ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేద్దాం : మోదీ
కొవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో సమస్యలు వచ్చాయన్న పీఎం మోదీ - పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని పిలుపు - సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ బహిరంగ సభలో మోదీ ప్రసంగం

Published : May 10, 2026 at 9:50 PM IST
PM Modi on Gold Purchase : కొవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో సమస్యలు వచ్చాయన్న పీఎం నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. యుద్ధాల వల్ల పొరుగు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, భారత్‌లో మాత్రం ధరల భారాన్ని ప్రజలపై పడకుండా చూశామని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలు కొన్ని అంశాలు పాటించాలని పిలుపిచ్చారు.
దుబారా తగ్గించుకోవాలి : దీర్ఘకాలంలో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని మనం తగ్గించుకోవాలని మోదీ సూచించారు. రైల్వే రంగంలో డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నామని, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య ఇంకా పెరగాలని పేర్కొన్నారు. సమీప భవిష్యత్‌లో పెట్రోల్, డీజిల్ అవసరం మనకు భారీగా తగ్గుతుందని, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గితే విదేశీమారక ద్రవ్యం మిగులుతుందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ విషయంలో దుబారా తగ్గించుకోవాలని సూచించారు. చాలా దేశాల్లో యూరియా బస్తా ధర రూ.3 వేలు ఉందని, భారత్‌లో మాత్రమే యూరియా బస్తా రూ.300 లోపు ఉందని వెల్లడించారు.
బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలి : అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయన్న ప్రధాని బంగారం కొనుగోళ్లను మనం తగ్గించుకోవాలని కోరారు. పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని, ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేద్దామని పిలుపునిచ్చారు. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీమారక ద్రవ్యం పెరుగుతుందని అన్నారు. విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ మ్యారేజ్‌లను తగ్గించుకోవాలని, వంట నూనెను కూడా మనం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు. వంట నూనెలో స్వయం సమృద్ధి సాధించాలని అన్నారు. ఎరువుల వినియోగం తగ్గించి భూసారాన్ని కాపాడాలని వెల్లడించారు.
స్వదేశీ వస్తువులనే వినియోగించాలి : మనం ఇంట్లో వాడే వస్తువులను ఒకసారి పరిశీలించండని ప్రధాని కోరారు. మన నిత్యావసర వస్తువులన్నీ విదేశాల నుంచి వచ్చినవేనని, అన్నింటికి దిగుమతులపైనే ఆధారపడితే దేశాభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మన నిత్యావసర వస్తువుల్లో స్వదేశీ వస్తువులే ఎక్కువగా ఉండాలని పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువులనే వినియోగిస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. స్వదేశీ అనేది కేవలం బీజేపీ నినాదం కాదని ఇది దేశ విధానని స్పష్టం చేశారు.
"అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం కొనుగోళ్లను మనం తగ్గించుకోవాలి. పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలి. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేద్దాం. బంగారం దిగుమతులు తగ్గితే.. విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుంది. విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ మ్యారేజ్‌లను తగ్గించుకోవాలి" - మోదీ, ప్రధాన మంత్రి
మోదీ ప్రజలకు పిలుపిచ్చిన అంశాలివే : -
- పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు మోదీ పిలుపు
- వ్యక్తిగత వాహనాలు తగ్గించి.. ప్రజారవాణా వినియోగం పెంచాలని విజ్ఞప్తి
- బంగారం కొనుగోళ్లను ఏడాదిపాటు నిలిపివేయాలని మోదీ పిలుపు
- పండగలు, శుభాకార్యాలకు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని విజ్ఞప్తి
- ఎరువుల వినియోగం సగానికి తగ్గించాలని రైతులకు ప్రధాని పిలుపు
- వంటనూనెల వినియోగం తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపు
- విదేశీ వస్తువుల వినియోగం తగ్గించి స్వదేశీ ప్రోత్సహించాలని పిలుపు
- విదేశీ పర్యటనలు, విదేశీ డెస్టినేషన్ మ్యారేజ్‌లు తగ్గించుకోవాలని విజ్ఞప్తి
- మధ్యతరగతి ప్రజలు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని మోదీ విజ్ఞప్తి
దేశం మొత్తం మార్పు కోరుకుంటోంది - తెలంగాణలో ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : ప్రధాని మోదీ
సైబరాబాద్ అతి పెద్ద ఉపాధి కేంద్రంగా మారింది - దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది : ప్రధాని మోదీ

