ఎద్దులు, గుర్రాల పోటీలు - ప్రత్యేక ఆకర్షణగా 'డాకు మహారాజ్' అశ్వం
కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఐదు రోజుల ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన - పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీ లావు, తూర్పుగోదావరి జిల్లాలో సందడిగా గుర్రాలు, ఎద్దుల పరుగు పోటీలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 29, 2025 at 12:11 PM IST
|Updated : December 29, 2025 at 12:17 PM IST
Ongole Bull Strength Competitions in Palnadu District: సంక్రాంతి పండగంటేనే కోడి పందేలు, ఎడ్లబళ్ల పరుగు పోటీలు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పోటీల్లేకుండా పండగ జరుపుకోవడం ఉండదు. సంక్రాంతి మొదలు ఉగాది వరకు తీర్థాలు జరుగుతూనే ఉంటాయి. వీటిల్లోనూ ఎడ్లబళ్ల పరుగు పోటీలు ఉండాల్సిందే. విజేతగా నిలిచిన ఎడ్లకు రూ.పది వేల నుంచి రూ.లక్షకు పైగా నగదు బహుమతులను అందజేస్తారు. పల్నాడు జిల్లాలో ఐదు రోజుల ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన ఉత్కంఠతతో సాగుతున్నాయి.
పల్నాడు జిల్లా నరసరావుపేట కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఐదు రోజుల ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో 4వ రోజు జరిగిన పోటీల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. దేశీయంగానే కాక విదేశాల్లోనూ ప్రత్యేక గుర్తింపు కల్గిన ఒంగోలు జాతి ఎడ్లను కాపాడుకోవటానికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
"దేశీయంగానే కాక విదేశాల్లోనూ ప్రత్యేక గుర్తింపు కల్గిన ఒంగోలు జాతి ఎడ్లను కాపాడుకోవటానికి కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలా కృషి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా ఒంగోలు జాతి గిత్తల, అభివృద్ధికి సహకారాన్ని అందిస్తుంది. భవిష్యత్తులో సైతం ఈ జాతి మనుగడను రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది". -లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ
Horse And Bull Competetions in East Godavari District: తూర్పుగోదావరి జిల్లా రంగంపేట-వడిశలేరు మధ్య గన్నివారితోట పరిసరాల్లో ఆదివారం గుర్రాలు, ఎద్దుల పరుగు పోటీలతో సందడి నెలకొంది. తన తండ్రి సత్యనారాయణమూర్తి జ్ఞాపకార్థం జీఎస్‌ఎల్ ఆసుపత్రి ఛైర్మన్ గన్ని భాస్కరరావు ఏటా నిర్వహిస్తున్న ఈ పోటీలను మంత్రి కందుల దుర్గేశ్ ప్రారంభించారు. ఏపీవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 100 ఎడ్ల జతలు, 35 గుర్రాలు పాల్గొన్నాయి. దాదాపు మూడు కిలోమీటర్ల దూరం లక్ష్యాన్ని తక్కువ సమయంలోనే అధిగమించిన దాన్ని విజేతగా ప్రకటించారు.

ప్రత్యేక ఆకర్షణగా డాకు మహారాజ్ గుర్రం: ఏపీవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 100 ఎడ్ల జతలు, 35 గుర్రాలు పాల్గొన్నాయి. మూడు కిలోమీటర్ల దూరం లక్ష్యాన్ని తక్కువ సమయంలో అధిగమించినదాన్ని విజేతగా ప్రకటించారు. ఈ పోటీలలో డాకు మహారాజ్ సినిమాలో హీరో బాలకృష్ణ ఉపయోగించిన గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుర్రాల పరుగు పోటీలో అనకాపల్లి జిల్లా చేనుల అగ్రహారానికి చెందిన కె.మణికంఠ గుర్రం ప్రథమస్థానం దక్కించుకుంది. ఎద్దుల పరుగు పోటీ జూనియర్స్ విభాగంలో అనకాపల్లి జిల్లా చౌడవాడకు చెందిన గెడ్డం అప్పారావు ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి.

సీనియర్స్ విభాగంలో కాకినాడ జిల్లా జి.మేడపాడుకు చెందిన మలిరెడ్డి అన్నపూర్ణకు చెందిన ఎద్దులు విజేతగా నిలిచాయి. విజేతలకు ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్సీ సోమువీర్రాజు తదితరులు ద్విచక్ర వాహనాలను బహుమతులుగా అందజేశారు.

మార్కెట్‌లో ఒంగోలు గిత్త రూ.41 కోట్లు: కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ మార్కెట్‌లో ఒంగోలు గిత్త రూ.41 కోట్లు పలకింది. కాగా దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రపంచ వేదికపై ఒంగోలు గిత్త తన సత్తాను చాటిందని అన్నారు. ఒంగోలు గిత్తలు బలం, ఓర్పునకు ప్రసిద్ధి అని కొనియాడారు. ఏపీ ప్రభుత్వం ఒంగోలు గిత్తల జాతిని పరిరక్షిస్తూ పాడి రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తోందని చంద్రబాబు తెలిపారు. బ్రెజిల్‌లో ఇటీవల నిర్వహించిన వేలంలో ఒంగోలు జాతి గిత్త (వియాటినా-19) ఏకంగా రూ.41 కోట్ల ధర పలకడం గమనార్హం.
ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన- సంక్రాంతి సంబరాల్లో హుషారు
అంతరించిపోయే దశకు ఒంగోలు గిత్తలు - దశాబ్దాలుగా పోషిస్తున్న ఓ కుటుంబం

