ETV Bharat / state

పల్లె పండగ 2.0 - రూ. 6,700 కోట్లతో అభివృద్ధి పనులు

గ్రామాల్లో 8వేల కిలోమీటర్ల రహదారులు - 25వేల మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్‌ డ్రెయిన్లు - రూ.1,005 కోట్లతో గిరిజన గ్రామాలకు రహదారులు - ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

Palle Panduga 2 to Transform AP Rural Landscape
Palle Panduga 2 to Transform AP Rural Landscape (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 2, 2026 at 9:53 AM IST

3 Min Read
Choose ETV Bharat

Palle Panduga 2 to Transform AP Rural Landscape: పల్లెపండగ 1.0 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో 4,300 కిలోమీటర్ల రహదారుల పనులు పూర్తి చేశామని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 22,500 మినీ గోకులాలు, 15 వేలకు పైగా నీటి తొట్టెలు, లక్షకు పైగా నీటి కుంటలు పనులు చేపట్టామని ఆయన వివరించారు.

పల్లెపండగ 2.0లో భాగంగా రూ.6,700 కోట్లతో 53,382 అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. 8,000 కిలోమీటర్ల మేర రోడ్లు, మరో 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్‌ డ్రెయిన్లు నిర్మించనున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

సాస్కీ పథకం ద్వారా కేంద్రం ప్రభుత్వం రూ.2,000 కోట్ల నిధులు సమకూర్చిందని గురువారం ఒక ప్రకటనలో ఆయన వివరించారు. ''పీఎం జన్‌మన్, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రూ.1,005 కోట్ల వ్యయంతో 635 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. అడవి తల్లి బాటతో కొండలపై ఉన్న గిరిజన గ్రామాలకు రోడ్లు వచ్చాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమం ద్వారా చిత్తూరు, పల్నాడు, ప్రకాశం, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో రూ.7,910 కోట్లతో 5 ప్రాజెక్టుల పనులు చేపట్టాం. 2027 నాటికి వీటిని పూర్తి చేయాలన్నది లక్ష్యం. వచ్చే 30 సంవత్సరాల్లో 1.20 కోట్ల మందికి దాహార్తి తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జలజీవన్‌ మిషన్‌కు పొట్టి శ్రీరాములు పేరిట అమరజీవి జలధారగా నామకరణం చేశాం’ అని డిప్యూటీ సీఎం తెలిపారు.

నంబర్​ వన్​ స్థానంలో: ‘7 జిల్లాల్లో ఉన్న 28 స్వచ్ఛరథాల సంఖ్యను మరింత పెంచనున్నాం. వీటిద్వారా ఇప్పటివరకు 2 లక్షల కిలోలకు పైగా పొడి వ్యర్థాలు సేకరించాం. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీలకు స్వయం ప్రతిపత్తితో పాటు 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాం. 77 డీడీవో కార్యాలయాలు ప్రారంభించాం. రికార్డు స్థాయిలో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇప్పించి దేశంలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచాం.

గ్రామీణాభివృద్ధి, పర్యాటక, అటవీ, దేవాదాయశాఖల సమన్వయంతో ఎకో, టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా టీటీడీ సహకారంతో రూ.35.19 కోట్లతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలకు ఈ నెల 3న శంకుస్థాపన చేయనున్నాం’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వివరించారు.

2047 నాటికి 50 శాతానికి గ్రీన్‌ కవర్‌: ‘చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగుల బెడదను అరికట్టేందుకు తీసుకొచ్చిన కుంకీ ఏనుగులకు రాష్ట్ర పరిస్థితులకు తగిన విధంగా శిక్షణ ఇప్పించడంతో పాటు ఏఐతో ఆధునిక సాంకేతిక వ్యవస్థను అటవీశాఖకు పరిచయం చేశాం. వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. తీర ప్రాంత సంరక్షణకు ‘గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ ఏపీ’కి శ్రీకారం చుట్టాం.

33 శాతంగా ఉన్న గ్రీన్‌ కవర్‌ని 2047 నాటికి 50 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిపోయిన ఎర్ర చందనాన్ని వెనక్కి తెస్తాం. మానవ, వన్యప్రాణి సంఘర్షణను నిలువరించడం, గాయపడిన అటవీ జంతువుల సంరక్షణ, చికిత్స లక్ష్యంగా హనుమాన్‌ ఫౌండేషన్‌ ప్రారంభించాం. అటవీ అమరవీరుల కుటుంబాల సంక్షేమనిధికి రూ.5కోట్లు ప్రభుత్వం జమ చేసింది. అటవీ సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం’ అని ఉప ముఖ్యమంత్రి వివరించారు.

శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై పవన్‌ కల్యాణ్‌ సమీక్ష - పల్లె పండగ 2.0కి ప్రణాళికలు

మాట నిలబెట్టుకున్న పవన్​ కళ్యాణ్​ -కోనసీమ కొబ్బరి రైతుల చిరకాల స్వప్నం సాకారం