అసలు ఆరోజు ఏం జరిగింది? : బండి భగీరథ్ స్నేహితులను విచారించిన పోలీసులు
పోక్సో కేసులో బండి భగీరథ్ స్నేహితులను విచారించిన పోలీసులు - ఘటన చోటుచేసుకున్న రోజు ఏం జరిగిందనే విషయాలపై పోలీసుల ఆరా - బండి భగీరథ్ స్నేహితుల నుంచి వాంగ్మూలాలు రికార్డ్ చేసిన పోలీసులు

Published : May 18, 2026 at 2:47 PM IST
|Updated : May 18, 2026 at 4:03 PM IST
Police question Bandi Bhagirath's friends : బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదులో ఘటన జరిగినప్పుడు భగీరథ్‌తో పాటు ఉన్న స్నేహితులు, ఆ తర్వాత రాజీ కోసం ప్రయత్నించారంటూ దాదాపు కొంత మంది పేర్లను చెప్పారు. దీంతో పోలీసులు ఇవాళ వారిని కూడా పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారించారు. ఘటన జరిగిన రోజు ఏం జరిగిందనే విషయాలపై ఆరా తీశారు. పలు అంశాలకు సంబంధించి వారిని ప్రశ్నించారు. అనంతరం బగీరథ్ స్నేహితుల వాంగ్మూలాలను రికార్డు చేశారు.
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు కోసం ఆధారాల సేకరణపై ఎక్కువగా దృష్టి సారించారు. శనివారం రాత్రి నిందితుడు భగీరథ్‌ను అరెస్టు చేసి పేట్ బషీరాబాద్ స్టేషన్‌కు తీసుకెళ్లాక దాదాపు రెండు గంటల పాటు విచారణ చేసి అతడి నుంచి వాంగ్మూలం నమోదు చేసి రిమాండు రిపోర్టులో పొందుపర్చిన విషయం తెలిసిందే. పోక్సో కేసు నమోదైన తర్వాత ఎందుకు పరారయ్యారని ప్రధానంగా ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇద్దరి వాంగ్మూలాలను పోల్చి : ఈ సందర్భంగా భగీరథ్ తన దగ్గరున్న పలు ఆధారాలను అందించడంతో పాటు తాను ఏ తప్పూ చేయలేదని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు, వాంగ్మూలం ఆధారంగా కూడా పోలీసులు కొన్ని ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. చివరగా బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో అతను చెప్పిన విషయాలను పోల్చి చూశారు. అనంతరం భగీరథ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ముందు హాజరుపర్చి చర్లపల్లి జైలుకు తరలించారు. ఇంకా అతడిని పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించి, కోర్టులో పిటిషన్ దాఖలుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు.
ఇప్పటికే బాలిక, ఆమె తల్లి, భగీరథ్ ఇచ్చిన వాంగ్మూలాలు పొందుపర్చిన నేపథ్యంలో సాక్షులు చెప్పే విషయాలు అత్యంత కీలకం కానున్నాయి. వీరంతా చెప్పిన విషయాలతో పాటు పోలీసులు టెక్నికల్‌గా ఇతర రూపాల్లోనూ ఆధారాలు సేకరించనున్నారు. ఇప్పటికే మొయినాబాద్‌లోని రెండు ఫామ్‌హౌస్‌లు, నానక్‌రాంగూడలోని సర్వీస్ అపార్టుమెంటు తదితర ప్రాంతాల నుంచి పలు ఆధారాలను పోలీసులు సేకరించారు.
తానే అప్పగించానన్న బండి సంజయ్ : పోలీసులు భగీరథ్‌పై మే 16న ఉదయం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతడిని పట్టుకోవడానికి పోలీసుల ఆధ్వర్యంలో 5 స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి సైతం వెళ్లి చెక్ చేశారు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని తానే పోలీసులకు అప్పగించినట్లు అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో బండి సంజయ్ సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భగీరథ్‌ను అరెస్టు చేశామంటూ సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.
మైనర్ బాలిక వాంగ్మూలమే కీలకం : ఈ కేసులో పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 183 ప్రకారం న్యాయమూర్తి సమక్షంలో మైనర్ బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశారు. శనివారం ఉదయం పోలీసులు బాధితురాలిని మేడ్చల్ కోర్టుకు తీసుకెళ్లి వాంగ్మూల సేకరణను పూర్తి చేశారు. పోక్సో కేసుల్లో న్యాయమూర్తి ముందు ఇచ్చే వాంగ్మూలం ఎంతో కీలకంగా భావిస్తారు. కేసు దర్యాప్తు ప్రక్రియ మొత్తం దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వాంగ్మూలాన్ని అధికారులు వీడియో రికార్డింగ్ ద్వారా భద్రపరుస్తారు. బాధితురాలు కోర్టు విచారణకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విచారణ సమయంలో ప్రధాన ఆధారంగా కోర్టు వారు దీనిని భావిస్తారు. ఫిర్యాదుదారు అయిన బాలిక తల్లి వాంగ్మూలాన్ని కూడా అంతకు ముందే రికార్డు చేశారు.
బండి భగీరథ్‌కు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ - పోలీసులు కస్టడీకి కోరితే సహకరిస్తాం
'తక్షణమే కుమారుడిని అప్పగించండి' : కేంద్రమంత్రి బండి సంజయ్‌కు సీఎం సూచన

