పోలవరం నిర్మాణానికి రూ.62,436 కోట్లు! - తాజాగా అంచనాలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం
పోలవరం నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం రూ.62, 436 కోట్లు - రెండో దశకు రూ.32,000 కోట్లు అవసరం - త్వరలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 24, 2025 at 7:11 AM IST
Government Latest Estimation Of Polavaram Project Cost : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం మొత్తం రూ.62,436 కోట్లు ఖర్చవుతుందని తేలింది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తొలిదశలో +41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు వీలుగా పనులు చేపట్టేందుకు రూ.30,436.95 కోట్లు మంజూరు చేసింది. రెండో దశలో +45.72 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు అవసరమైన నిధులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు మరో రూ.32,000 కోట్ల వరకు ఖర్చవుతుందని పోలవరం అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై సమగ్ర లెక్కలు రూపొందించి, త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు.
తొలిదశలో మంజూరైన నిధులు, రెండోదశ అంచనాలు కలిపి మొత్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.62,436 కోట్లకు చేరనుంది. ఈ అంచనాలపై సమగ్ర స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల దిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసిన సందర్భంగా రెండో దశ నిధుల సాధన కోసం లేఖ సమర్పించారు.
అడ్వాన్స్‌లో దాదాపు 80% ఖర్చు : పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు నిమిత్తం ఇచ్చిన నిధులు రూ.23,658.40 కోట్లు. తొలిదశలో మొత్తం రూ.30,436.95 కోట్లకు ఇంకా రూ.6,645 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల కేంద్రం అడ్వాన్స్‌గా నిధులు ఇస్తున్నందున ఒకప్పటిలా రీయింబర్స్‌మెంట్ తిప్పలు లేవు. పైగా ప్రస్తుతం కొంత అడ్వాన్స్ మొత్తం రాష్ట్ర ఖజానాలోనే ఉంది. ఇప్పటికే ఇచ్చిన అడ్వాన్స్‌లో దాదాపు 80% ఖర్చు చేసినందున మరో విడత నిధుల కోసం పోలవరం అథారిటీకి అధికారులు ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3,034 కోట్ల వరకు రాబట్టుకోవాలని యోచిస్తున్నారు. ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస చర్యలు వేగవంతం చేయాల్సి ఉంది.
17,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం : ఈ ప్రాజెక్టులో భాగంగా కుడి, ఎడమ కాలువలను ఏ ప్రవాహ సామర్థ్యం మేరకు తవ్వారో అందుకు తగ్గట్టుగా కేంద్రం నిధులు రీయింబర్స్ చేయలేదు. 2009 డీపీఆర్ ప్రకారం ఎడమ కాలువ 8,123 క్యూసెక్కులు, కుడి కాలువ 11,654 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం మేరకు తవ్వాలి. 2019లో సాంకేతిక సలహా కమిటీ సిఫార్సుల ప్రకారం రెండు కాలువలనూ 17,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం మేరకు నిర్మిస్తున్నారు. కుడి కాలువ నిర్మాణం పూర్తికాగా, ఎడమ కాలువ పనులు సాగుతున్నాయి.
2009 డీపీఆర్ ప్రకారమే ధరలు : 2017-18 ధరల ప్రకారం, పెంచిన ప్రవాహ సామర్థ్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లో ప్రతిపాదనలు సమర్పించింది. ప్రస్తుతం కేంద్రం 2009 డీపీఆర్ ప్రకారమే కాలువల పనులకు ధరలు కట్టింది. వాటిలోనూ కుడి కాలువకు సంబంధించి 93%, ఎడమ కాలువకు సంబంధించి 77% మాత్రమే అనుమతించి, మిగిలిన నిధులు కోత పెట్టింది. పెంచిన ప్రవాహ సామర్థ్యం మేరకు కాలువల నిర్మాణానికి అయిన ఖర్చు కేంద్రం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. తాజాగా దిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని కూడా కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ దృష్టికి తీసుకువెళ్లారు.
పెరిగిన ధరలకనుగుణంగా సవరణలు : 2005-06 నాటి అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.10,151.03 కోట్లు. తర్వాత ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ పెరిగిన ధరలకనుగుణంగా సవరణలు చేస్తూ వచ్చారు. అలా 2010-11, 2013-14, 2017-18 సంవత్సరాల్లో అంచనాలు సవరించారు. తాజాగా రెండో దశ నిర్మాణం దృష్ట్యా అంచనాలు మళ్లీ సవరిస్తున్నారు.

పోలవరంలో సీఎస్ఎంఆర్ఎస్ బృందం - డ్యామ్‌లో వినియోగించే మట్టి, రాళ్లు పరిశీలన
వైఎస్సార్సీపీ పాలనతో పోలవరం ఆలస్యం - రూ.50 వేల కోట్లు నష్టం: మంత్రి నిమ్మల

