దుల్లాపూర్​మెట్​, చౌటుప్పల్​, పంతంగి టోల్​ప్లాజా వద్ద రద్దీలో చిక్కుకొనే అవకాశం ఉంటుంది. ఈ నార్కట్​పల్లి మీదుగా వెళ్లడం వల్ల పదుల కిలోమీటర్లు దూరం పెరిగినా, హైదరాబాద్​-నాగార్జునసాగర్​ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అలాగే ఓఆర్​ఆర్​ మీదుగా వెళ్లాలనుకునే వారు బొంగుళూరు గేట్​ వద్ద ఎగ్జిట్​ తీసుకొని నాగార్జునసాగర్​ హైవేపైకి వెళ్తే సరిపోతుంది.
  • హైదరాబాద్​ నుంచి భువనగిరి వైపు వెళ్లే వారు ఓఆర్ఆర్​ పైకి వెళ్లి ఘట్​కేసర్​లో ఎగ్జిట్​ తీసుకొని వరంగల్​ హైవేలోకి ప్రవేశించొచ్చు. సిక్రింద్రాబాద్​, తార్నాక, ఉప్పల్​ వైపు నుంచి కూడా నేరుగా భువనగిరికి చేరుకోవచ్చు.
  • ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు. నార్కట్​పల్లి దాటితే వీరికి ట్రాఫిక్ తిప్పలు తప్పినట్లే.
  • చౌటుప్పల్​లో ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. ఆరోజు చౌటుప్పల్​లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. పండగ వేళ ఈ ట్రాఫిక్ బాధలు తప్పాలంటే ఇలా కొత్త మార్గాల్లో వెళ్లడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది.

శుక్రవారం సాయంత్రమే మొదలైన రద్దీ : శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్​- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మొదలైంది. ఈ రోజు నుంచి విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో సంక్రాంతి సంబురాలను సొంత ఊళ్లోలకు జరుపుకునేందుకు పల్లెకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో వాహనాలకు అంతరాయం కలగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు.

కిటకిటలాడుతున్న బస్టాండ్లు : హైవేపై వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడకుండా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలో నారాయణపురం రోడ్డును పోలీసులు మూసివేశారు. వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చేపట్టినట్లు టోల్‌ప్లాజా నిర్వాహకులు 'ఈనాడు-ఈటీవీ భారత్​'కు తెలిపారు. శుక్రవారం నుంచి ఎంజీబీఎస్, కూకట్​పల్లి, దిల్​సుఖ్​​నగర్, ఎల్బీ నగర్ బస్టాండ్లు రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్తున్న వారితో బస్సులు నిండిపోయాయి. రద్దీకి అనుగుణంగా టీజీఎస్ ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతున్నా సరిపోవడం లేదు. ఇలా ఒక్కసారిగా రద్దీ పెరగడంతో ప్రయాణికులకు సరిపడా బస్సులు లేక ప్రైవేట్​ వెహికల్స్​ను ఆశ్రయించాల్సి వస్తోంది. వారు ఇదే అదునుగా టికెట్​ ధరలను డబుల్​ చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంక్రాంతి ఎఫెక్ట్! - హైదరాబాద్​-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్

నేషనల్​ హైవేపై అనుకోని సమస్యా? - ఈ నెంబర్​కి కాల్ చేయండి - సేవలు పొందండి