ETV Bharat / state

ప్రత్యేక యాప్​లతో గాలం వేస్తున్న సైబర్​ మోసగాళ్లు - ఆన్​లైన్ బెట్టింగ్​కు బలైపోతున్న యువత

ఆన్​లైన్​ బెట్టింగ్ వల్ల ప్రాణాలు బలి తీసుకుంటున్న యువకులు - ప్రత్యేక యాప్​ల బెట్టింగులతో యువతకు గాలం - రూ.లక్షల్లో డబ్బులు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు

Online Betting Scams in Telangana
Online Betting Scams in Telangana (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 5, 2026 at 1:47 PM IST

3 Min Read
Choose ETV Bharat

Online Betting Scams in Telangana : ఆన్​లైన్​ బెట్టింగ్​ యువత ప్రాణాలు తీస్తోంది. ప్రతి ఒక్కరు సులువుగా డబ్బు సంపాదించేందుకు ఆశపడతారు. అందులో భాగంగా కొందరు యువత ఆన్​లైన్​ పందేలకు ఆకర్షితులై రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాత అవమాన భారంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒకదాని వెంట ఒకటి బెట్టింగ్​, గేమింగ్​ ఇలా​ పేరు ఏదైనా ఆన్​లైన్​ ఆటలు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

ఇలా అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలి, రాత్రికి రాత్రే సంపన్నులు అవ్వాలనే అత్యాశ వల్ల చివరికి రూ.వేలు, రూ.లక్షలు నష్టపోతున్నారు. ఆ అప్పులు తీరే దారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి వరంగల్​ జిల్లాలో వెలుగులోకి వచ్చాయి.

  • కమలాపూర్‌ మండలం అంబాలకు చెందిన శ్రీకాంత్‌ పీజీ చదివాడు. ఫోన్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల కోసం రూ.13 లక్షల అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చలేక మనస్తాపంతో డిసెంబర్‌ 25న గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆయనను 108 వాహనంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
  • గత సంవత్సరం జనవరిలో వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన రాజ్‌కుమార్‌ అనే యువకుడు బెట్టింగ్‌ యాప్‌ల్లో రూ.30 లక్షలు పోగొట్టుకున్నాడు. పోయిన డబ్బు తిరిగి సంపాదించలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
  • ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఓ గృహిణి బెట్టింగ్‌ యాప్‌లో జూదం ఆడి, రూ.2 లక్షలు పోగొట్టుకుంది. కుటుంబ సభ్యులు మందలించడంతో ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స అందించడంతో ఆమె బతికింది.

ప్రత్యేక యాప్​ల ద్వారా మోసాలు : ప్రస్తుతం ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత జూదం, క్రికెట్​, రమ్మీ తదితర బెట్టింగ్​ మోసాలు పెరిగాయి. ఈ బెట్టింగ్​ కోసం మోసగాళ్లు ప్రత్యేక యాప్​లను రూపొందించి బెట్టింగులతో యువతకు గాలం వేస్తున్నారు. ఇలా ఆకర్షితులైన వారు బెట్టింగ్​ కోసం అప్పులు చేసి ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

బెట్టింగ్​లో భాగంగానే ఆన్​లైన్​ క్రికెట్​ బెట్టింగ్​ విషయానికొస్తే ఇక ఆంతే సంగతులు. ఈ ఆట 20 ఓవర్ల మ్యాచ్​ కావడంతో బంతి, బంతికి లేదా జట్ల గెలుపోటములపై పందెం కాస్తున్నారు. రూ.500 నుంచి రూ.10వేల వరకు బెట్టింగుల్లో పెడుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా గదులను అద్దెకు తీసుకొని బెట్టింగులు నిర్వహిస్తున్నారు. అలాగే ఇంటర్​నెట్​ సెంటర్లు, నగర శివార్లలో అడ్డాలు ఏర్పాటు చేసుకొని పందేలు నిర్వహిస్తున్నారు. క్రికెట్​ మ్యాచ్​లు చూసే యువకులను లక్ష్యంగా చేసుకొని ఈ దందా కొనసాగిస్తున్నారు. పందెం కాసిన వారికి మొదట రూ.వందల్లో ఎరగా వేసి ఆకర్షిస్తారు. ఆ తర్వాత రూ.వేలు, రూ.లక్షలు కాజేస్తారు.

''యువత బెట్టింగ్​ యాప్​లకు దూరంగా ఉండాలి. మొదట డబ్బులు గెలిచినట్లు భ్రమ కల్పిస్తారు. అలవాటు పడిన తర్వాత పదే పదే ఆడాలనిపిస్తుంది. దీంతో అప్పులు తెచ్చి మరీ బెట్టింగ్​ యాప్​లో పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడతారు.'' - సీపీఎస్​ ఏసీపీ సదయ్య

ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి :

  • క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, మంచి అలవాట్లు, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలి. కొన్నిసార్లు ఆలస్యం అయినప్పటికీ సత్ఫలితాలు సాధ్యమవుతాయని విశ్వసించాలి.
  • సులభంగా ఆదాయ వచ్చే మార్గం వైపు మొగ్గుచూపకుండా తమకు తామే నియంత్రించుకోవాలి.
  • బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా ప్రమాదకరంగా ఆన్​లైన్​ బెట్టింగ్​లకు అలవాటుపడటం గుర్తిస్తే పెద్దలకు సమాచారం అందించాలి. అవసరమైతే కౌన్సిలింగ్​ ఇప్పించాలి.
  • బెట్టింగ్​ విషయంలో ప్రోత్సహించినట్లు ఎవరైనా మాట్లాడినా, మొబైల్లో సంక్షిప్త సమాచారం, కాల్స్​ వచ్చినా పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి.

ఆన్​లైన్ బెట్టింగ్​ - కుటుంబాలు అల్లకల్లోలం

డాక్టరేట్​ పట్టా అందుకున్నాడు - కానీ ఆ ఒక్క వ్యసనంతో జీవితం తలకిందులైంది