చిన్నారి గొంతులో ప్లాస్టిక్ డబ్బా - చాకచక్యంగా ప్రాణాలు కాపాడిన వైద్యులు
తల్లిదండ్రులు లేని సమయంలో మెంతోప్లస్ బామ్ డబ్బాను మింగిన చిన్నారి - ఏమాత్రం కొంచెం ఆలస్యం జరిగినా ఊపిరాడకపోయే ప్రమాదం ఉండేది : వైద్యులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 27, 2025 at 2:20 PM IST
|Updated : December 27, 2025 at 3:53 PM IST
Plastic Object Stuck In Baby's Throat : ప్రమాదవశాత్తు చిన్న ప్లాస్టిక్ డబ్బాను మింగిన ఎనిమిది నెలల చిన్నారి ప్రాణాలను కాకినాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) వైద్యులు కాపాడి, అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. వైద్య బృందం సకాలంలో స్పందించి చిన్నారి ప్రాణాలను కాపాడారు. సమన్వయంతో చేసిన ప్రయత్నాల వల్ల ప్రాణాంతక ప్రమాదం తప్పింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
తల్లిదండ్రులు లేని సమయంలో : ఆసుపత్రి అధికారుల ప్రకారం, అల్లూరి సీతారామరాజు జిల్లా, దేవీపట్నం మండలం, దమనాపల్లి గ్రామానికి చెందిన పాండల్, విజయదుర్గలకు ఎనిమిది నెలల చిన్నారి ఉంది. మూడు రోజుల కింద విజయదుర్గ అనారోగ్యం కారణంగా జీజీహెచ్‌లోని న్యూరో-మెడిసిన్ విభాగంలో చేరి, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెతో పాటు కుమార్తె కూడా అక్కడే ఉంది. శుక్రవారం వైద్య పరీక్షల నిమిత్తం తల్లిదండ్రులు ఇద్దరూ బిడ్డను వార్డులోనే ఉంచి వైద్యుని వద్దకు వెళ్లారు. ఆ సమయంలో చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న మెంతోప్లస్ బామ్ డబ్బాను మింగింది. ఊపిరాడక ఇబ్బంది పడింది. చిన్నారి ఇబ్బంది పడటాన్ని గమనించిన వార్డులో ఉన్న ఇతర రోగులు, సహాయకులు వెంటనే ఆ చిన్నారిని అత్యవసర విభాగానికి తరలించారు.
తక్షణమే స్పందించి వైద్యం అందించారు : చిన్నారిని అత్యవసర విభాగానికి తీసుకువచ్చేసరికి, పాప నోటి నుంచి రక్తం కారుతోంది. దానితో ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి చేరింది. వెంటనే అక్కడ విధుల్లో ఉన్న సీఎంవో డాక్టర్ సుష్మ తక్షణమే స్పందించారు. ఆసుపత్రిలో ఉన్న ఇతర వైద్యులు డా. సత్యవాణి, డా. మాణిక్యం, డా. కాంతిమా సాయంతో పాప గొంతులో అడ్డుపడిన డబ్బాను చాకచక్యంగా బయటకు తీసి, ప్రాణాపాయస్థితి నుంచి ఆ చిన్నారిని కాపాడారు.

గాలి లోపలికి వెళ్లకుండా ప్లాస్టిక్ డబ్బా అడ్డంగా ఉండిపోయింది, ఏమాత్రం కొంచెం ఆలస్యం జరిగినా ఊపిరాడకపోయే ప్రమాదం ఉండేదని వైద్యులు తెలిపారు. డబ్బాను బయటకు విజయవంతంగా తీసిన తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయు)కి తరలించారని చెప్పారు.
"ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉంది అంతేకాకుండా చికిత్సకు కూడా బాగా స్పందిస్తోంది. డబ్బా ఇరుక్కుపోవడం వలన చిన్నారి గొంతుకకు గాయమైంది. దాని వల్ల ఇతర సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చిన్నారిని నిరంతరం పర్యవేక్షణలో ఉంచాం" -డాక్టర్ వెంకటేశ్వర్లు, శిశువైద్య నిపుణుడు
వృత్తి నైపుణ్యానికి, అంకితభావానికి ప్రశంసలు : ఇటువంటి క్లిష్ట సందర్భంలో సమయస్ఫూర్తితో తక్షణ చర్యలు చేపట్టి, చిన్నారి ప్రాణాలను కాపాడిన వైద్యులను, నర్సింగ్ సిబ్బందిని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, ఇతర సీనియర్ అధికారులు అభినందించారు. ప్రాణాలను కాపాడటంలో బృంద సమిష్టి కృషి, అత్యవసర సంసిద్ధతల ప్రాముఖ్యతను ఇటువంటి సంఘటనలు నొక్కి చెబుతాయని డాక్టర్ లావణ్యకుమారి పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె బృందంలో ఉన్న వారి వృత్తి నైపుణ్యాన్ని, అంకితభావాన్నికూడా ప్రశంసించారు. ఇటువంటి ప్రాణాంతక ప్రమాదాలు మళ్లీ జరగకుండా నివారించడానికి, ముఖ్యంగా ఆసుపత్రి వార్డులలో, చిన్న వస్తువులను పసిపిల్లలకు అందుబాటులో ఉంచకుండా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తల్లిదండ్రులకు సూచించారు.
ఎక్మోపై 500 కి.మీ ప్రయాణం - కిమ్స్ ఐకాన్ వైద్యుల అరుదైన శస్త్రచికిత్స
న్యుమోనియాతో ఇన్ఫెక్షన్ - మూడేళ్ల బాలుడి ప్రాణాలు కాపాడిన కిమ్స్ సవీర వైద్యులు

