శ్రీశైలంలో పాగాలంకరణ సేవ: శివరాత్రి నాడు ప్రత్యేక క్రతువు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాగాలంకరణ క్రతువు-పాగాలంకరణతో దర్శనమిచ్చే మల్లన్న ఆలయానికి నమస్కరించుకొని భక్తుల ఆధ్యాత్మిక తన్మయత్వం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 14, 2026 at 5:14 PM IST
Pagalankarana Seva In Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలం మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి ఆలయానికి చేసే పాగాలంకరణ ప్రత్యేకమైనది. మల్లన్న పాగాలంకరణను వీక్షించి జన్మ ధన్యం చేసుకోవాలని శివ భక్తులు పరితపిస్తారు.
ఆలయ విమాన గోపురం, ముఖ మండపాల నందులకు పాగాలంకరణ: శ్రీశైలం మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ విమాన గోపురం, ముఖ మండపాల నందులకు పాగాలంకరణ చేయడం అనాదిగా కొనసాగుతోంది. బాపట్ల జిల్లా హస్తినాపురం గ్రామానికి చెందిన చేనేతలు బ్రహ్మోత్సవాల్లో పాగాలంకరణ క్రతువు చేపట్టడం సంప్రదాయంగా వస్తోంది. కొన్నేళ్ల కిందటి వరకు హస్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు అనే వృద్ధుడు మల్లికార్జున స్వామి ఆలయానికి పాగాలంకరణ చేసేవారు. ఆయన శివైక్యం చెందిన తర్వాత ఆయన కుమారుడు పృథ్వీ సుబ్బారావు పాగాలంకరణ చేస్తున్నారు. కార్తీక మాసం నుంచి మొదలుపెట్టి మాఘమాసంలో వచ్చే మహా శివరాత్రి వరకు కొన్ని రోజుల ముందు నుంచే ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో చేనేత మగ్గాల ద్వారా నూలుతో కూడిన పాగా వస్త్రాన్ని పృథ్వీ సుబ్బారావు కుటుంబ సభ్యులు తయారుచేస్తారు. మూడు మూరల వెడల్పు, 300 మూరల పొడవుతో పాగా వస్త్రాన్ని సిద్ధం చేశారు. పాగ ఉండలను ఇప్పటికే శ్రీశైలానికి తీసుకు వచ్చారు. పృథ్వీ సుబ్బారావుతో పాటు మరికొందరు చేనేతలు సైతం పాగా వస్త్రాన్ని తయారుచేసి శ్రీశైలం దేవస్థానానికి అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది.
మేము ప్రతీ సంవత్సరం మహా శివరాత్రి పర్వదినం రోజున శ్రీశైలంలో కొలువైన స్వామివారి ఆలయానికి పాగాలంకరణ చేస్తాం. మా తండ్రి సుమారు 60 సంవత్సరాలు పాగాలంకరణ చేశారు. సుమారు మూడు సంవత్సరముల నుంచి మా పూర్వికులు పాగాలంకరణ చేస్తున్నారు. మా తండ్రి గత సంవత్సరం శివైక్యం చెందారు. భక్తి శ్రద్ధలతో నేను ఈ పాగాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. శివరాత్రి రోజు రాత్రి సమయంలో 10 నుంచి 12 గంటల వరకు మల్లన్న ఆలయానికి పాగాలంకరణ చేస్తాం. మూడు మూరల వెడల్పు, 300 మూరల పొడవుతో పాగా వస్త్రాన్ని సిద్ధం చేస్తాం. స్వామివారిని పెళ్లి కుమారుడిగా అలంకరించడమే ఈ పాగాలంకరణ కార్యక్రమం.-పృథ్వీ సుబ్బారావు. మల్లన్న ఆలయానికి పాగాలంకరణ చేసే చేనేత భక్తుడు
పాగాలంకరణ చూసేందుకు భక్తుల అమితాసక్తి: రేపు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మల్లికార్జున స్వామి ఆలయానికి చేసే పాగాలంకరణను చూసేందుకు భక్తులు అమితమైన ఆసక్తి చూపిస్తారు. రేపు రాత్రి 10 నుంచి 12 గంటల వరకు మల్లన్న ఆలయానికి పాగాలంకరణ జరుగుతుంది. ఆ సమయంలో ఆచార సాంప్రదాయాలను అనుసరించి ఆలయం లోపల విద్యుత్ దీపాలను ఆర్పి వేస్తారు. పృథ్వీ సుబ్బారావు దిగంబరుడై, మల్లికార్జున స్వామి బంగారు విమాన గోపురం పై భాగాన ఉన్న త్రిశూలం వద్ద నుంచి కింద వైపున ఉన్న నందుల వరకు పాగాలంకరణ చేయనున్నారు. అదే సమయంలో ఆలయంలో లోపల శ్రీ మల్లికార్జున స్వామికి దేవస్థానం అర్చకులు లింగోద్భవకాల మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. పాగాలంకరణ పూర్తయిన తర్వాత విద్యుత్ దీపాలను వెలిగిస్తారు. ఆ సమయంలో భక్తులు పాగాలంకరణతో దర్శనమిచ్చే మల్లన్న ఆలయానికి నమస్కరించుకొని ఆధ్యాత్మిక తన్మయత్వం చెందుతారు. ఆ తర్వాత నిత్య కళ్యాణ మండపంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి బ్రహ్మోత్సవ కళ్యాణం జరగనుంది.
శివుడు తలపాగా ధరించినట్లు: బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పాగాలంకరణను తిలకించడానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. మహా శివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో ఆలయంపై నవ నందులను కలుపుతూ తెల్లని వస్త్రాన్ని చుట్టడమే పాగాలంకరణ. ఈ అలంకరణతో శివుడు తలపాగా ధరించినట్లు భక్తులు భావిస్తారు. స్వామివారిని పెళ్లి కుమారుడిగా అలంకరించడంలో భాగంగానే ఈ క్రతువు చేపడతారు. పాగా తయారీకి ఏటా కార్తిక మాసంలో అంకురార్పణ చేసి, సంక్రాంతికి నేత పూర్తి చేస్తారు. సుమారు 3 నెలల పాటు అత్యంత నియమ నిష్ఠలతో సొంత మగ్గంపై 300 మూరలు నేస్తారు. నేతపని పూర్తయ్యే వరకు మాలధారణ భక్తులు పాటించే అన్ని నియమాలు పాటిస్తారు.
ప్రజల రాజధాని 'అమరావతి'ని నిర్మించాలనే నిబద్ధతతో ప్రభుత్వం పనిచేస్తోంది: ఆర్థికశాఖ మంత్రి
వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్న - ఎంత కేటాయించారంటే!

