సెప్టెంబర్ 2న అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు - విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు విడుదల - ఈ నేపథ్యంలో జల హారతి కార్యక్రమానికి రానున్న ముఖ్యమంత్రి పర్యటనకు పాయకరావుపేటలో విస్తృత ఏర్పాట్లు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 30, 2026 at 12:00 PM IST
Polavaram Canal Water Supply Arrangements: గోదావరి జలాలు అనకాపల్లి జిల్లా పోలవరం కాలువ ద్వారా తరలింపునకు సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 2న సీఎం చంద్రబాబు పాయకరావుపేట పర్యటనలో భాగంగా గోదావరి జలాలు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో జల హారతి కార్యక్రమానికి రానున్న ముఖ్యమంత్రి పర్యటనకు అనకాపల్లి జిల్లా అధికారులు పాయకరావుపేటలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా పాయకరావుపేట మండలంలోని పీఎల్ పురం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.
రైతులు, మహిళలు, కార్యకర్తలు కలిపి సుమారు 40 వేల మంది వరకు సభను వీక్షించేందుకు హాజరుకానున్నారు. ఇందుకుగానూ రవాణా శాఖ అధికారులు సుమారు 700 బస్సులను సిద్ధం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా భారీ టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు హెలిపాడ్, వాహనాల పార్కింగ్‌కు, సభ వద్దకు నేరుగా చేరుకునే విధంగా మార్గాలను ఇంజినీరింగ్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను హోం మంత్రి అనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ విజయకృష్ణన్ పర్యవేక్షిస్తున్నారు.
పోలవరం ఎడమ కాలువ జలహారతి కార్యక్రమానికి సంబంధించి నక్కపల్లి మండలంలో నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 14న జలహారతి ఇవ్వాలని తొలుత భావించినా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పనుల్లో జాప్యం చోటుచేసుకోవడం సెప్టెంబరుకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆరో ప్యాకేజీలో భాగంగా పాయకరావుపేట నుంచి దార్లపూడి వరకు 24 కిలోమీటర్ల పరిధి ఉంది. ఇందులో నక్కపల్లి మండలంలోనే సగానికిపైగా ఉండటం, చాలా మెరక గ్రామాల మీదుగా కాలువ తవ్వకం జరిగింది. పలు గ్రామాల వద్ద ప్రజల రాకపోకల నిమిత్తం వంతెనలు, పంట కాలువలు నిర్మించారు. జలహారతి తేదీ ప్రకటించినప్పటి నుంచి మిగిలిన పనులను అధికార యంత్రాంగం ఉరుకుల పరుగులతో చేయించింది.
రమణయ్యపేట: ఈ గ్రామం మీదుగా రేబాక, రేవళ్ల, తిరుపతిపాలెం గ్రామాలకు జనం రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ ర.భ.శా. పరిధిలో రోడ్డును దాటాల్సి ఉంది. దీంతో ప్రత్యామ్నాయంగా భారీ పైపులతో పెద్ద వంతెన నిర్మించారు. దీన్ని కేవలం 3 వారాల్లోనే పూర్తి చేయడం విశేషం. దీనిపై రాకపోకలు మొదలు పెట్టి, పాత రోడ్డును తవ్వేసి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేశారు.
ముకుందరాజుపేట: ఇక్కడ ఓ వంతెనతోపాటు గెడ్డపై మినీ అక్విడక్టు తరహాలో భారీ మదుము నిర్మిస్తున్నారు. ఇందులో వంతెన నిర్మాణం పూర్తి కాగా రెయిలింగ్, అప్రోచ్ రోడ్డు వేయాల్సి ఉంది. గెడ్డపై కాలువ నిర్మాణం తుది దశకు చేరింది. గెడ్డ నీరు అడుగు భాగం నుంచి వెళ్లేలా, పైనుంచి పోలవరం నీరు వెళ్లనుంది. ముకుందరాజుపేట గ్రామానికి ఇరువైపులా ఇటు జి.జగన్నాథపురం, అటు గుల్లిపాడు మీదుగా రాకపోకలు సాగించడానికి వీలుగా రెండు వంతెనలుండటం విశేషం.
సీతంపాలెం: ఈ గ్రామం నుంచి సీహెచ్‌బీ అగ్రహరం, వెదుళ్లపాలెం మీదుగా జాతీయ రహదారికి చేరుకోడానికి వీలుగా వంతెన అవసరమైంది. దీంతో అధికారులు 2 నెలల కిందట దీని నిర్మాణం మొదలు పెట్టి ప్రస్తుతం పూర్తి చేశారు. రెయిలింగ్, అప్రోచ్ రోడ్డు పని మిగిలి ఉంది. ఇటీవల కాలం వరకు దీనికి పక్కనే ఉన్న మట్టిరోడ్డుపై నుంచి స్థానికులు రాకపోకలు సాగించారు. ఈ క్రమంలో దీనికి ప్రత్యామ్నాయంగా కాంక్రీటు గెడ్డ మార్గంలో రాకపోకలకు ఏర్పాటు చేసి, మట్టి రోడ్డును తొలగించారు.
తుది దశకు చేరుకున్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులు - 31న ప్రారంభం
త్వరలోనే అనకాపల్లి, విశాఖకు గోదావరి నీళ్లు తెస్తాం: సీఎం చంద్రబాబు

