జిందాల్ 'వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్'ను సందర్శించిన పవన్ - పనితీరు, నిర్వహణపై ఆరా
జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను సందర్శించిన పవన్ - చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి తయారు చేస్తున్న జిందాల్ ప్లాంట్

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2026 at 7:25 PM IST
|Updated : May 30, 2026 at 8:51 PM IST
Pawan on Jindal Energy Plant : ఒక క్రమపద్ధతిలో చెత్తను సేకరిస్తే, దాని వినియోగం ద్వారా అద్భుతాలు చేయవచ్చని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌ను ఆయన సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించారు. చెత్తను ఎలా వేరు చేస్తారు? దాన్ని ప్లాంట్‌లో ఎలా శుద్ధి చేస్తారు? దేనికి ఉపయోగిస్తారనే విషయాలను ప్లాంట్ ప్రతినిధులు పవన్‌కు వివరించారు.
ముఖ్యంగా చెత్తను బాయిలర్లలో మండించడం ద్వారా విద్యుత్ తయారీ ఎలా జరుగుతుంది? చివరికి బూడిదను ఇటుకల తయారీకి ఎలా వినియోగించుకోవచ్చు? అనే విషయాలను ప్లాంట్ ప్రతినిధులు పవన్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఏపీకి చెత్త సేకరణ విషయంలో ఉన్న అవకాశాలను జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ఆపరేషన్స్ హెడ్ ఎంవీ చారి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వివరించారు.
రాష్ట్రంలో రోజువారీగా 7200 టన్నుల పొడి చెత్త ఉత్పత్తవుతుంది. కొండవీడు జిందాల్ ప్లాంట్ సామర్థ్యం రోజువారీ 1400 టన్నుల పొడి చెత్తను ప్రాసెస్ చేసి, సగటున 20 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. దాన్ని రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌తో అనుసంధానం చేసి, ఏపీ ఇంధన అవసరాలు తీరుస్తోంది. విశాఖలోనూ జిందాల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర రీజియన్ చెత్తను సేకరించి 15 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేస్తోంది. ఈ తరహా ప్లాంట్లను రాష్ట్రంలో మరో ఆరు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. కాకినాడలో ఇప్పటికే పనులు మొదలు కాగా, నెల్లూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో కూడా త్వరలో ఏర్పాటు చేసేందుకు సర్కార్ సుముఖంగా ఉన్నట్లు స్పష్టంచేశారు.
బయో మిథలైజేషన్ ప్లాంట్ల నుంచి బయో గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని ప్లాంట్ ప్రతినిధులు తెలిపారు. పూలు, పండ్లు, కూరగాయాలు, ఆహార వ్యర్థాలను క్రమపద్ధతిలో వేరు చేసి దాని ద్వారా కూడా గ్యాస్ ఉత్పత్తి చేయోచ్చని చెప్పారు. అయితే చెత్త సేకరణ దానిని వేరు చేయడంపై కసరత్తు జరగాలని ఉప ముఖ్యమంత్రి దృష్టికి ప్లాంట్ ప్రతినిధులు తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన పవన్ చెత్తను వేరు చేయడం, వివిధ మార్గాల్లో ఉపయోగించుకోవడం ప్రధానమన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన రావాలని అభిప్రాయపడ్డారు.
'గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించాలనే పట్టుదలతో కూటమి ప్రభుత్వం ఉంది. గోదావరిలో కలుస్తున్న వ్యర్థాలను పూర్తిస్థాయిలో అరికట్టాలని భావిస్తున్నాం. ముఖ్యంగా చెత్త నిర్వహణకు జిందాల్ అనుసరిస్తున్న విధానాన్ని అమలు చేస్తాం. గోదావరి పుష్కరాలకు సంబంధించి 268 పంచాయతీలు ప్రత్యక్షంగా భాగస్వామ్యమవుతాయి. ఈ పంచాయతీల్లో చెత్త నిర్వహణ అనేది చాలా కీలకం. నదిలోకి వ్యర్థాలను విడుదల చేయకుండా, దానిని అందంగా, కాలుష్య రహితంగా తీర్చిదిద్దడం మీద పంచాయతీల అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని' నిర్ణయించినట్టు పవన్ వివరించారు.
దేశంలో విభిన్నంగా చెత్త సేకరణ విధానం : సింగపూర్‌లో వినియోగించే విద్యుత్‌లో 2.8 శాతం చెత్త నుంచి ఉత్పత్తవుతుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. కానీ మన దేశంలో చెత్త సేకరణ విధానం విభిన్నంగా ఉంటుందని గుర్తు చేశారు. సింగపూర్ టాంజాంగ్ టెర్మినల్లో చెత్తను వేరు చేసే ప్రక్రియ చాలా పద్ధతిగా జరుగుతుందన్నారు. అలాంటిది విశాఖపట్నం పోర్టులో కూడా అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మన దేశంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరపాలక సంస్థ చెత్త సేకరణ విధానం ఆదర్శంగా ఉందని తెలిపారు. చెత్తను ప్రజల దగ్గర నుంచి సేకరించడంతో పాటు వినియోగం వరకు స్ఫూర్తిగా నిలుస్తోందని పవన్ అభిప్రాయపడ్డారు.
'ఇండోర్ వేస్ట్ మేనేజ్మెంట్ మోడల్ రాష్ట్రంలోని అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు ఆదర్శం కావాలి. ఏపీని డంపింగ్ యార్డు రహితంగా తీర్చిదిద్దాలంటే వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్స్ మరిన్ని అవసరం. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ప్లాంట్ ఉండటం ద్వారా ఆయా నగరపాలక, మున్సిపాలిటీల చెత్తతో పాటు చుట్టుపక్కలున్న గ్రామ పంచాయతీల ద్వారా కూడా చెత్తను సులభంగా సేకరించే అవకాశం ఉందని' పవన్ పేర్కొన్నారు.
ఒక మెగావాట్ విద్యుత్ తయారీకి అవసరమయ్యే ప్లాంట్ నిర్మాణానికి రూ.25 కోట్ల మేర ఖర్చువుతుందని పవన్ కల్యాణ్ వివరించారు. అలాగే ఒక మెగావాట్ కరెంట్ తయారీకి సగటున 2.5 టన్నుల చెత్తతో పాటు 4.5 టన్నుల స్టీమ్ అవసరం అవుతుందని తెలిపారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుతో స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే విద్యుత్ ఉత్పత్తితో పాటు వివిధ రకాలైన పంచాయతీల్లో చెత్త నిర్వహణకు సంబంధించి క్లస్టర్ల వారీగా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
గొడ్డలితో రాజకీయాలు చేస్తారా? - ఇలాంటివాళ్లు ప్రజాస్వామ్యానికి పనికిరారు: సీఎం చంద్రబాబు

