ETV Bharat / state

ఏపీ, దిల్లీల్లో విఫలమైన విధానం తెలంగాణలో ఎందుకు? - ప్రభుత్వానికి హరీశ్​రావు సూటి ప్రశ్న

పాలిటెక్నిక్‌ల విలీనంతో పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్న హరీశ్​రావు - జీవో 97 రద్దు చేయకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని వెల్లడి - ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కే విధంగా వ్యవహరిస్తోందిని ఆరోపణ

HARISH RAO ARREST IN HANUMAKONDA
మాజీమంత్రి హరీశ్​ రావును అరెస్టు చేస్తున్న పోలీసులు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 27, 2026 at 2:28 PM IST

2 Min Read
Choose ETV Bharat

Harish Rao Arrested in Hanamkonda : పాలిటెక్నిక్‌ల విలీనంతో పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో 97ను రద్దు చేయాలని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. స్కిల్స్‌ యూనివర్సిటీ పేరుతో పాలిటెక్నిక్‌ కళాశాలలను విలీనం చేయడాన్ని నిరసిస్తూ వరంగల్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపేందుకు గురువారం ఇక్కడికి వచ్చిన హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేసి సుబేదారి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

హనుమకొండలో మాజీమంత్రి హరీశ్‌రావు అరెస్టు - కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం (ETV Bharat)

జీవో 97 రద్దు చేయకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం : పాలిటెక్నిక్‌ కాలేజీలను విలీనం చేస్తే ప్రైవేటీకరణ జరిగి ఫీజులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని హరీశ్​రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్, దిల్లీలలో ఇదే విధానాన్ని అమలు చేసి వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు. అక్కడ విఫలమైన విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తున్నారని సీఎంను ప్రశ్నించారు. విద్యార్థులను కళాశాలలోనే నిర్బంధించడం, కనీసం భోజనం కూడా అందించకపోవడం దారుణమన్నారు. దిల్లీ, ఇతర రాష్ట్రాల్లో సమస్యలపై పోరాటం చేసిన కాంగ్రెస్‌ నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమస్యలు వినాలని హరీశ్​రావు కోరారు. జీవో 97ను తక్షణమే రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తన ఉద్యమం చేస్తామన్నారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పెట్టుకుంటే శంకరగిరి మాన్యాలే : ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి శంకరగిరి మాన్యాలు తప్పవని హరీశ్‌రావు అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు ఆయన సంఘీభావాన్ని తెలిపి కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీపీఎస్‌ ఉద్యోగులను ఓపీఎస్‌లోకి మారుస్తామని హామీ ఇచ్చి మూడేళ్లవుతున్నప్పటికీ మోక్షం లేదన్నారు. నాడు కేసీఆర్‌ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం 1% కాంట్రిబ్యూషన్‌తో ఈహెచ్‌ఎస్‌ తెస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని 1.5 శాతానికి పెంచిందని వివరించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే హరీశ్​రావు అన్నారు. పదవీ విరమణ ప్రయోజనాలు రావాలంటే 15 శాతం కమీషన్‌ లంచంగా అడుగుతున్నారని ఓ బాధితురాలు కన్నీళ్లు పెట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాలోత్‌ కవిత, దాస్యం వినయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు. అంతకుముందు గురువారం ఉదయం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసం వద్ద పోలీసులు మోహరించారు. ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు ఆయన అక్కడే ఉన్నారు. అనంతరం పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో హరీశ్‌రావు వరంగల్‌కు బయలుదేరారు.

ఆడితే చిరిగిపోతాయి, ఉతికితే వెలిసిపోతాయి - విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలా? : హరీశ్​ రావు

పొంగులేటి రాజీనామా చేయాల్సిందే : హరీశ్​రావు ​