ETV Bharat / state

నరసాపురం లేసు ఉత్పత్తులు ప్రత్యేకం - మన్‌కీ బాత్‌లో ప్రధాని ప్రస్తావన

లక్ష మంది మహిళలు, 250 గ్రామాల్లో లేసు అల్లికలు - ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 51 సొసైటీల ఏర్పాట్లు -50 మంది ఎగుమతిదారులు - నరసాపురం లేసు అల్లికలకు గతేడాది జులైలో భౌగోళిక గుర్తింపు

PM Modi Praises Narasapuram Lace Industry
PM Modi Praises Narasapuram Lace Industry (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 29, 2025 at 4:29 PM IST

2 Min Read
Choose ETV Bharat

PM Modi Praises Narasapuram Lace Industry : రంగుల దారాలను ముచ్చటగా అల్లుతూ రూపొందించే లేసు ఉత్పత్తులు, దుస్తులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. గోదావరి జిల్లాల్లో దాదాపు నాలుగు దశాబ్దాల కిందట మొదలైన ఈ లేసు అల్లికలు క్రమంగా మహిళలకు ఉపాధి మార్గంగా అవతరించాయి. ఈ అంశాన్ని ఆదివారం నిర్వహించిన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలో 250 గ్రామాల్లో సుమారు లక్ష మంది మహిళలు లేసు అల్లికలు చేస్తున్నారు. ఈ ఉత్పత్తుల ఎగుమతిదారులు నరసాపురం ప్రాంతంలో 50 మంది వరకు ఉన్నారు. లేసు ఆకృతులను బట్టి కిలోకు రూ.100-150 వరకు తయారీదారులకు చెల్లిస్తున్నారు. ఏటా రూ.300 కోట్ల విలువైన ఉత్పత్తులు నరసాపురం పరిసర ప్రాంతాల నుంచి ఎగుమతి అవుతున్నట్లు అంచనా.

మరింత మెరుగుపడనున్న మహిళల ఉపాధి అవకాశాలు : లేసు అల్లికల్లో అధునాతన డిజైన్ల తయారీ, ఉత్పత్తులను నేరుగా విక్రయించునేలా మహిళలను ప్రోత్సహించేందుకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వద్ద సీతారామపురంలో కేంద్ర జౌళిశాఖ ఆధ్వర్యంలో హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా 2003లో లేసు పార్కు నెలకొల్పారు. దీనికి అనుసంధానంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 51 సొసైటీలు ఏర్పాటు చేశారు. తరువాత అంతర్జాతీయ లేస్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఈ పార్కును మరింత అభివృద్ధి చేసి, ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తే మహిళల ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి.

భౌగోళిక గుర్తింపు - మార్కెటింగ్‌కు ప్రణాళిక : లేసు అల్లికలతో అధునాతన డిజైన్ల తయారీపై మహిళలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆయా ఉత్పత్తుల మార్కెటింగ్‌కు కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. నాబార్డుతో కలిసి మహిళలకు తర్ఫీదివ్వడంతో పాటు లేసు ఉత్పత్తులను ఎన్జీవో ద్వారా ఐదేళ్ల పాటు మార్కెటింగ్‌ చేస్తారు. నాబార్డు బృందం గత రెండు నెలల్లో మూడుసార్లు లేస్‌ పార్కును సందర్శించి ఉత్పత్తులను పరిశీలించింది. నరసాపురం లేసు అల్లికలకు గతేడాది జులైలో భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌ - జీఐ) లభించింది.

ప్రధాని మన్​కీబాత్​లో నరసాపురం లేస్‌ కళ గొప్పతనం : మన సంప్రదాయ కళలు సమాజానికి సాధికారత కల్పించడంతో పాటు ప్రజల ఆర్థిక పురోగతికి సాధనంగా పని చేస్తున్నాయని ప్రధాని మోదీ మన్​కీ బాత్​లో అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం లేస్‌ కళ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజాభిమానాన్ని పొందుతోందని ప్రధాని తెలిపారు. ఈ కళాకారులకు కొత్త డిజైన్లపై ఏపీ ప్రభుత్వం, నాబార్డ్‌ సంయుక్తంగా శిక్షణనిస్తున్నాయన్నారు. తద్వారా ఆయా ఉత్పత్తులు కొత్త మార్కెట్లకు చేరువవుతున్నాయని వివరించారు. ఇలాంటి వారిని ముందుకు తీసుకురావడానికి మన్‌కీ బాత్‌ ఒక వేదికగా పని చేస్తోందని, మహిళలు తమ కష్టంతో సంప్రదాయ కళను ప్రోత్సహించడంతో పాటు సాధికారత సాధిస్తున్నారని ప్రధాని మన్‌కీ బాత్‌లో వివరించారు.

పీఎం మోదీకి చంద్రబాబు ధన్యవాదాలు : ఏపీలో తరాలుగా కుటుంబాలు, సమాజం కాపాడుతున్న అద్భుతమైన కళల్లో నరసాపురం లేస్‌ క్రాఫ్ట్‌ ఒకటని సీఎం చంద్రబాబు తెలిపారు. మన్‌కీ బాత్‌లో నరసాపురం లేస్‌ క్రాఫ్ట్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీకి ఎక్స్‌ వేదికగా ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. ‘కళను సంరక్షించడమే కాకుండా ప్రపంచానికి పరిచయం చేసిన మహిళల నైపుణ్యం, అంకిత భావాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారికి నిరంతరం ప్రభుత్వం తరఫున మద్దతుగా నిలుస్తున్నాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

రాయదుర్గం ‘జీన్స్’ - తక్కువ ధరకే బ్రాండెడ్ లుక్ - ఆన్‌లైన్ మోడల్స్‌ను తలదన్నేలా తయారీ

సంక్రాంతి సీజన్‌పై వస్త్ర వ్యాపారుల ఆశలు - ఉప్పాడ జాంధానీ మళ్లీ ఊపు అందుకోనుందా!