బస్సులు, రైళ్లు ఫుల్ - సంక్రాంతి పండక్కి ఊరు వెళ్లేదెలా!
సంక్రాంతి పండక్కి ఊళ్లకు వెళ్లేందుకు ప్రయాణికుల ఇక్కట్లు - బస్సులు, రైళ్లలో సీట్లు నిండిపోయాయని ఆవేదన - ఏపీఎస్ఆర్టీసీ బస్సులు పెంచాలని కోరుతున్న జనం - ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ అరికట్టాలని డిమాండ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 9, 2026 at 3:47 PM IST
People Facing Difficulties Due to Lack of Tickets on Buses and Trains: సంక్రాంతికి కుటుంబాలతో ఊరెళుతున్నారా ఈసారి కూడా ప్రయాణకష్టాలు తప్పటం లేదు. ఏ బస్సులోనూ సీటు లేదు. ఏ రైలులోనూ బెర్తు లేదు. ఇక ప్రత్యేక బస్సులు, రైళ్లు అంటారా వాటిల్లోనూ ఇదే పరిస్ధితి. పండుగకు ముందు హైదరాబాద్ రూట్‌లో పెద్దఎత్తున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసే ఏపీఎస్ఆర్టీసీ ఈసారి అరకొర బస్సులు ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక రైళ్లను భారీగా ప్రకటిస్తారని ఆశించినా అదీ జరగలేదు. పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టలేక ఇంటికి వెళ్లకుండా ఉండలేక సామాన్య ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.
సంబరాల సంక్రాంతి సమీపిస్తోంది. పండుగను సొంతూళ్లలో సరదాగా జరుపుకునేందుకు అంతా సిద్దమవుతున్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏపీ ప్రజలు సొంతూళ్లకు తరలివస్తారు. తెలంగాణలో ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈ రోజు నుంచే హైదరాబాద్ నుంచి ప్రజలు కుటుంబాలతో సహా సొంతూళ్లకు బయలుదేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ వెబ్ సైట్ వెతికినా ఏ టికెట్ బుకింగ్ కౌంటర్‌కు వెళ్లినా టికెట్లు లేవనే సమాధానం వస్తోంది. బస్సులు, రైళ్లలో వెళ్లేందుకు రిజర్వేషన్ కేంద్రాలకు వెళ్లగా ఎక్కడా ఒక్క సీటు కూడా దొరకడం లేదు. దీంతో పండుగకు సొంతూళ్లకు ఎలావెళ్లాలో తెలియక కష్టాలు పడుతున్నారు.
ప్రత్యేక రైళ్లు 3 మాత్రమే: సంక్రాంతి పండుగ ముందు తర్వాతి రోజుల్లో హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ రైళ్లలో 3 నెలల ముందే బెర్తులన్నీ నిండిపోయాయి. ప్రత్యేక రైళ్లపై ప్రయాణికులు ఆశలు పెట్టుకున్నారు. రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లు ముందుగానే ప్రకటిస్తుంది. ఈ సారి అరకొర రైళ్లు వేశారు. వాటిలోనూ అన్ని బెర్తులు, సీట్లన్నీ ఎప్పుడో నిండిపోయాయి. ఈ నెల 9న హైదరాబాద్ నుంచి విశాఖ మధ్య ఉన్న ప్రత్యేక రైళ్లు 3 మాత్రమే. ఈ నెల 10, 11, 12 తేదీల్లో రోజుకు 4 ప్రత్యేక రైళ్లు చొప్పున ఉండగా వీటిలో బెర్తులు ఎప్పుడో నిండిపోయాయి.
ఎక్కువ మంది ప్రయాణించే 13న ఉన్న 3 ప్రత్యేక రైళ్లలో టికెట్లు బుకింగ్ చేసుకునేందుకూ అవకాశం లేదు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురం, కడప, చిత్తూరు తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోనూ దాదాపు ఇదే పరిస్ధితి. ఒక్క సీటూ లేదు. పలు రైళ్లలో కనీసం టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కూడా లేకుండా రిగ్రెట్ వస్తోంది. దీంతో రైలు ఎలా ఎక్కాలో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రత్యేక బస్సులు కేవలం 240 మాత్రమే: రైళ్లలో సీటు దొరక్కపోయినా ఆర్టీసీ బస్సుల్లో సొంతూళ్లకు వెళదామనుకునే వారి ఆశలు ఈ సారి అడియాశలయ్యాయి. హైదరాబాద్ నుంచి పెద్దఎత్తున వచ్చే వారికి ఈసారి సరిపడ బస్సులు ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసిన బస్సులు ఏ పాటికీ సరిపోవడం లేదు. ప్రస్తుతం ఏ ఒక్క బస్సులోనూ ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు అత్యధిక రద్దీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు నడిచే బస్సులు అన్నింటిలోనూ టికెట్లు అయిపోయాయి. ఈ రూట్లో అన్ని రోజుల్లో కలిపి ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు కేవలం 240 మాత్రమే. సగటున రోజుకు 20 ప్రత్యేక బస్సులు మాత్రమే ఉండగా వేటిలోనూ సీట్లు లేవు. ఈ నెల 9, 10, 11, 12, 13న హైదరాబాద్ నుంచి విజయవాడకు నడిచే ఏ ఒక్క బస్సులోనూ ప్రస్తుతం సీట్లు ఖాళీగా లేవు. హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది.
రైళ్లు, బస్సులు నిండిపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్‌లో వెళ్ధామని ప్రయత్నిస్తే నిలువునా దోచేస్తున్నారు. విమానాలతో సమానంగా చార్జీలు వసూలు చేస్తూ జేబులు ఖాళీ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు గరిష్టంగా టికెట్ ఖరీదు రూ.5000 వరకు ఉందంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. ఉత్తరాంధ్ర, రాయలసీమ సహా కోస్తాంధ్ర జిల్లాలకు వెళ్లే అన్ని మార్గాల్లోనూ రెండింతలు, మూడింతలు చార్జీలు వసూలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రైళ్లు, బస్సులు లేక ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ భరించలేక కష్టాలు పడుతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సంక్రాంతి స్పెషల్ - ఇదో 'తారుమారు' సంత - బంధువులను చూసి 'జోరా' నమస్కారాలు
ప్రభుత్వ ఆధ్వర్యంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు - పండక్కొచ్చేయండంటున్న గోదావరి

