శరవేగంగా పోలవరం, సుజల స్రవంతి ప్రాజెక్టుల పనులు - 2027 మార్చికి అంతా సిద్ధం!
పోలవరం జలాశయం సిద్ధమయ్యేలోపే పూర్వోదయ కింద రూ.1,820 కోట్లకు ప్రతిపాదనలు - అన్ని వైపులకూ పోలవరం జలాలు - అవసరమైతే కొల్లేరుకూ

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 10, 2026 at 10:21 AM IST
Polavaram Project Works Will Be Completed by March : వచ్చే సంవత్సరం (2027) మార్చికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. దీంతో పాటు ఈ నీటిని ఉత్తరాంధ్ర జిల్లాలకూ అందించేందుకు వీలుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులూ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పోలవరం ఎడమ కాలువ చివర్లో అనకాపల్లి జిల్లాలో ఏడో ప్యాకేజి 162వ కిలోమీటరు నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ, పోలవరం ఎడమ కాలువ ఉమ్మడిగా ప్రవహిస్తాయి. పోలవరం రిజర్వాయర్ సిద్ధమయ్యే నాటికి ఇప్పటికే టెండర్లు పిలిచి సిద్ధంగా ఉన్న సుజల స్రవంతి పనులూ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకు తొలిదశలో రూ.2,020 కోట్లు అవసరం.
కేంద్రం రూపొందించిన పూర్వోదయ పథకంలో దీనికి రూ.1,820 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఎన్ని నిధులు దక్కేదీ కేంద్ర కొత్త బడ్జెట్‌లో తేలుతుంది. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ఎడమ కాలువకు అనుసంధానంగా ఉన్న పనులన్నీ చేయాలని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లు ఇచ్చేలా పనులూ ప్రారంభించాలని సీఎం పోలవరంలో అధికారులను ఆదేశించారు.
నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని పనులు : పోలవరం ఎడమ కాలువలో పూర్తి పనులు చేసేందుకు రూ.1,300 కోట్లు అవసరమని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే లెక్కించారు. నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని రూ.వెయ్యి కోట్ల లోపు పనులే చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆ మేరకు పనులు చేస్తున్నారు. పోలవరం ఎడమకాలువలో పూర్తిస్థాయి ప్రవాహ సామర్థ్యం సాధించాలంటే కొన్ని ప్యాకేజీల్లో లైనింగ్ పనులూ పూర్తిచేయాలి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జలవనరులశాఖ అధికారులు వాటిపైనా దృష్టి సారించారు.
గ్రావిటీ ద్వారా తరలింపులు : ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో ఇప్పటికే రెండు దశలకూ కలిపి నాలుగు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. తొలిదశలో భూసేకరణ సహా 1.30 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేందుకు రూ.2,020 కోట్లు ఖర్చవుతుందని అంచనా. తొలిదశలో రూ.400 కోట్లు, రూ.850 కోట్లతో గుత్తేదారులతో ఒప్పందాలు పూర్తయ్యాయి. రెండు దశల్లో ప్రస్తుతం టెండర్లు పిలిచిన ప్యాకేజీల పనులు పూర్తిచేస్తే ఉత్తరాంధ్రలో 4 లక్షల ఎకరాల వరకు నీళ్లు ఇవ్వవచ్చు. పోలవరం ఎడమకాలువ నుంచి 63.2 టీఎంసీల నీటిని ఎత్తిపోసి కొంతమేర ఎత్తిపోతల ద్వారా, మరికొంత గ్రావిటీ ద్వారా తరలించి ఆయకట్టుకు, తాగునీటికి ఇవ్వడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల్లో 46 మండలాల్లో 8లక్షల ఎకరాలకు సాగునీరు, 1037 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించడం ప్రధాన లక్ష్యం.
తొలుత గడిగడ్డ జలాశయానికి : పోలవరం ఎడమ కాలువ- ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ ఉమ్మడిగా 23 కి.మీ. ప్రయాణిస్తాయి. తాళ్లపాలెం వద్ద ఈ కాలువ నుంచి నీటిని ఎత్తిపోస్తారు. తర్వాత గ్రావిటీలో కొంతదూరం, ఎత్తిపోస్తూ కొంతదూరం తీసుకువెళ్లి ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గడిగడ్డ జలాశయానికి గోదావరి వరద జలాలను పోలవరం నుంచి మళ్లిస్తారు. తర్వాత వివిధ దశల్లో పెదపూడి, భూదేవి, వీరనారాయణపురం జలాశయం, తాటిపూడి అదనపు జలాశయాలకు నీటిని తీసుకువెళ్తారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకూ ఈ ఫలాలు అందుతాయి.
పోలవరం నీళ్లు కొల్లేరు వరకు : పోలవరం ద్వారా గోదావరి వరద జలాలను నలుమూలలకూ మళ్లించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. పోలవరం కుడికాలువ నుంచి అవసరమైతే కొల్లేరుకూ నీళ్లివ్వాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సుగా పేరుంది. సకాలంలో కొల్లేరుకు నీళ్లు చేరకుంటే అక్కడికీ నీళ్లు ఇవ్వాలనే యోచన ఉంది. అవసరమైతే ఆక్వాకు పోలవరం కుడికాలువ నీళ్లు మళ్లించే ఆలోచన చేస్తున్నారు. ఎడమ, కుడి కాలువల నుంచి ఆయా జిల్లాల్లో ఉన్న మధ్యతరహా రిజర్వాయర్లు, పెద్ద పెద్ద చెరువులకూ నీళ్లు మళ్లించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని పూర్తి నివేదిక సిద్ధం చేయాలని, ఎక్కడైనా స్లూయిస్‌లు కావాలంటే ఏర్పాటుచేద్దామని సీఎం పేర్కొన్నారు.
వచ్చే ఏడాది మార్చికల్లా పోలవరం - ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు
భావోద్వేగాలతో ఆటలొద్దు - నదీజలాలపై తెలంగాణ రాజకీయాలు చేయొద్దు: సీఎం చంద్రబాబు

