ETV Bharat / state

"రికార్డులు సిద్ధం చేయండి" - టీటీడీ కల్తీ నెయ్యిపై రంగంలోకి ఏకసభ్య కమిషన్‌

టీటీడీ అధికారులతో ఏకసభ్య కమిషన్‌ భేటీ - నెయ్యి టెండర్లు, నిబంధనల సడలింపు, నాణ్యత పరీక్షల్లో వైఫల్యాలపై ఆరా - కీలక దస్త్రాలు సిద్ధం చేయాలని ఛైర్మన్‌ దినేష్‌కుమార్‌ ఆదేశం

Commission Begins Investigation of TTD Adulterated Ghee Issue
Commission Begins Investigation of TTD Adulterated Ghee Issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 4, 2026 at 7:18 AM IST

3 Min Read
Choose ETV Bharat

Commission Begins Investigation of TTD Adulterated Ghee Issue : శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ దర్యాప్తును ప్రారంభించింది. కమిషన్‌ ఛైర్మన్, విశ్రాంత IPS అధికారి దినేష్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథిగృహానికి చేరుకుని క్షేత్రస్థాయి విచారణలో నిమగ్నమైంది.

ఏకసభ్య కమిషన్‌ ఛైర్మన్, విశ్రాంత IPS అధికారి దినేష్‌కుమార్‌ టీటీడీలోని సుమారు పదిమంది విభాగాధిపతులతో మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి దాదాపు నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు. వైఎస్సార్సీపీ హయాంలో నెయ్యి టెండర్ల ఖరారు, నిబంధనల సడలింపు, నాణ్యత పరీక్షల్లో వైఫల్యాలకు సంబంధించిన అంశాలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ముందస్తుగా సిద్ధం చేసిన సమగ్ర నోట్‌ను అధికారులకు అందజేస్తూ అందులోని ప్రతి అంశంపై పూర్తిస్థాయి వివరాలు, దస్త్రాలు సమర్పించాలని ఆదేశించారు. విచారణకు సంబంధించిన అంశాలను అత్యంత గోప్యంగా ఉంచాలని స్పష్టం చేశారు.

"రికార్డులు సిద్ధం చేయండి" - టీటీడీ కల్తీ నెయ్యిపై రంగంలోకి ఏకసభ్య కమిషన్‌ (ETV)

45 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక : విచారణ సజావుగా సాగేందుకు వీలుగా పద్మావతి అతిథి గృహంలోని ఎక్స్‌టెన్షన్‌ భవనం మొదటి అంతస్తును కమిషన్‌ కార్యాలయంగా ఖరారు చేశారు. ఇందులో ఛైర్మన్‌ కోసం ప్రత్యేక గది, సిబ్బంది, కంప్యూటర్‌ సెక్షన్, విచారణకు వచ్చేవారు వేచి ఉండేందుకు వీలుగా మొత్తం నాలుగు గదులు కేటాయించారు. సాయంత్రం విజయవాడకు వెళ్లిన దినేష్‌ కుమార్‌ మూడు నాలుగు రోజుల్లో తిరిగి తిరుపతికి చేరుకోనున్నారు. ఈలోగా తాను కోరిన సమాచారం, రికార్డులు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కల్తీ నెయ్యి అంశంలో జరిగిన అవకతవకలను నిగ్గుతేల్చి బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తూ 45 రోజుల్లోగా ఈ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

నెయ్యి కల్తీకి బాధ్యులైన వారిపై చర్యలు : వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీకి బాధ్యులైన వారిపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. కల్తీ నెయ్యిపై దర్యాప్తు చేసి సిట్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక మేరకు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు విశ్రాంత ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో కొద్దిరోజుల కిందట ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది.

పరిపాలనా లోపాలు, వైఫల్యాలపై అంచనా : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేసిన సిట్‌ ఇప్పటికే ఛార్జిషీట్ వేసింది. తప్పు చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కమిషన్‌ను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ పంపిన దర్యాప్తు నివేదికను ఏక సభ్య కమిటీ పరిశీలించనుంది. లోపాలు, వైఫల్యాలు, తప్పులకు కారకులైన కమిటీ సభ్యులు, సీనియర్ అధికారులపై తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. టెండర్ నిబంధనల సడలింపు, అమలులో పరిపాలనా లోపాలు, వైఫల్యాలను అంచనా వేయాలని కమిటీకి ప్రభుత్వం స్పష్టం చేసింది.

కోర్టు చర్యలకు ఏ భంగం కలగదు : గత ప్రభుత్వంలో తప్పు చేసిన టీటీడీ అధికారులు, కమిటీ సభ్యుల ప్రమేయాన్ని గుర్తించాలని తప్పు చేసిన వారిపై తగిన పరిపాలనా లేదా క్రమశిక్షణా చర్యను సిఫార్సు చేయాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. రికార్డులు, రాతపూర్వక వివరణలను కమిటీ కోరవచ్చని తెలిపింది. ప్రభుత్వ ముందస్తు అనుమతితో నిపుణుల సహాయం పొందవచ్చని స్పష్టం చేసింది. 45 రోజుల్లోపు కమిటీ తన నివేదికను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. టీటీడీ అవసరమైన సహాయం అందిస్తుందని ఆదేశాల్లో తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల వల్ల కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న ఏ చర్యలకు భంగం కలగదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

భక్తులకు తప్పనున్న ఇబ్బందులు - శ్రీవారికి నాణేలకు బదులుగా ముడుపు పత్రాలు

టీటీడీ బోర్డు ధర్మకర్తల మండలి సమావేశం - రూ.5,456.26 కోట్ల వార్షిక బడ్జెట్‌కు ఆమోదం