చిన్న చిన్న కారణాలతో ఉసూరుమంటున్న ప్రాణాలు - ధైర్యం చెప్పేవారుంటే సరి
హైదరాబాద్ మహానగరంలో ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్న బలవన్మరణాలు - విజయారెడ్డి తన పిల్లలతో కలిసిప్రాణాలు తీసుకోవడం - అంబర్‌పేటలో ఆర్థిక సమస్యలతో ఒకే కుటుంబానికి ముగ్గురి ఆత్మహత్య

Published : February 25, 2026 at 10:52 PM IST
Mental Stress Health Problems : ఒంటరితనం, ఆర్థిక సమస్యలు, చదువుల ఒత్తిడి, కుటుంబ కలహాలు, కుంగుబాటు కారణమేదైనా కొందరు ప్రస్తుత రోజుల్లో చావే శరణ్యమని భావిస్తున్నారు. ఈ క్రమంలో తాము చనిపోవడమో ఇతరులను చంపడమో అనే ఆలోచనలతో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. చివరికి ముక్కుపచ్చలారని చిన్నారులనూ బలితీసుకుంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇటీవల ఇలాంటి ఘటనలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. చెర్లపల్లి రైల్వే ట్రాక్‌పై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయారెడ్డి తన పిల్లలతో బలవన్మరణానికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. తాజాగా అంబర్‌పేటలో ఆర్థిక సమస్యలతో ఒకే కుటుంబానికి ముగ్గురు సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సరిగ్గా మూడు నెలల క్రితం అంబర్‌పేటలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.
అప్పులు తీర్చలేక : ఇంటి పెద్దలు వ్యాపారాలు, అప్పులు తీసుకుని తీర్చలేక ఒత్తిడితో మరణమే శరణ్యంగా స్వీకరిస్తున్నారు. దీనికితోడు ఎలాంటి ఉద్యోగం లేక, పలు రకాల బెట్టింగ్ యాప్‌లలో డబ్బు కోల్పోయి ప్రాణాలు తీసుకుంటున్నారు.
మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు : కుటుంబ సమస్యలు, పరీక్షలు, అనారోగ్యంతో కొందరు విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. మానసిక ప్రశాంతత లేక నిరాశకు లోనై ప్రతికూల ఆలోచనలు చేస్తున్నారు. ఈ సమయంలో చిన్నపాటి నిరాశ ఎదురైనా, విమర్శించినా అస్సలు తట్టుకోలేకపోతున్నారు.
క్షణికావేశం, అసహనం : మారుతున్న పరిస్థితులతో ఎక్కువ మందిలో ఓపిక చాలా వరకు నశిస్తోంది. కోపాన్ని నియంత్రించుకోలేక ఆత్మహత్యలు, హత్యలకు తెరలేపుతున్నారు. కొందరిపై అయితే సోషల్ మీడియా ప్రభావం ఉంటోంది.
ఇలా చేస్తే ముందే గుర్తించొచ్చు
- ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిని కొన్ని లక్షణాల ద్వారా ముందే గుర్తించొచ్చని సైకియార్టిస్టులు స్పష్టం చేస్తున్నారు.
- అప్పటివరకూ అందరితో కలివిడిగా ఉండే వ్యక్తులు ఒక్కసారిగా ప్రవర్తన మార్చుకుని ఒంటరిగా, మౌనంగా ఉండడం.
- ఇతరులతో మాట్లాడేందుకు ఏమాత్రం ఇష్టపడకపోవడం, ఒంటరిగానే ఉంటూ మరి తీవ్రంగా, లోతుగా ఆలోచించడం.
- ఆ సమయానికి ఉంటానో లేదో అంటూ తరచూ చావు గురించి మాట్లాడటం.
- ఆత్మహత్య చేసుకోవడానికి అనువైన ప్రాంతాల గురించి పదే పదే వెతకడం, అవసరమైన అన్ని రకాల వస్తువులను సమకూర్చుకోవడం.
అసలు వీరికి కొంతైనా ధైర్యం చెప్పే వారేరి? : ఆత్మహత్యలు ఎక్కువగా కుటుంబ సమస్యలతోనే జరుగుతున్నట్లు ఎన్సీఆర్బీ- 2023 నివేదిక స్పష్టంగా చెబుతోంది. 2023లో హైదరాబాద్‌లో 659 ఆత్మహత్య కేసులు నమోదైతే అందులో ఎక్కువగా అంటే 500 మంది పురుషులు ఉండటం గమనార్హం. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల సమస్య ఏదొచ్చినా ఇంట్లో పెద్దలు కొంతవరకు ధైర్యం చెప్పి ఉత్తేజాన్ని ఇచ్చేవారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆర్థిక సమస్యలతో ఒంటరితనం పెరుగుతోంది.
జీవితంలో, వృతిపరమైన ఉద్యోగాల్లో చిన్న సమస్య వచ్చినా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో కలిసికట్టుగా ఆత్మహత్యలు వీటిలో పసిపిల్లలను బలిపెడుతున్న ఘటనలు కూడా ఇటీవల హెచ్చుమీరుతున్నాయి. గతేడాది హబ్సిగూడలో ఆర్థిక సమస్యలతో భార్యభర్తలు ఇద్దరు పిల్లల్ని చంపి ఆ తర్వాత వారు ప్రాణాలు తీసుకున్నారు. జీడిమెట్లలో పిల్లలు ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటున్నారని బాధపడుతూ తల్లి ఇద్దరు పిల్లల్ని నరికి చంపి ఆ తర్వాత భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది.
"సమస్య ఏదైనా చావే పరిష్కారం కాదని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అప్పటివరకూ హుషారుగా ఉన్న వారు వింతగా ప్రవర్తిస్తుంటే వెంటనే కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి. ప్రతికూల ఆలోచనలతో ఉన్నవారితో ఎక్కువ మాట్లాడుతూ వారిలో వీలైనంత మార్పు తీసుకురావాలి. నగరాల్లో ఇరుగుపొరుగు వారు, స్నేహితులు ఇబ్బందులో ఉన్నట్లు గమనిస్తే తోచినంత తోడ్పాటు అందించాలి. షీటీమ్స్ తరహాలో ప్రభుత్వం ఫ్యామిలీ కౌన్సిలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది" -డాక్టర్ మోతుకూరి రాంచందర్, సైకాలజిస్ట్
ముందు వలపు గీతం - విఫలమైతే మృత్యు గీతం!
లవ్ ఫెయిలైనా ఉందిలే 'మంచి జీవితం ముందు ముందునా' - సూసైడ్ చేసుకునే ముందు 'ఆలోచించు నంద నందనా'

