ETV Bharat / state

ట్రాఫిక్​ చలానాలు ఉంటే పిల్లనివ్వను: కాకినాడలో ఓ తండ్రి వినూత్న ఆలోచన

కాబోయే అల్లుడి చలానాలు చెక్ చేసిన మామ - కాకినాడలో వినూత్న ఘటన - మద్యం తాగి బండి నడుపుతాడా? సీఐ దగ్గర కాబోయే అల్లుడి రిపోర్ట్ తీసుకున్న వ్యక్తి

One Man Enquired About Traffic Challans Against His Son in Law
One Man Enquired About Traffic Challans Against His Son in Law (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2026 at 9:42 AM IST

2 Min Read
Choose ETV Bharat

One Man Enquired About Traffic Challans Against His Son in Law: ఒకప్పుడు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసేవారు. కానీ కాకినాడలోని రాయుడుపాలేనికి చెందిన ఓ పెద్దాయన మాత్రం కాలానికి తగ్గట్టు వినూత్నంగా ఆలోచించారు. తనకు కాబోయే అల్లుడు ఎలాంటివాడో తెలుసుకునేందుకు నేరుగా ట్రాఫిక్ పోలీసులనే ఆశ్రయించారు. అదేెంటి కూతురికి పెళ్లి సంబంధం చూస్తూ ట్రాఫిక్​ పోలీస్​ దగ్గర కాబోయే అల్లుడు గురించి ఆరా తియ్యడానికేముంటుంది అనుకుంటున్నారా? అదేంటనేది ఈ కథనం పూర్తిగా చదివి తెలుసుకోవాల్సిందే.

సీఐ వద్దకు వాహన నంబర్లతో మామ: రెండు రోజుల కిందట కాకినాడ భానుగుడి వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్-2 సీఐ డి.రామారావు వద్దకు ఆ పెద్దాయన వెళ్లారు. కాబోయే అల్లుడికి చెందిన ఓ కారు, ఓ ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ నంబర్లను సీఐకి ఇచ్చారు. ‘ఈ వాహనాలపై ఏమైనా చలానాలు ఉంటే తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయను’ అని చెప్పి వాటి వివరాలు కోరాడు. ఆ మాటలు విని సీఐ రామారావు ఆశ్చర్యపోయారు.

‘ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే క్రమశిక్షణ’: ఎందుకిలా ఆరా తీస్తున్నారని సీఐ ప్రశ్నించగా ఆ పెద్దాయన తన బాధను వివరించారు. ‘భార్య చనిపోయింది. ఒక్కగానొక్క కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు అన్నీ చూసే అబ్బాయి చేతిలో పెట్టాలని అనుకుంటున్నా’ అని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే క్రమశిక్షణ కలిగినవాడని, తన కుమార్తెను బాగా చూసుకుంటాడనే నమ్మకం ఉంటుందని తెలిపారు. అల్లుడు మితిమీరిన వేగంతో వాహనం నడుపుతున్నాడా, మద్యం తాగి బండి నడుపుతాడా అని తెలుసుకోవాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు.

చలానాలు లేవని తేలడంతో సంతోషం: దీంతో సీఐ రామారావు ఆ రెండు వాహన నంబర్లను యాప్‌లో తనిఖీ చేశారు. వాటిపై ఎలాంటి చలానాలూ లేవని నిర్ధారించి చెప్పడంతో ఆ పెద్దాయన సంతోషంగా వెళ్లిపోయారు. ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచిస్తే ఆడపిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా సీఐ రామారావు అభిప్రాయపడ్డారు. బాధ్యత కలిగిన వ్యక్తినే అల్లుడిగా ఎంచుకోవాలన్న ఆ తండ్రి తపన అందరినీ ఆలోచింపజేస్తోంది.

"ఈ పెళ్లి నాకొద్దు" - చీరె నచ్చలేదని వధువు పేచీ - పెళ్లి మండపంలో పెద్ద గొడవ!

పెళ్లి సంబంధాల వారాంతపు "సంత" - మీకు నచ్చితే డేటింగ్​కీ వెళ్లొచ్చు!