ఒకేసారి వస్తున్న రైళ్లు - ఔటర్ల వద్దే పడిగాపులతో ప్రయాణికులకు నరకం
ఏకకాలంలో రెండు, మూడు రైళ్లు వచ్చేలా రైల్వే షెడ్యూళ్లు - పరిమిత ప్లాట్‌ఫారమ్‌లు ఉండటంతో తప్పని ఇబ్బందులు - ఖాళీ లేక ఔటర్ సిగ్నళ్ల వద్దే రైళ్ల నిరీక్షణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 24, 2026 at 2:35 PM IST
Overlapping Train Schedules : రైల్వే అధికారుల సమన్వయ లోపం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. లోపభూయిష్టమైన రైల్వే షెడ్యూళ్లు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. ఏకకాలంలో రెండు, మూడు రైళ్లు గుంటూరు స్టేషన్‌కు వచ్చేలా టైమ్‌టేబుల్ రూపొందించారు. పరిమిత ప్లాట్‌ఫారమ్‌లు, ట్రాక్‌లు ఉన్న స్టేషన్లలో ఒకే సమయంలో రైళ్లు వస్తున్నాయి. లేదా కేవలం ఒకట్రెండు నిమిషాల వ్యవధిలో వేర్వేరు రైళ్లు వచ్చేలా షెడ్యూల్ చేశారు. దీనివల్ల ప్రయాణికులకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ముందు వచ్చిన రైలుకు ప్లాట్‌ఫారమ్ ఇస్తే, వెనుక వచ్చిన రైళ్లు ఔటర్ సిగ్నళ్ల వద్దనే నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
ఒక్క నిమిషం వ్యవధిలోనే రాకపోకలు : ప్రధాన స్టేషన్లలో రైళ్ల రాకపోకల షెడ్యూల్ అస్తవ్యస్తంగా మారింది. ఇతర ఓవర్ ల్యాపింగ్ రైళ్లతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఉదాహరణకు సికింద్రాబాద్-అనకాపల్లి ఎక్స్‌ప్రెస్ (17043) సోమవారం తెల్లవారుజామున 3.29 గంటలకు గుంటూరు స్టేషన్‌కు చేరుకోవాలి. సరిగ్గా ఒక్క నిమిషం వ్యవధిలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) 3.30 గంటలకు రావాలి. సికింద్రాబాద్-నహర్‌లాగూన్ (07046) మధ్యాహ్నం 1.20 గంటలకు గుంటూరు స్టేషన్ నుంచి నిష్క్రమించాల్సి ఉంది. సరిగ్గా అదే సమయానికి (మధ్యాహ్నం 1.20 గంటలకు) మార్కాపురం-తెనాలి మెము (67239) చేరుకోవాలి. ఇలాంటి షెడ్యూళ్ల వల్ల ఏ రైలుకు ఎక్కడ ప్లాట్‌ఫారమ్ ఇవ్వాలో తెలియక సిబ్బంది సైతం తలలు పట్టుకుంటున్నారు.
ఒకే సమయానికి క్రాసింగ్‌లు : కాకినాడ-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (17221) మధ్యాహ్నం 1.40 గంటలకు స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. కటిహార్-యశ్వంత్‌పూర్ (06752) రైలు సరిగ్గా 1.40 గంటలకే స్టేషన్‌లోకి రావాల్సి ఉంది. చర్లపల్లి-నాగర్‌కోయిల్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (16358-శనివారం), డోన్-గుంటూరు ప్యాసింజర్ (17227-రోజువారీ) రైళ్లు రెండూ సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు జంక్షన్‌కు చేరుకునేలా షెడ్యూల్ చేశారు. ఒకే సమయంలో రెండు రైళ్లు రావడం వల్ల ఒక రైలుకు ప్లాట్‌ఫారమ్ ఇస్తే, మరొక రైలును ఔటర్ సిగ్నల్ వద్ద నిలిపేయాల్సి వస్తోంది. దీంతో ఆయా రైళ్లలోని ప్రయాణికులు చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోంది.
ఒకేసారి మూడు రైళ్లు : రెండు రైళ్లు ఒకేసారి రావడమే కష్టం అనుకుంటే, ఏకంగా మూడు రైళ్లకు ఒకే సమయాన్ని కేటాయించారు. సిల్చార్-చర్లపల్లి (15646-శుక్రవారం), చర్లపల్లి-అగర్తల (17031-సోమవారం), నరసాపురం-హుబ్లి అమరావతి ఎక్స్‌ప్రెస్ (17225-రోజువారీ) రైళ్లు ఒకే సమయానికి నమోదు కావడం గమనార్హం. ఈ మూడు రైళ్లు ఉదయం 9.05 గంటలకు వచ్చి 9.10 గంటలకు బయల్దేరేలా సమయం ఇచ్చారు. రోజువారీ మెము రైళ్ల పరిస్థితీ ఇంతే. రేపల్లె-గుంటూరు (67234), నరసాపురం-గుంటూరు (67247) ప్యాసింజర్ రైళ్లు రాత్రి 7.55 గంటలకు ఒకేసారి గుంటూరు జంక్షన్ చేరుకునేలా షెడ్యూల్ వేశారు.
అర్ధరాత్రి కూడా ఆగని తిప్పలు : పగటి పూటే కాదు రాత్రి వేళల్లో కూడా ఈ ఓవర్ ల్యాపింగ్ సమస్య వేధిస్తోంది. చర్లపల్లి-తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్ (17077) బుధవారం రాత్రి 11.50 గంటలకు స్టేషన్‌కు వస్తుంది. 12 గంటలకు బయల్దేరుతుంది. సరిగ్గా అదే సమయంలో విశాఖపట్నం దురంతో (22204) రాత్రి 11.53 గంటలకు వచ్చి 11.55 గంటలకు వెళ్తుంది. ఈ రెండు రైళ్ల రాకపోకల మధ్య ఉన్న గ్యాప్ కేవలం నిమిషాలే. స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్‌లు ఖాళీ లేక ఔటర్ వద్ద రైళ్లను ఆపేస్తుండటంతో గమ్యస్థానాలకు చేరుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి, రైళ్ల షెడ్యూళ్లలో ఉన్న లోపాలను సరిదిద్దాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రోడ్డు మార్గంలో 40 నిమిషాలు - రైల్లో గంటన్నర ప్రయాణం
'రాయలసీమ, దక్షిణ కోస్తా' ప్రజలకు గుడ్ న్యూస్ - మరో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెగ్యులర్!

