ETV Bharat / state

రాష్ట్రంలో 19 కరోనా కేసులు ​ - సీజనల్‌ వ్యాధి లాంటిదే ఆందోళన వద్దంటున్న వైద్యులు

రాష్ట్రంలో అక్కడక్కడ కోవిడ్‌ కేసులు నమోదు - ఇది ఒమెగా ఆర్‌ఎఫ్‌.5 వేరియంట్‌గా గుర్తింపు - ఈ కోవిడ్‌ సాధారణ సీజనల్‌ వ్యాధి లాంటిదే - ఒమెగా ఆర్‌ఎఫ్‌.5 వేరియంట్‌ గురించి భయం అక్కర్లేదు

People Need To Be With New Variant of Covid
People Need To Be With New Variant of Covid (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 21, 2026 at 12:09 PM IST

3 Min Read
Choose ETV Bharat

People Need To Be CareFul With New Variant of Covid : రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 19కి చేరింది. అత్యధికంగా YSR కడప జిల్లాలో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కాకినాడ జిల్లాల్లో రెండేసి కేసులు, అలాగే పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఏలూరు, NTR, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున గుర్తించారు. బాధితులలో నలుగురు మరణించగా, ముగ్గురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఎనిమిది మంది రోగులు ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా, నలుగురు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ తాజా కేసులకు 'ఒమిక్రాన్ RF.5' వేరియంట్ కారణమని ప్రభుత్వం గుర్తించింది. నిఘా విభాగం ద్వారా రాష్ట్రవ్యాప్త పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.

సీజనల్‌ వ్యాధి లాంటిదే : రాష్ట్రంలో కొత్త కరోనా వైరస్ వేరియంట్ ఆనవాళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)లో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన పాజిటివ్ నమూనాలను పరీక్షించగా 'RF.5' వేరియంట్ ఉన్నట్లు వెల్లడైంది. ఈ పరిణామంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ వైరస్​కు చెందిన 'RF.5' గురించి భయపడవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అయితే వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఏడాదిలోపు శిశువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని వారు కోరారు.

ఈ వేరియంట్ అంటే ఏమిటి? : కాలక్రమేణా, కోవిడ్-2 వైరస్ ఒమిక్రాన్‌గా రూపాంతరం చెందింది. దాని సబ్​ డివిజన్​ JN.1 నుంచి LF.7 , PY.1.1.1 అనే శాఖలు ఉద్భవించాయి. 'RF.5' అనేది ఈ రెండింటి కలయిక.

  • పాటించాల్సిన జాగ్రత్తలు: రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించండి.
  • తరచుగా చేతులు శుభ్రం చేసుకోండి.
  • మధుమేహం, శ్వాసకోశ సమస్యలు, లేదా గుండె, మూత్రపిండాల వ్యాధులు ఉన్న వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు తీవ్రంగా ఉంటే, రోగిని ఆసుపత్రిలో చేర్పించి వైద్య పర్యవేక్షణలో ఉంచాలి.
  • ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు లక్షణాలు కనిపిస్తే, వారు గృహ నిర్బంధంలో ఉండాలి. మూడు, నాలుగు రోజుల్లో లక్షణాలు తగ్గకపోతే, వారు వైద్యుడిని సంప్రదించాలి.
  • వ్యాధి లక్షణాలు? దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం.

ప్రత్యేకమైన ప్రమాదకర లక్షణాలు ఏవీ లేవు: విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల , మైక్రోబయాలజీ విభాగాధిపతి, డాక్టర్‌ ప్రశాంతి కొల్లి ఒమిక్రాన్​ వేరియంట్​కు సంబంధించి కొన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నివేదికల ప్రకారం, ఈ కొత్త వేరియంట్‌లో ఎలాంటి ప్రత్యేక ప్రమాదకర లక్షణాలు లేవని డాక్టర్‌ ప్రశాంతి కొల్లి తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇది ఇంతకుముందు ఉన్న కరోనా వేరియంట్​ మాదిరిగానే, సీజనల్ కరోనావైరస్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఒక వేరియంట్‌గా నిపుణులు గుర్తించారని పేర్కొన్నారు. అయితే శిశువులు, గర్భిణీ స్త్రీలు లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులలో లక్షణాలు కనిపిస్తే ప్రత్యేక వైద్య సంరక్షణ అవసరమని అన్నారు. ప్రభుత్వం అన్ని ఆసుపత్రులలో పరీక్షలు, చికిత్స కోసం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారని ప్రశాంతి చెప్పారు.

"మేము ప్రస్తుతం నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల నుంచి నమూనాలను సేకరించి, జీనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపాం. వారి నివేదిక ఆ స్ట్రెయిన్‌ను ఒమిక్రాన్ వేరియంట్​ RF.5 సబ్-లైనేజ్‌గా గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, ఈ వేరియంట్ ఎటువంటి ప్రమాదకర లక్షణాలను ప్రదర్శించదు. అయినప్పటికీ, దీనిని నియంత్రించడానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది" -డాక్టర్‌ ప్రశాంతి కొల్లి, మైక్రోబయాలజీ విభాగాధిపతి, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ

పెరుగుతున్న కరోనా కేసులు - విజయవాడ జీజీహెచ్​లో ప్రత్యేక వార్డు ఏర్పాటు

ఏపీలో కొవిడ్ కేసులు - ‘ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌.5’ వేరియంట్​గా గుర్తింపు