ETV Bharat / state

"ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం" - దశాబ్ధాల తర్వాత పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పూర్వవిద్యార్థులు

విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థుల గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు - అనాటి చిలిపిపనులను గుర్తు చేసుకుంటూ మురిసిపోయిన పూర్వ విద్యార్థులు - ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయడు

PB Siddhartha College Golden Jubilee Celebrations
PB Siddhartha College Golden Jubilee Celebrations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 21, 2026 at 8:00 PM IST

3 Min Read
Choose ETV Bharat

PB Siddhartha College Golden Jubilee Celebrations : విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల ప్రాంగణం పూర్వవిద్యార్థులతో పులకించింది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి చదువులమ్మ చెట్టు నీడలో ఒక్కటైన వీళ్లంతా బతుకు పోరాటంలో దూరమైపోయారు. దశాబ్ధాల తర్వాత కలుసుకున్నారు. వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరి బాగోగులు మరొకరితో పంచుకున్నారు. అనాటి చిలిపిపనులను గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు. ఇలాంటి మధుర జ్ఞాపకాలకు పీబీ సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థుల గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు వేదికగా నిలిచాయి. ఈ పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సంబరాలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పీబీ సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థుల గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు కళాశాల ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. దేశ విదేశాల్లో వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడ్డ వారంతా ఒకే చోట చేరారు. వయస్సుని మరచి వీరంతా ఎంతో ఉత్సాహంగా గడిపారు. చదువుకున్న రోజుల్లో చేసిన చిలిపిపనులను నెమరు వేసుకుంటూ చిరునవ్వులు చిందించారు. వారి కష్టసుఖాలను పాత స్నేహితులతో పంచుకున్నారు. పిల్లలు వారు చేస్తున్న ఉద్యోగాలు, వారి వివాహ విశేషాలు ఒకరికి ఒకరు అడిగి తెలుసుకున్నారు. వారి సూచనలు, సలహాలు పంచుకున్నారు.

"ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం" - దశాబ్ధాల తర్వాత పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పూర్వవిద్యార్థులు (ETV Bharat)

సీనియర్స్, జూనియర్స్ కలిసి ఒకే చోట : తమకి చదువు చెప్పిన అధ్యాపకులకు సన్మానించుకున్నారు. జూనియర్స్, సీనియర్స్ అంతా కలిసి ఒకే చోట కలుసుకోవడం పట్ల వారంతా ఆనందం వ్యక్తం చేశారు. తాము చదువుకున్న రోజుల్లో విద్యావ్యవస్థ, నేటి విద్యావ్యవస్థతో పోల్చుకుంటూ చర్చించుకున్నారు. చదువుకున్న రోజుల్లో వీరంతా విద్యార్థులే ఇప్పుడు మాత్రం వీరిలో వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగాలు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. తాము చదువుకునే సమయంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులంటే ఎంతో గౌరవం ఉండేదని ప్రస్తుతం అది కాస్త తగ్గినట్లు కనిపిస్తుందని చెప్పారు. తాము వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడ్డామని ప్రస్తుతం అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.

తమ కళాశాలకు 50ఏళ్లు పూర్తి కావడం సంతోషంగా ఉందని ఇక్కడికి వచ్చిన పీబీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులు తెలిపారు. తాము చదువుకున్న రోజుల్లో కళాశాల చాలా చిన్నగా ఉండేదని ఇప్పుడు చాలా విస్తరించడంతో పాటు ఏటా వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి : అనంతరం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయడు మాట్లాడుతూ, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. పరిశోధనలకు యువత ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. బూతులు మాట్లాడే వారిని ప్రోత్సహించకూడదని సమాజం నుంచి బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. అసత్య వార్తలు, తప్పుడు ప్రచారాలకు సోషల్ మీడియా వేదికగా మారిందన్న వెంకయ్యనాయుడు రాజకీయ నాయకులు రోత కల్గించేలా పోస్టులు పెడుతూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలను అదుపు చేసేలా ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించాలని అవసరమైతే చట్టాలు సవరించాలని వెంకయ్య సూచించారు. ఏఐని చూస్తే భయమేస్తుందన్న వెంకయ్యనాయుడు ఏఐని నైతిక పద్దతుల్లో ఉపయోగించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

"మన దేశం, మాతృభాష, గురువులను మరచిపోకూడదు. పరిశోధనలకు యువత ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు భాషా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి. భారత్ విశ్వగురువు అయినా వేరే దేశంపై దండయాత్రలు చేయలేదు. ఆత్మరక్షణ కోసమే భారత్ ముందడుగు వేస్తుంది. రాజకీయ నాయకులు బూతులు విపరీతంగా మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో బూతులు మాట్లాడిన వాళ్లంతా ఓడిపోయారు. బూతులు మాట్లాడే వారిని ప్రోత్సహించకూడదు, సమాజం నుంచి బహిష్కరించాలి. సీఎం చంద్రబాబు టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏఐని అదుపు చేసుకుని ముందుకెళ్లాలి. సోషల్ మీడియా తప్పుడు అంశాలకు వేదికైంది. మంచి సమాజ నిర్మాణానికి మనందరం కృషి చేయాలి." - వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి

ఐదుతరాల ఫ్యామిలీ ఆత్మీయ సమ్మేళనం

శాసించే స్థాయికి చేరుకున్నా ఏదో వెలితి! 50 ఏళ్ల స్నేహబంధంలో అందమైన రోజు ఇది