గుంటూరులో డ్రగ్స్ ముఠా అరెస్ట్ - 17 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
గుంటూరులో డ్రగ్స్ విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠా అరెస్టు - వారి నుంచి 17 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన ఎస్పీ వకుల్ జిందాల్

By ETV Bharat Andhra Pradesh Team
Published : November 17, 2025 at 5:21 PM IST
|Updated : November 17, 2025 at 7:13 PM IST
Police Arrest Six People for Selling MDMA Drugs in Guntur: డ్రగ్స్ విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతుండగా బుడంపాడులోని అన్నపూర్ణ కాంప్లెక్స్ వద్ద పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. నిందితుల నుంచి 17 గ్రాముల ఎండీఎంఏ (మిథలీన్ డైఆక్సీ మెటామ్‌ఫెటామిన్) డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
పట్టుబడినవారిలో నలుగురిపై పాత కేసులు ఉన్నట్లు వివరించారు. మాదకద్రవ్యాలు తయారు చేసేవారిని కూడా గుర్తించే పనిలో ఉన్నామని అన్నారు. గంజాయి, డ్రగ్స్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్ఛరించారు. మాదకద్రవ్యాల నిరోధంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 18న 'సంకల్పం' పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మంగళవారం అమరావతి విట్ వర్సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
''డ్రగ్స్ విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠా అరెస్టు చేశాం. ఈ క్రమంలో వారి దగ్గర నుంచి 17 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నాం. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి సరఫరా చేస్తున్నారు. బెంగళూరులో డ్రగ్స్ తయారీదారులను గుర్తించాల్సి ఉంది. గంజాయి, డ్రగ్స్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలానే డ్రగ్స్ నిరోధంపై అవగాహనకు సంకల్పం పేరుతో కార్యక్రమాలు చేపడతాం.'' - వకుల్ జిందాల్, ఎస్పీ
డ్రగ్స్ అమ్మేందుకు పెద్ద నెట్వర్క్: విజయవాడలో ఇటీవల ఎండీఎంఏ సింథటిక్ డ్రగ్స్ కలకలం రేపింది. ప్రైవేట్ ట్రావెల్స్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఈగల్ బృందం నిఘా పెట్టింది. ఈ క్రమంలో నగరంలోని మహానాడు జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టింది. బెంగళూరు నుంచి విశాఖ వెళ్తున్న బస్సులో శ్రీవాస్తవ, హవిలా అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది.
విజయవాడ నగరంలో తరచుగా డ్రగ్స్ కేసులలో పలువురు పట్టుబడుతున్నప్పటికీ అసలు సూత్రధారుల జాడ మాత్రం కానరావడం లేదు. వినియోగదారులే దొరుకుతున్నారు కానీ అసలైన వారు దొరకడం లేదు. పోలీసులు వీరి అరెస్టులతోనే సరిపెడుతున్నారు. ఫలితంగా ఎండీఎంఏ కేసులు చాప కింద నీరులా విస్తరిస్తూ గత రెండున్నర సంవత్సరాలుగా విజయవాడలో భారీ ఎత్తున పట్టుబడుతున్నాయి. ఇటీవల విశాఖపట్నం నగర యువతీ, యువకులు బెంగళూరు నుంచి 19.1 గ్రాములు డ్రగ్స్‌ను తరలిస్తుండగా దొరికిన సంగతి తెలిసిందే. ముందస్తు సమాచారంతోనే వారిని పోలీసులు పట్టుకుంటున్నారు. మిగిలిన సమయాల్లో గుట్టుగా రవాణా అవుతోంది.
ఇతర ప్రాంతాల నుంచి నగరం, చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో కళాశాలలకు వచ్చి చదివేవారిలో పలువురు మత్తుకు అలవడుతున్నారు. ఆఫ్రికా నుంచి వచ్చి చదువుతున్న విద్యార్ధుల్లో కొందరు దీనిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఆర్థిక అవసరాలకు దీనిని సరఫరా చేస్తున్నారు. వీరు బాగా నమ్మకస్తులకే అందిస్తారు. ఫోన్ చేస్తే చాలు రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోతున్నారు. నిఘా కళ్లుగప్పి తెస్తున్నారు. బస్సులు, రైళ్లలో విజయవాడకు తెస్తున్నారు.
కోరుకొన్న చోటకే కొరియర్లో మత్తు - కళాశాలలకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠా అరెస్టు
యథేచ్ఛగా నిషేధిత ఇంజక్షన్ల వినియోగం - పశ్చిమబెంగాల్, ఒడిశాల నుంచి భారీగా దిగుమతి

