అర్చకుడి అత్యాశ - పని చేస్తున్న ఆలయంలోనే దొంగతనం
భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం మాయం - అత్యాశతో దొంగతనానికి పాల్పడిన అర్చకుడు - లగ్జరీ కారు కొనేందుకు ప్లాన్ - దొంగతనం చేసిన మంగళసూత్రం మార్చేందుకు బంగారం షాపు నిర్వాహకుడితోనూ సంప్రదింపులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 3, 2026 at 1:26 PM IST
|Updated : September 3, 2026 at 2:32 PM IST
Pedakakani Temple Mangalsutra Theft : గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రంను మాయం చేసింది తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్న అర్చకుడు కొండవీటి రణధీర్ పనేనని గుర్తించారు. అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు.
లగ్జరీ కారు కొనేందుకు : ఆలయ అధికారుల ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజిని పరిశీలించారు. అనంతరం రణధీర్‌ను ప్రశ్నించగా తనకేమీ తెలియదని తెలిపారు. అయితే పోలీసులు రణధీర్ ఇంట్లోని పడక గదిలో సోదాలు చేశారు. మంచంపై పరుపు తీయగా రెండు బెడ్ల మధ్యలోని ఖాళీ స్థలంలో మంగళసూత్రాన్ని గుర్తించామన్నారు. ఇది ఎక్కడిదని అతని తల్లిని ప్రశ్నించగా తన కుమారుడు కొప్పురావూరు ఆలయం నుంచి తెచ్చాడని, నకిలీ బంగారమని చెప్పినట్టు తెలియజేశారు. చివరకు భ్రమరాంబ అమ్మవారిదేనని అంగీకరించారన్నారు. రణధీర్ మంగళసూత్రం దొంగిలించాక లగ్జరీ కారు కొనేందుకు షోరూం వ్యక్తితో మాట్లాడారని తెలిపారు. బంగారు దుకాణం నిర్వాహకుడితో కూడా ఫోన్‌లో మాట్లాడినట్టు వెల్లడించారు.
కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ : దర్యాప్తు చేస్తున్న సమయంలో అతని కుటుంబ సభ్యులు కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో అనుమానం బలపడిందన్నారు. కేసు దర్యాప్తులో నేర్పు ప్రదర్శించిన సీఐ నారాయణస్వామి, ఎస్సైలు రామకృష్ణ, సురేష్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు రవి, ఇర్ఫాన్, కోటేశ్వరరావుని డీఎస్పీ మురళీకృష్ణ అభినందించారు.
ఈ కేసులో దొంగతనం చేసిన కొండవీటి రణధీర్ ఆలయంలో తాత్కాలిక పద్ధతిలో అర్చకుడిగా పని చేస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేసి అతని నుంచి మధ్యవర్తుల సమక్షంలో బంగారం స్వాధీనం చేసుకున్నాం. ఇతనికి ఉన్న అత్యాశతో నగల్ని కాజేసి పోలీసులకి చిక్కాడు.- మురళికృష్ణ, గుంటూరు నార్త్ డీఎస్పీ
ఏం జరిగిందంటే : శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఆగస్టు 14న అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల దర్శనార్థం రెండు రోజులపాటు ఈ అలంకరణనే కొనసాగించారు. అమ్మవారి మంగళసూత్రం మాయమైనట్లు అర్చకులు 18న గుర్తించారు. ఈ మేరకు ఆలయ ఈవో గోగినేని లీలాకుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు.
ఆలయాలపై ప్రత్యేక దృష్టి : ఆలయ పవిత్రతకు భంగం కలిగించే వారిని ఏమాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఆలయాలపై ప్రత్యేక దృష్టి వహించి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో పని చేస్తోందని ఆయన తెలిపారు.
మూడు నెలలు గడిచినా బాలిక ఆచూకీ లేదు - గుంటూరు పోలీసుల వైఫల్యంపై హైకోర్టు ఆశ్చర్యం
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్టు - ఇంట్లో రూ.5 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు

