పోలవరం ఏజెన్సీలో 'ఆపరేషన్ బిగ్ క్యాట్' - తొయ్యేరు కొండపై పెద్దపులి మకాం
పోలవరం జిల్లా ఏజెన్సీలో ప్రజలను వీడని పెద్దపులి భయం - పెద్దపులిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న అటవీ శాఖ - తొయ్యేరు పరిసరాల్లోని కొండపైకి పెద్దపులి చేరుకున్నట్లు గుర్తింపు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 17, 2026 at 12:55 PM IST
Polavaram Tiger Operation : పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఓ పెద్దపులి. గత కొంతకాలంగా ఆ ప్రాంతాల్లోనే సంచరిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రాణ భయంతో స్థానికులు వణికిపోతున్నారు. ఎలాగైనా ఆ పులిని ప్రాణాలతో పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. దేవీపట్నం మండలంలోని పలు గ్రామాల్లో తిరుగుతున్న ఈ పెద్దపులి, ప్రస్తుతం తొయ్యేరు పరిసర ప్రాంతంలోని ఓ అటవీ కొండ పైకి చేరుకున్నట్లు అధికారులు తాజాగా గుర్తించారు. పెద్దపులి సంచారం, అటవీ శాఖ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కొండపైకి చేరిన పెద్దపులి : పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలాన్ని పులి భయం వెంటాడుతూనే ఉంది. రోజుకో గ్రామం చుట్టుపక్కల ఈ పులి అడుగుజాడలు కనిపిస్తున్నాయి. తాజాగా పులి కదలికలను అధికారులు స్పష్టంగా పసిగట్టారు. అది తొయ్యేరు గ్రామం సమీపంలోని అటవీ కొండపై తలదాచుకున్నట్లు నిర్ధారించారు. దీంతో ఆ కొండ చుట్టుపక్కల ప్రాంతాలను అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
రంగంలోకి 'హనుమాన్' బృందాలు : పులిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో సురక్షితంగా పట్టుకోవాలని అటవీ శాఖ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. అటవీ శాఖకు చెందిన ప్రత్యేక 'హనుమాన్' బృందాలను రంగంలోకి దించింది. ఈ నిపుణుల బృందాలు ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. పులిని బంధించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి.
థర్మల్ డ్రోన్లతో నిఘా : పులి కదలికలను పసిగట్టేందుకు అధికారులు టెక్నాలజీని విస్తృతంగా వాడుతున్నారు. అధునాతన 'థర్మల్ డ్రోన్ల'ను ఉపయోగిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా డ్రోన్లతో నిఘా పెట్టారు. దట్టమైన అడవిలో, చీకట్లో కూడా పులి ఎక్కడుందో ఈ డ్రోన్లు పసిగడతాయి. ఈ డ్రోన్లు ఇచ్చే కచ్చితమైన సమాచారంతో అటవీ సిబ్బంది అడుగులు వేస్తున్నారు.
నలుదిక్కులా మోహరింపు : అటవీ శాఖ ఈ ఆపరేషన్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంది. భారీ స్థాయిలో సిబ్బందిని మోహరించింది. 'హనుమాన్' బృందాలతో పాటు ప్రత్యేక రెస్క్యూ బృందాలు కూడా అడవిని జల్లెడ పడుతున్నాయి. అవసరమైతే పులికి మత్తుమందు ఇచ్చి పట్టుకునేందుకు ట్రాంక్విలైజేషన్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. డ్రోన్ బృందాలు, క్షేత్రస్థాయి సిబ్బంది వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పులి కదలికలను గమనిస్తున్నారు.
12 రోజులుగా దాడులు నిల్ : పులి ఎట్టి పరిస్థితుల్లోనూ జనావాసాల వైపు రాకుండా అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అటవీ శాఖ తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గత 12 రోజులుగా ఏజెన్సీలో పులి దాడులు ఆగిపోయాయి. కొత్తగా ఏ ఒక్క పశువుపైనా పులి దాడి చేయలేదు. గ్రామస్థులకు కూడా ఎలాంటి హాని జరగకుండా సిబ్బంది పటిష్ట భద్రత కల్పిస్తున్నారు.
ప్రజలకు అధికారుల హెచ్చరికలు : జనావాసాల్లోకి పులి రాకుండా ఉండేందుకు ప్రత్యేక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (మైకుల) ద్వారా అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. స్థానికులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. గ్రామస్థులు ఎవరూ కూడా అనవసరంగా కొండ ప్రాంతాలకు, అడవులకు వెళ్లొద్దని హెచ్చరించారు. పశువులను అడవి అంచుల్లో లేదా గ్రామ శివార్లలో తాళ్లతో కట్టి వదిలివేయరాదని చెప్పారు. రాత్రి సమయంలో పశువులను తప్పనిసరిగా సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని సూచించారు. స్థానికులు సైతం రాత్రిపూట ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. తద్వారా పులి దాడి నుంచి తప్పించుకోవచ్చని స్థానికులకు సూచనలు చేశారు.
రాత్రంతా ప్రత్యేక ఆపరేషన్ - డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి
పోలవరం ఏజెన్సీలో పెద్దపులి - త్వరలోనే పట్టుకుంటామంటున్న అధికారులు

