ETV Bharat / state

YUVA : ముక్కు, కళ్ల సైగలతో పని చేసే వీల్‌ఛైర్ - పక్షవాతం ఉన్నవారికి వరం

ముక్కు కదలికలతో నడిచే స్మార్ట్ వీల్‌ఛైర్‌ - పక్షవాతం, తీవ్ర వైకల్యం ఉన్నవారికి వరం - ఏఐ, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ వినియోగం - ప్రాజెక్టుకు జాతీయ ప్రదర్శనల్లో ప్రథమ స్థానం

Innovative Smart Wheelchair by OU Students
Innovative Smart Wheelchair by OU Students (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : May 27, 2026 at 3:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

Innovative Smart Wheelchair by OU Students : టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషుల కష్టాలు తీరుతున్నాయి. కానీ పక్షవాతం వచ్చిన వారు, తీవ్రమైన వైకల్యంతో బాధపడేవారు తమ పనులు తాము చేసుకోవడం చాలా కష్టం. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అద్భుతమైన ఆవిష్కరణ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ముక్కు కదలికలతో, కళ్ల సైగలతో నడిచే ఒక స్మార్ట్ వీల్‌ఛైర్‌ను తయారు చేశారు. ఇది కేవలం కదలడమే కాదు ఇంట్లోని ఫ్యాన్లు, లైట్లు ఆన్ చేయడం, ఫోన్ కాల్స్ మాట్లాడడం దీని ప్రత్యేకత. ఈ వినూత్న ఆవిష్కరణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం పదండి.

పక్షవాత రోగులకు ఉపయోగపడేలా : చూడడానికి మిగతా వీల్‌ఛైర్ల లాగే సాధారణంగానే కనిపిస్తుంది. కానీ దీని సేవలు మాత్రం ఎంతో వినూత్నమైనవి. దీనిపై కూర్చున్న దివ్యాంగులు లేదా పక్షవాత రోగులు తమ ముక్కు కదలికల ద్వారానే ఇంట్లోని ఫ్యాన్లు, లైట్లు, టీవీలను సులభంగా ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. అంతేకాదు చేతిలో మొబైల్ ఫోన్ లేకపోయినా అవసరమైన వారికి ఫోన్ కాల్స్ చేసేలా దీని సాంకేతికతను రూపొందించారు యువ ఇంజినీర్లు.

ఈ స్మార్ట్ వీల్‌ఛైర్‌ను రూపొందించింది ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన బయోమెడికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు హారిక, జయదీప్. ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ అనగానే ఏదో ఒక సాధారణ టాపిక్ తీసుకోకుండా సమాజానికి ముఖ్యంగా పక్షవాత రోగులకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలన్న వీరి ఆలోచనకు అధ్యాపకుల ప్రోత్సాహం తోడైంది. దాంతో అతి తక్కువ కాలంలోనే ఈ స్మార్ట్ వీల్‌ఛైర్‌ను వారు ప్రాజెక్ట్‌గా సిద్ధం చేశారు.

ఎలా పని చేస్తోందంటే? : అసలు ఈ వీల్‌ఛైర్ ముక్కు, కళ్ల సైగలతో ఎలా పనిచేస్తుందంటే దీని ముందు భాగంలో ఒక స్క్రీన్‌తో పాటు చిన్న కెమెరాను అమర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఆధారంగా స్క్రీన్‌పై ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, అలాగే ఫ్యాన్, లైట్ ఆన్/ఆఫ్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. చైర్‌లో కూర్చున్న వ్యక్తి తన ముక్కు కదలికల ద్వారా ఆయా బాక్సులపై 3 సెకన్ల పాటు దృష్టి కేంద్రీకరిస్తే వీల్‌ఛైర్ దానికి అనుగుణంగా కదులుతుంది. అలాగే మూగవారు తమ అవసరాలను ఇంట్లోని వారికి తెలియజేసేందుకు వీలుగా ఇందులో ఒక ప్రత్యేక సౌండ్ బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.

ఎన్నో ప్రశంసలు, పథకాలు సొంతం : ఈ స్మార్ట్ వీల్‌ఛైర్ కోసం విద్యార్థులు సొంతంగా ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ల్యాప్‌టాప్‌ను కంట్రోల్ చేసే విధానాన్ని మొదట కనుగొన్నారు. ఆ తర్వాత ఆ సిగ్నల్స్‌ను వీల్‌ఛైర్‌కు అనుసంధానించారు. ఈ వినూత్న ప్రయోగం పలు జాతీయ, ప్రాంతీయ ప్రదర్శనల్లో ప్రథమ స్థానాల్లో నిలిచి ఎన్నో ప్రశంసలు, పథకాలను సొంతం చేసుకుంది.

త్వరలోనే మార్కెట్లోకి : విద్యార్థులు సాధించిన ఈ విజయం పట్ల ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌తో పాటు బయోమెడికల్ విభాగం అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు వచ్చి ఈ ప్రాజెక్ట్‌కు పెట్టుబడులు పెడితే త్వరలోనే దీన్ని మార్కెట్లోకి తీసుకురావచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూశారుగా విద్యార్థి దశలోనే సమాజం పట్ల బాధ్యతతో, పక్షవాత రోగులకు భరోసానిచ్చేలా ఓయూ విద్యార్థులు చేసిన ఈ ఆవిష్కరణ నిజంగా ఇది అభినందనీయమే.

"శరీరం పూర్తిగా సహకరించని సమయంలో వారికి 24 గంటలు సహాయం చేయాల్సి ఉంటుంది. సహాయకులకు కూడా విశ్రాంతి అవసరం. వాళ్లు ప్రతి క్షణం చూసుకోవడం కష్టమవుతుంది. విద్యార్థులు కనిపెట్టిన స్మార్ట్ వీల్‌ఛైర్‌ శరీరం సహకరించని వారికి ఎంతో ఉపయోగపడుతోంది" - ప్రొ. సుమన్, హెచ్‌ఓడీ, బయో మెడికల్ ఇంజినీరింగ్

YUVA : వినూత్న ఆవిష్కరణ చేసిన పల్లెటూరి యువకుడు - కోట్లాది మంది రైతులకు ఉపయోగపడే యంత్రం తయారీ

YUVA : ఐఐటీహెచ్‌ విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలు - ఫ్లెక్సిబుల్ సోలార్ ప్యానెల్స్​తో ఇంటి గోడ నుంచే విద్యుత్​