రాజమహేంద్రవరానికి పోలవరం అథారిటీ కార్యాలయం - కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు
పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటైన 12 ఏళ్ల తర్వాత రాజమహేంద్రవరం తరలింపునకు ఆదేశాలు - ఈనెల 27న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 4, 2026 at 10:41 AM IST
Polavaram Authority office at Rajamahendravaram : పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటైన పన్నెండు ఏళ్ల తర్వాత రాజమహేంద్రవరానికి తరలించేందుకు ఆదేశాలు వెలువడ్డాయి. హైదరాబాద్‌లో ఉన్న అథారిటీ కార్యాలయాన్ని వెంటనే రాజమహేంద్రవరం మార్చాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు జలశక్తి శాఖ డిప్యూటీ కార్యదర్శి బీఎల్. మీనా పోలవరం అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)కి లేఖ రాశారు. చీఫ్ ఇంజినీరు, డిజైన్ డిపార్ట్మెంట్తో సహా అందరినీ హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలని అందులో పేర్కొన్నారు. ఈ నెల 27న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు పోలవరం ప్రాజెక్టు సందర్శించడానికి వస్తున్నారని తెలుస్తూ ఉండగా అప్పటిలోగా తరలించాలని భావిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి దగ్గరగా: ప్రస్తుతం రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరులో పోలవరం అథారిటీ కోసం ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఆ భవనానికి రూ.3 లక్షలు అద్దె కూడా చెల్లిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచే పోలవరం అథారిటీ చీఫ్ ఇంజినీరు రమేశ్ కుమార్ పని చేస్తున్నారు. తాజా ఆదేశాల మేరకు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లు రాజమహేంద్రవరం రానున్నాయి. రాజమహేంద్రవరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంది. కార్యకలాపాలు నిర్వహించడానికి హైదరాబాద్‌లో ఎక్కడో ఉండవలసిన అవసరం లేదు. అంతేకాకుండా, పోలవరం ప్రాజెక్టు 2వ దశకు సంబంధించిన డీపీఆర్ రూపకల్పన చేయాల్సి ఉంది.
2వ దశకు డీపీఆర్ సిద్ధం చేయడం కీలకమైన అంశం: ఈ ప్రాజెక్టును 2 దశలుగా విభజించారు. మొదటి దశలో, +41.15 మీటర్ల ఎత్తుకు నీళ్లు నిలబెట్టేలా నిర్వహించడానికి అవసరమైన నిధులు మాత్రమే సెంట్రల్ గవర్మమెంట్ అందిస్తోంది. ఈ మేరకు వెచ్చించిన నిధులకు తగిన విధంగా ఆయకట్టు కల్పించాల్సి ఉంది. వాటి ద్వరా వ్యయం, ఫలితాలు సంతృప్తి చెందిన తర్వాత, 2వ దశలో +45.72 మీటర్ల వద్ద నీళ్లు నిలబెట్టేలా నిర్వహించడానికి పునరావాసం కోసం నిధులు ఇవ్వాల్సి ఉంది.
ఈ 2వ దశకు డీపీఆర్ సిద్ధం చేయడం కీలకమైన అంశం. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, పోలవరం అథారిటీతో సమన్వయంతో వీటిని రూపొందించాల్సి ఉంది. అదనంగా, కుడి, ఎడమ కాలువల డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువల నిర్మాణం కూడా చాలా ముఖ్యమే. వాటి ప్రణాళికలను కూడా సిద్ధం చేయాల్సి ఉంది. అథారిటీ కార్యాలయం రాజమహేంద్రవరంలో ఉండటం వల్ల ఈ కార్యకలాపాల్లో సమన్వయం కూడా సులభం కానుంది.
యాజమాన్య బోర్డును ఎప్పుడు తరలిస్తారు?
కృష్ణా నదీ యాజమాన్య బోర్డును రాష్ట్రానికి తరలించనున్నారు. ఉచిత వసతి కల్పిస్తే విజయవాడకు వస్తామని కృష్ణా బోర్డు చైర్మన్, కార్యదర్శి పేర్కొంటున్నారు. వసతి కోసం అనేక భవనాలను పరిశీలించినప్పటికీ, ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ప్రస్తుతం, హైదరాబాద్‌లోని జలసౌధలో ఉచిత వసతితో కృష్ణా బోర్డు కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
వేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు - 2027 పుష్కరాల నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం
'సింగిల్ నోడల్' ద్వారా రూ.5,929 కోట్ల నిధులివ్వండి - పోలవరం మూడో విడత అడ్వాన్సుపై కేంద్రానికి లేఖ

