ETV Bharat / state

మ్యూల్​ ఖాతాల గుర్తింపునకు 'ఆపరేషన్​ క్రాక్​డౌన్'​

సైబర్ నేరాలకు కీలకమైన మ్యూల్​ ఖాతాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి - రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో సైబర్ నేరాల లావాదేవీల గుర్తింపు - సుల్తాన్​బజార్​ బ్యాంకు నుంచి అత్యధికంగా మ్యూల్ ఖాతాలు

POLICE ACTIONS ON MULE ACCOUNTS
POLICE ACTIONS ON MULE ACCOUNTS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 26, 2026 at 5:04 PM IST

3 Min Read
Choose ETV Bharat

Operation Crackdown For Cyber Crime : రోజురోజుకీ పెరుగుతున్న సైబర్​ దోపిడీలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ సైబర్​ క్రైం పోలీసులు​ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా డిజిటల్​ మోసాలకు కళ్లెం వేసేలా కీలక ఆపరేషన్​ను నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలకు పాల్పడే కేటుగాళ్లకు వెన్నెముకలా వ్యవహరించే మ్యూల్​ ఖాతాదారులను కట్టడి చేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్​బీ) ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సైబర్​ నేరాల నెట్​వర్క్​ను ఛేదించడమే లక్ష్యంగా 'ఆపరేషన్​ క్రాక్​డౌన్​' పేరిట ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది.

వేల ఖాతాలకు సైబర్​ నేరాలతో ప్రమేయం : మ్యూల్​ ఖాతాల గుర్తింపునకు చేపట్టిన ఈ కీలక ఆపరేషన్​ను టీజీసీఎస్​బీ రాష్ట్రంలోని 16 పోలీస్​ యూనిట్ల పరిధిలో ఏకకాలంలో నిర్వహించింది. ఇందుకుగానూ 512 మంది పోలీసులతో కూడిన 137 ప్రత్యేక బృందాలు ఆయా ప్రాంతాల్లోని బ్యాంకులకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమికంగా మొత్తం 1,888 అనుమానిత మ్యూల్ ఖాతాల కేవైసీలను పరిశీలించారు. అయితే, ఇందులో దేశవ్యాప్తంగా 9,431 ఖాతాలు సైబర్​ క్రైమ్​కు సంబంధించిన లావాదేవీలతో ప్రమేయం ఉండగా, తెలంగాణలో 782 అకౌంట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ప్రాంతంలో రికార్డు స్థాయిలో : కొన్ని మ్యూల్ ఖాతాల లావాదేవీలు వందల సంఖ్యలో డిజిటల్ మోసాల ఫిర్యాదులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విశేషంగా హైదరాబాద్​లోని సుల్తాన్​ బజార్​ ప్రాంతంలో ఉన్న ఓ బ్యాంకుకు చెందిన ఖాతా ఏకంగా 496 సైబర్​ నేరాలతో ముడిపడినట్లు తేలింది. దీని తర్వాత సూర్యాపేట జిల్లాలోని నాలుగు బ్యాంకుల్లో 298 అకౌంట్లు సైబర్​ నేరాల్లో పాలుపంచుకున్నాయని తనిఖీల్లో వెల్లడైంది. కాగా, ఓ ప్రకటనలో డీజీపీ శివధర్​ రెడ్డి ఈ కార్యాచరణను చేపట్టిన టీజీసీఎస్​బీ డైరెక్టర్​ శిఖాగోయల్​కు చెందిన బృందాన్ని అభినందించారు.

అసలేంటీ మ్యూల్ ఖాతాలు? : మనం తరచుగా అప్పుడప్పుడు వార్తల్లో ఈ మ్యూల్​ ఖాతాల గురించి వినే ఉంటాం. కానీ, అందరికీ వీటిపైన సరైన అవగాహన ఉండదు. ఈ కారణంగా కొందరు సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో పడే అవకాశమూ ఉంది. అయితే, డిజిటల్ మోసాల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బును సైబర్​ నేరుగాళ్లు నేరుగా తమ సొంత ఖాతాలో జమ చేసుకోరు. వారు కొల్లగొట్టిన నగదును ముందుగా ఓ అకౌంట్​ ద్వారా తమ ఖాతాలోకి తరలించడానికి ఉపయోగిస్తారు. ఇలా ఒకరి పేరుతో ఉన్న అకౌంట్​ను ఇంకొకరు ఫ్రాడ్​ చేసేందుకు వినియోగించే వాటినే 'మ్యూల్​ ఖాతాలు' అంటారు.

ఎందుకంటే : తాము కాజేసిన అమౌంట్​ను సైబర్​ నేరస్థులు ఇలా వేరొక అకౌంట్​లో జమ చేయడం వెనుక ప్రధాన కారణం ఉంది. సైబర్​ నేరగాళ్లు ఒకవేళ పోలీసులకు దొరికిపోయినా వివరాలు తెలియకుండా తమ అసలు ఖాతాను దాచిపెట్టి, ఇతరుల ఖాతాలు పట్టుబడేలా జాగ్రత్తపడతారు. దీని కోసం నిరుద్యోగులు, విద్యార్థులు, సామాన్యులకు కమీషన్​ ఆశ చూపించి వారి అకౌంట్​లను వాడుకుంటారు. అయితే ఇలా మ్యూల్​ ఖాతాలుగా పట్టుబడిన ఖాతాదారులను పోలీసులు నిందితుడిగా భావించి చర్యలు తీసుకునే అవకాశమూ ఉంటుంది.

ఇలా జరిగితే వెంటనే సమాచారమివ్వాలి : మన అకౌంట్​లో డబ్బులు ఖాళీ అయినప్పుడే కాదు, గుర్తు తెలియని ఖాతా నుంచి నగదు జమ అయినా ఉపేక్షించవద్దు. ఎందుకంటే సైబర్ నేరాల దర్యాప్తులో పోలీసులు ముందుగా డబ్బు జమైన ఖాతాదారుడినే నిందితుడిగా పరిగణిస్తారు. దీంతో లావాదేవీలతో సంబంధం లేకుండా చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కోవాల్సిందే. అందుకే తెలిసిన వారే కదా అని మన అకౌంట్​ వివరాలిచ్చినా ఇలా మ్యూల్​ ఖాతాలుగా ఉపయోగించే అవకాశముంది. ఇలాంటి సందర్భంలో ఆయా బ్యాంకు, అవసరం మేరకు పోలీసులనూ సంప్రదించాలి. లేదంటే సైబర్​ నేరంలో పాత్ర ఉందని భావించి ఖాతాను ఫ్రీజ్​ చేస్తారు. ఇలాంటి అకౌంట్​ నుంచి మన సొంత సొమ్మునూ విత్​డ్రా చేసుకునేందుకు అవకాశముండదు.

బ్యాంకు మేనేజర్​నే బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు! - రూ.1.44 కోట్లు స్వాహా

సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్ - 16 రాష్ట్రాల్లో 104 మంది అరెస్టు