ETV Bharat / state

జ్ఞాపకాలన్నీ కృష్ణమ్మకు వదిలేసి - బరువెక్కిన హృదయంతో ఊరికి కన్నీటి వీడ్కోలు!

ఊళ్లు ఖాళీ చేస్తున్న వెలిగొండ ముంపు గ్రామాల ప్రజలు - ఇల్లు, వాకిలీ వదిలి వెళ్లాలంటే బాధగా ఉంటుందన్న జనం - తరాల అనుబంధాలు తెంచుకుని బాధాతప్త వీడ్కోలు

Veligonda Project Updates
ఊళ్లు ఖాళీ చేస్తున్న వెలిగొండ ముంపు గ్రామాల ప్రజలు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 27, 2026 at 8:22 AM IST

2 Min Read
Choose ETV Bharat

People Evacuating Villages due to Veligonda Project : ఊరంటే మన బాల్యాన్ని మోసిన నేల. మన ఆటపాటలు, చిరునవ్వులకు చిరునామా. కలిసి బతికిన మనుషులు. మనసువిప్పి మాట్లాడుకునే స్నేహితులు. ఓనమాలు దిద్దిన బడి. మొక్కిన గుడి. ఇలాంటి భావోద్వేగాలన్నీ ముడిపడిన ఊరికి దూరంగా ఉండాలంటే ఏదోలా ఉంటుంది. అలాంటిది అసలు ఆ ఊరితో అనుబధం శాశ్వతంగా తెగిపోతుందంటే ఆ బాధ వర్ణణాతీతం. ప్రస్తుతం వెలిగొండ ముంపు గ్రామాలది ఇలాంటి వేదనే. అభివృద్ధికి ఊపిరి పోస్తూ అస్తిత్వాన్ని కోల్పోతున్న ఊళ్లపై ప్రత్యేక కథనం.

ఈ ఊళ్లలో సందడి కొన్నాళ్లలో కనుమరుగు కాబోతోంది. వీధులు ఖాళీ అవుతాయి. ఇళ్లు బోసిపోతాయి. బడి బోరుమంటుంది. ఏళ్ల తరబడి రైతు చెమటతో తడిసిన పొలాలు కృష్ణా జలాలతో మునిగిపోనున్నాయి. వెలిగొండ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం తర్వాత ఈ ఊళ్లన్నీ సంతోషం నుంచి శూన్యంలోకి వెళ్లిపోతాయి.

జ్ఞాపకాలన్నీ కృష్ణమ్మకు వదిలేసి - బరువెక్కిన హృదయంతో ఊరికి కన్నీటి వీడ్కోలు! (ETV Bharat)

జ్ఞాపకాలన్నీ కృష్ణమ్మకు వదిలేసి: వెలిగొండ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గరపడడంతో ముంపు గ్రామాల ప్రజలు ఊళ్లు వదిలి వెళ్లిపోతున్నారు. పుట్టిపెరిగిన జ్ఞాపకాలన్నీ కృష్ణమ్మకు వదిలేసి బరువెక్కిన హృదయంతో బయటకు వెళ్తున్నారు. నేలతల్లితో అనుబంధాన్ని తెంచుకోలేక రైతుల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు సెలవు పెట్టి మరీ ఊళ్లకు వస్తున్నారు. పూర్వ విద్యార్థులు కూడా విద్యాబుద్ధులు నేర్పిన బడిని చివరిసారిగా చూసుకుంటున్నారు. తరగతి గదులు, ఆవరణలో తిరుగుతూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఫోన్లలో జ్ఞాపకాలు భద్రపరుచుకుంటున్నారు.

"పుట్టిన ఊరు వదిలి వెళ్లాలంటే చాలా బాధగా ఉంది. ఇక్కడే పుట్టి పెరిగాం. ఇప్పుడు విడిచి వెళ్లాలి అంటే భారంగా ఉంది. ప్రాజెక్టు వల్ల భవిష్యత్తు బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాం" - వెలిగొండ నిర్వాసితులు

ఇకపై ఏ బడికి వెళ్లాలో?: ప్రస్తుతం ముంపుగ్రామాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇకపై ఏ బడికి వెళ్లాలో తెలియని అయోమయంలో ఉన్నారు. కొత్త పాఠాశాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు.? అక్కడికి ఎలా వెళ్లాలో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అభివృద్ధికి తమ ఊరిని త్యాగం చేసి కొత్త చిరునామాలకు వెళ్లినా పాత ఊరు మాత్రం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని చెబుతున్నారు.

మాకు కనీసం స్కూల్ కూడా ఏర్పాటు చేయకుండా ఊరు ఖాళీ చేసి వెళ్లమంటే మేం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉన్న మరో పాఠశాలనేమో కలెక్టర్ ఆఫీసుగా మార్చేశారు. మాకు సరైన బస్సు సౌకర్యం కూడా లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం హాస్టల్ వసతి కల్పిస్తే ఎంతో బాగుంటుంది. అధికారులు తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయాలి" - విద్యార్థులు

'మా మొర ఆలకించండి సారూ' - వెలిగొండ నిర్వాసితుల్లో పునరావాస వెలితి!

'వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు' - 30 ఏళ్ల సంకల్పం నెరవేరిందని 'ఎక్స్'​లో చంద్రబాబు పోస్ట్​