దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి అనుమతి - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
కొత్త పోర్టు, నౌకా నిర్మాణ క్లస్టర్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఏపీ మారిటైం బోర్డుకు అనుమతులు - 2 వేల ఎకరాల సేకరణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 8:10 AM IST
Permission Granted for Construction of Dugarajapatnam Port : తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో కొత్త పోర్టు, నౌకా నిర్మాణ క్లస్టర్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఏపీ మారిటైం బోర్డుకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఓడరేవులు, జలమార్గాల మంత్రిత్వ శాఖ షిప్‌బిల్డింగ్ డెవలప్‌మెంట్ పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రాజెక్టు అమలుకు అవసరమైన 2 వేల ఎకరాలను సేకరించేందుకు మారిటైం బోర్డుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ మారిటైం బోర్డు సీఈవోను ప్రభుత్వం ఆదేశించింది.
షిప్‌బిల్డింగ్ రంగం బలోపేతం : దుగరాజపట్నంలో పోర్టు, షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌లో ఒక యాంకర్ షిప్‌యార్డు (ఏడాదికి 0.5 మిలియన్ టన్నుల స్థూల రవాణా) ప్రారంభించిన్పటి నుంచి పదేళ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలి. రైట్స్ సంస్థ టెక్నో ఎకనమిక్ ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా పోర్టు ఏర్పాటుకు నిర్ణయం. ఏపీ మారిటైం బోర్డు, విశాఖ పోర్టు ట్రస్టు సమన్వయంతో ప్రాజెక్టు అమలు. ఈ ప్రాజెక్టు దేశ షిప్‌బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయడంలో దోహదం. మారిటైం ఇండియా విజన్ 2030, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పాటు.
మారిటైం బోర్డు ఎంపిక : కేంద్ర మంత్రిత్వ శాఖ నిబంధనల మేరకు విశాఖ పోర్టు ట్రస్టుతో కలిపి ఎస్‌పీవీ ఏర్పాటు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, విశాఖ పోర్టుకు సమాన వాటా. బోర్డు డైరెక్టర్లలో ఇరువురికీ సమాన అవకాశం. ప్రాజెక్టు అమలుకు సేకరించిన భూములను ఎస్‌పీవీకి బదిలీ చేసేందుకు అనుమతి. వాటిని రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీ కింద పరిగణించాలని నిర్ణయం. పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా షిప్ యార్డు అభివృద్ధికి భాగస్వామ్య సంస్థను మారిటైం బోర్డు ఎంపిక చేస్తుంది.
తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తాం: సీఎం చంద్రబాబు
అనువైన ప్రదేశం చూడాలని సీఎం సూచన : కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో సముద్రయాన రంగంలో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిమచాయి. తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం నుంచి గతంలోనే అనుమతి లభించిన సంగతి తెలిసిందే. అక్కడ ఓడరేవు నిర్మాణానికి తగినంత భూములు లేవని రోడ్లు, భవనాలు, రవాణా, ఐఅండ్‌ఐ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు గతంలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కాకపోతే పోర్టు నిర్మాణానికి అనువైన ప్రదేశం ఎక్కడుందో చూడాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి చంద్రబాబు సూచించిన విషయం చెలిసిందే. ఏపీలో సుదీర్ఘ సముద్ర తీరం ఉన్నందున పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసి, ఎయిర్ కనెక్టివిటీ పెంపొందిస్తే పరిశ్రమలు వస్తాయని సీఎం చంద్రబాబు గతంలోనే తెలిపారు. వీటి ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయనీ, పన్నుల రూపంలో ఆదాయం వస్తుందనీ, అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
కారిడార్‌లా అభివృద్ధి చెందుతుందన్న సీఎం: నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు ఉందనీ, తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం, ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టులు వస్తే ఆ ప్రాంతం మొత్తం ఒక కారిడార్‌లా అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. వాటితో పాటు దొనకొండ, నాగార్జునసాగర్, బొబ్బిలిల్లోని ఎయిర్‌స్ట్రిప్‌లను అభివృద్ధి చేద్దామని చెప్పారు.
దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ - రాష్ట్రానికి వస్తున్న కేంద్ర బృందం

