ETV Bharat / state

రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం వచ్చినా ఏజెంట్లదే రాజ్యం! - రూల్స్​కు విరుద్ధంగా వసూళ్ల పర్వం

రిజిస్ట్రేషన్లలో దస్తావేజు లేఖరుల ప్రమేయం తగ్గించేలా ఓటీపీ విధానం - కొనుగోలు దారుడే ప్రక్రియ పూర్తి చేసుకునేలా తెచ్చిన ప్రభుత్వం - ప్రభుత్వ రుసుముల కంటే అదనంగా బాధుతున్న దస్తావేజు లేఖరు, ఏజెంట్లు

LAND REGISTRATION OTP SYSTEM ISSUES
LAND REGISTRATION OTP SYSTEM ISSUES (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 26, 2026 at 12:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

Telangana Land registration OTP system issues : రిజిస్ట్రేషన్‌ శాఖలో డాక్యుమెంట్‌ రైటర్ల ప్రమేయం తగ్గించి, కొనుగోలు దారుడే ప్రక్రియ పూర్తి చేసుకునేలా సర్కార్‌ వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ విధానం అమల్లోకి తెచ్చింది. కానీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కొత్త విధానంపై అవగాహన కల్పిస్తూ, సలహాలిచ్చేలా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అమలుకు నోచుకోవట్లేదు. దీంతో కొనుగోలుదారులకు వచ్చిన ఓటీపీని దస్తావేజు లేఖరులకు చెప్పి వారి ద్వారానే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

ఆచరణ లోపాలతో ప్రజలకు తప్పని తిప్పలు : రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు సర్కార్‌ ఓ అడుగు ముందుకేసింది. కానీ ఆచరణలో లోపాలతో వినియోగదారులకు తిప్పలు తప్పట్లేదు. ఓటీపీ విధానంతో కొనుగోలుదారులు నేరుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా ప్రభుత్వం సౌలభ్యం కల్పించింది. ఇదంతా బాగానే ఉన్నా, నల్గొండ జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఎక్కడా కనిపించట్లేదు. కాస్త చదువుకున్న వారైనా నేరుగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేస్తే పని పూర్తయ్యే పరిస్థితులు లేవు. సొంతంగా వెళ్తే ఫలానా దస్త్రాలు లేవు, అవి కావాలి, ఇవి కావాలి అంటూ అధికారులు కొర్రీలు పెట్టడం సాధారణమైంది. దస్తావేజు లేఖరులు, వారి ఏజెంట్లు, దళారులు అడిగిన కాసులు ముట్టచెబితేనే ఫైలు ముందుకు కదులుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో మధ్యవర్తులను ఆశ్రయించి స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తోంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా : రిజిస్ట్రేషన్‌ కోసం ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. ఇందులో కొనుగోలుదారు, అమ్మకందారు వివరాలు, భూమి వివరాలు పొందుపరచాలి. తర్వాత ఆ దస్తావేజులు సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద పరిశీలన, కంప్యూటరీకరణ, చెక్‌ లిస్టు ప్రక్రియకు వెళ్తాయి. మళ్లీ సబ్‌ రిజిస్ట్రార్‌ వద్దకు రాగానే ఆయన తన వేలిముద్ర ద్వారా లాగిన్‌ చేసి, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఫొటోలు దిగడం, వేలిముద్రలు వేయడం వంటి పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిపై సరిగ్గా అవగాహన కల్పించే వాళ్లు లేకపోవడంతో చాలా మంది ప్రైవేటుగా రైటర్ల వద్దకు వెళ్లి, అక్కడే డాక్యుమెంటేషన్‌ చేయిస్తున్నారు. వారు అన్నీ కలిపి ప్రభుత్వ రుసుముల కంటే అదనంగా బాదుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
అవగాహన కల్పిస్తే మేలు : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీపీ విధానంతో ఆన్‌లైన్‌లో దస్తావేజులను ఉపయోగించుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. చివరకు తమ దస్తావేజు సరిగా ఉండాలంటే ప్రైవేటు రైటర్ల వద్దకే వెళ్లాలని సబ్‌ రిజిస్ట్రార్‌ సిబ్బందే పంపిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కార్యాలయ వేళలు ముగిసిన తర్వాత డాక్యుమెంట్‌కు ఇంత అని పంపకాలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఓటీపీ విధానంపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

గతంలో సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో మధ్యలో ఉండే ఏజెంట్లు, రిజిస్ట్రార్​ మధ్య ఒప్పందం కుదిరి ఒక ఫైల్​కు ఇంత రుసుము చెల్లించాలని కస్టమర్​పై వేసే పరిస్థితి ఉండేది. పాత పద్ధతి స్థానంలో ఓటీపీ విధానం తీసుకొచ్చి, ఫైల్​ సబ్​మిట్ చేసి ఓటీపీ నంబర్ ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన పరిస్థతి. రూ.3-6 వేలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది"- సలీం, స్థానికుడు

దళారులను ఆశ్రయించొద్దు : రిజిస్ట్రేషన్‌ ఇతర సేవల కోసం లేఖరులు, ఏజెంట్లు, దళారులను సంప్రదించాల్సిన అవసరం లేదని నల్గొండ ఇంఛార్జ్ సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకట్‌ రెడ్డి తెలిపారు. కార్యాలయానికి వచ్చి సందేహాలు అడిగితే పూర్తి సమాచారం అందించేలా సిబ్బంది అందుబాటులో ఉన్నారని అంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఓటీపీ విధానం అవగాహన కల్పిస్తే అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలందుతాయని వినియోగదారులు కోరుతున్నారు.
సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్​ పూర్తయినా దాచేస్తున్న ఫైల్స్​ - ఏసీబీ సోదాల్లో విస్తుపోయే నిజాలు
భూభారతి స్కామ్ : తక్కువ చెల్లించినా ఎందుకు రిజెక్ట్ అవలేదు? - ఆ రూ.50 కోట్లు ఏమయ్యాయి?