బీటెక్, ఎంబీఏ విద్యార్థుల డ్రగ్స్ దందా - కరీంనగర్లో 9 మంది అరెస్ట్
బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో వెలుగులోకి - మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు - రూ.6 లక్షలు విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం

Published : August 29, 2026 at 12:28 PM IST
|Updated : August 29, 2026 at 12:52 PM IST
Police Arrested Drugs Gang At Karimnagar : రాష్ట్రవ్యాప్తంగా గంజాయి విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అధికారుల చేతికి చిక్కకుండా మత్తు పదార్థాలను అమ్ముతున్నారు. దీనికి అధికంగా యువతనే బలవుతుండటం ఆందోళనకరం. పోలీసులు దీనిపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా విక్రయదారులు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో మత్తు పదార్థాలు అమ్ముతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తులు : బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో ఇది వెలుగులోకి వచ్చింది. అక్కడ 9 మంది వ్యక్తులు ఒకే దగ్గర గుమిగూడి వారి సంచుల్లోని వస్తువులను సరి చేసుకుంటూ ఏదో విషయమై చర్చిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయంగా తెలిసింది. వెంటనే కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై లక్ష్మారెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానంగా ఉన్న 9 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు.
వేరు వేరు జిల్లాలకు చెందిన వారిగా గుర్తింపు : వారంతా కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాలకు చెందిన మొర్రి ఆకాశ్, పుట్టపాక విష్ణు సాయి, భైనవేని నితీశ్, కోసిని బాలచందర్, గుండు మనోహర్, విస్కుమల్లి విశాల్, గుండు కృష్ణగిరి, సిరిసిల్ల ప్రభాస్, మాకుల శివప్రసాద్గా గుర్తించారు. వీరి వయసు 20 నుంచి 25 ఏళ్లలోపే ఉంటుంది. పట్టుబడిన వారంతా బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి ఓ ముఠాగా ఏర్పడినట్టు పోలీసులు తెలిపారు. వీరు గత కొంతకాలంగా కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో హాష్ ఆయిల్, గంజాయిని విక్రయిస్తున్నట్లు తేలింది.
తక్కువ ధరలకే కొనుగోలు : అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కొండ ప్రాంతాల నుంచి హాష్ ఆయిల్, గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని రైలు మార్గంలో కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిన్నారు. ఈ విషయాన్ని నిందితులు పోలీసులకు వెల్లడించారు. మాదక ద్రవ్యాల విక్రయాల ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో ఈ దందాకు అలవాటుపడ్డారు. అలా రూ.7 లక్షలు సమకూర్చుకుని గంజాయి కొనుగోలు చేయించినట్లు తేలింది. అంతేకాక వీరు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని మెడికల్ షాప్‌లో టపాల్-50 అనే డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేస్తున్నారు. స్థానిక జ్యోతినగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
మత్తు పదార్థాలు స్వాధీనం : గంజాయితో పాటు హాష్ ఆయిల్‌ను ప్రత్యేక పరికరాల ద్వారా పొగ రూపంలో తీసుకుంటున్నట్లు నిందితులు పోలీసులకు చెప్పారు. ఈ క్రమంలో నిందితుల నుంచి 500 గ్రాముల హాష్ ఆయిల్, అర కిలో గంజాయి, 60 డ్రగ్ ట్యాబ్లెట్లు, 14 సిరంజీలు, హాష్ ఆయిల్ వినియోగించే పరికరాలు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల విలువ ప్రభుత్వ అంచనా ప్రకారం రూ.6 లక్షలు ఉంటుందని తెలిపారు. అలాగే డ్రగ్ ట్యాబ్లెట్లన అమ్మిన మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేశారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్, డ్రగ్స్ యాక్ట్, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
"బొమ్మకల్ శివారులోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని సమాచారం వచ్చింది. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల బృందం ఆ ప్రాంతంలో రైడ్ చేసి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ 9 మందిని పట్టుకున్నారు. నిందితులు వారి అమ్మానాన్నలకు తెలియకుండా గంజాయికి అలవాటుపడ్డారు. అలా వాటిని తక్కువ ధరకు తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు అమ్ముకోవాలన్నా ఉద్దేశంతో వివిధ ప్రాంతాల నుంచి వాటిని కొనుగోలు చేస్తున్నారు" - విజయ్ కుమార్, కరీంనగర్ రూరల్ ఏసీపీ
పెరుగుతున్న డ్రగ్స్ కేసులే అతి పెద్ద సవాల్ : డీజీపీ సీవీ ఆనంద్

