'మా కుమార్తె 30 ఏళ్లుగా మానసిక వైకల్యంతో బాధపడుతుంది - పింఛను ఇప్పించండి సార్'
మానసిక వైకల్యంతో బాధపడుతోన్న యువతి - పసిబిడ్డ మాదిరి కుమారి ఆలనాపాలనా చూస్తున్న తల్లిదండ్రులు - ప్రభుత్వం స్పందించి పింఛను ఇవ్వాలని విజ్ఞప్తి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 18, 2026 at 4:32 PM IST
|Updated : February 18, 2026 at 9:01 PM IST
Parents Requesting Pension for Their Disabled Daughter: రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. అలాంటి పేద కుటుంబంలో జన్మించిన ఆ యువతి మానసిక వైకల్యంతో బాధపడుతోంది. వయసు 30 వచ్చినా ఇంకా పసి బిడ్డ మాదిరిగా తల్లిదండ్రులు సాకాల్సిన పరిస్థితి. కనీసం నిల్చోలేని స్థితిలో ఉన్న కుమార్తె పరిస్థితి తలుచుకుంటూ ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తమకు ఎటువంటి ఆసరా లేక దివ్యాంగురాలైన కుమార్తెకు మందుల ఖర్చు కూడా భరించలేని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి పింఛను ఇప్పించాలని ప్రభుత్వాన్ని ఆ తల్లీదండ్రులు కోరుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండలో మోగులూరి యేహాను, విజయలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి 30 ఏళ్ల క్రితం కవలలు జన్మించారు. వయసు పెరిగే కొద్దీ కుమారుడి ఆరోగ్య పరిస్థితి బాగా ఉండగా కుమార్తె మాత్రం మానసిక వైకల్యంతో బాధపడుతోంది. నేటికీ తమ కుమార్తెను చంటి బిడ్డలానే చూసుకోవాల్సిన పరిస్థితి. దీంతో గతంలో దివ్యాంగుల పింఛను వచ్చేది. అయితే 4 ఏళ్ల క్రితం కుమారుడికి సచివాలయం ఉద్యోగం వచ్చిందనే కారణంతో కుమార్తె పింఛను నిలిపివేశారని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా పట్టించుకోవట్లేదు: కుమారుడు పెళ్లి చేసుకుని వేరుగా ఉంటున్నాడని ఎటువంటి ఆసరా లేక దివ్యాంగురాలైన తమ కుమార్తెకు మందుల ఖర్చు కూడా భరించలేని స్థితిలో ఉన్నామని వారు వాపోయారు. సచివాలయంలో ఎన్నిసార్లు ధరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవట్లేదని వాపోయారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, అధికారులు స్పందించి పింఛను ఇప్పించాలని వారు కోరుతున్నారు. ఇటీవల కలెక్టరేట్‌కి వెళ్లి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు.
''మాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కానీ కుమార్తె మాత్రం మానసిక వైకల్యంతో బాధపడుతోంది. నేటికీ మా కుమార్తెను చంటి బిడ్డలానే చూసుకోవాల్సి వస్తుంది. గతంలో మాకు దివ్యాంగుల పింఛను వచ్చేది. కానీ 4 ఏళ్ల క్రితం మా కుమారుడికి సచివాలయం ఉద్యోగం వచ్చింది. ఈ కారణంతో మా కుమార్తె పింఛను నిలిపివేశారు. కుమారుడు పెళ్లి చేసుకుని వేరుగా ఉంటున్నాడని, ఎటువంటి ఆసరా లేక దివ్యాంగురాలైన మా కుమార్తెకు మందుల ఖర్చు కూడా భరించలేని స్థితిలో ఉన్నాం. సచివాలయంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవట్లేదు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, అధికారులు స్పందించి పింఛను ఇప్పించాలని కోరుతున్నాం.''- విజయలక్ష్మి, బాలిక తల్లి
'నాకో ఉద్యోగం ఇప్పించండి' - చక్రాల కుర్చీపై సచివాలయానికి సుజాత
'100 శాతం దివ్యాంగురాలు - 25 ఏళ్లుగా మంచానికే పరిమితం' - పింఛన్ ఇవ్వండి సార్!

