ఏపీలో కొవిడ్ కేసులు - ‘ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్.5’ వేరియంట్‌గా గుర్తింపు
ఏపీలో శనివారం నాటికి 16 కొవిడ్ కేసులు - ఆందోళన చెందొద్దని వైద్యారోగ్య శాఖ సూచన - ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు - అందుబాటులో సిబ్బంది, మందులు ఉంచామని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 19, 2026 at 8:07 AM IST
Omicron RF5 Variant in AP : ఏపీలో ఇటీవల వెలుగు చూసిన కొవిడ్ పాజిటివ్ కేసులకు ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్.5 వేరియంట్ కారణమని పరీక్షలో తేలింది. కొవిడ్-2 వైరస్ కాలక్రమంలో తన జన్యువుల్లో మార్పులు చేసుకుని ఒమిక్రాన్ వేరియంట్‌గా ఏర్పడిందని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఆ వంశానికి చెందిన ఉప వేరియంట్ ఆర్‌ఎఫ్.5 అని తెలిపింది. వైఎస్సార్ కడప జిల్లాలో నమోదైన కొవిడ్ పాజిటివ్ కేసుల్లో నాలుగు నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఈ క్రమంలోనే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్.5గా తేలిందని వైద్యారోగ్యశాఖ అధికారులకు పరీక్షల ఫలితాల నివేదిక అందింది.
పుణె నుంచి అందిన ఫలితాలు, వేరియంట్ ప్రభావం, ఏపీలో తాజా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో వర్చువల్‌గా సమీక్షించారు. ఆర్‌ఎఫ్.5ను డబ్ల్యూహెచ్‌వో సాధారణ వేరియంట్‌గానే పరిగణనలోకి తీసుకుందని డీఎంఈ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్, సత్యకుమార్ యాదవ్‌కు వివరించారు. ఈ వైరస్ తీవ్ర ఇబ్బంది కలిగిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పారు.
సింగపూర్‌తోపాటు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో ఆర్‌ఎఫ్.5 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని డీఎంఈ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్, సత్యకుమార్ యాదవ్‌కు వివరించారు ఇతర ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే ఇది ప్రమాదకరం అనడానికి ఆధారాలు లేవన్నారు. ఈ వైరస్ సోకితే దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, ముక్కు కారడం, మూసుకుపోవడం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు ఉంటాయని వివరించారు. ఆందోళన చెందొద్దని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
Covid Cases Increasing in AP : ఏపీలో శనివారం నాటికి కొవిడ్ కేసుల సంఖ్య 16కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే బోధనాసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు సిద్ధం చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు ఆసుపత్రులను సన్నద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కొవిడ్ కేసులు గుర్తించడానికి అవసరమైన కిట్లు, ఇతర సదుపాయాలు సమకూరుస్తున్నామని ఆయన వెల్లడించారు.
మరోవైపు సర్కార్ ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక కొవిడ్ వార్డులు సిద్ధం చేస్తోంది. విజయవాడ జీజీహెచ్‌లో 20 కిలో లీటర్లు, 13 కిలో లీటర్ల సామర్థ్యంతో మొత్తంగా 33 కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. ఈ ట్యాంకుల్లో ఆక్సిజన్ నిల్వ తగ్గక ముందే మరో ట్యాంకర్ తెప్పించి సిద్ధంగా ఉంచుతున్నారు. విజయవాడ జీజీహెచ్‌లో 33 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా కొవిడ్ కోసం మూడు ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచారు. వైఎస్సార్ కడపలో కొవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన ఆసుపత్రులన్నింటిలో అవసరమైన మందులు, ఐసోలేషన్ వార్డులు, పడకలు సిద్ధం చేసి సిబ్బందిని అప్రమత్తంగా ఉంచారు.
Corona Cases in AP : అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె ప్రభుత్వాసుపత్రి, పుంగనూరు, రాయచోటి, పీలేరు ఏరియా ఆసుపత్రులతో పాటు ఏడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రత్యేకంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పడకలను అందుబాటులో ఉంచారు. కొవిడ్ ఐసోలేషన్ వార్డులో మాస్కులు, మందులు, పీపీ కిట్లు, అవసరమైన మందులు సిద్ధం చేశారు. అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతానికి కొవిడ్ కేసులు నమోదు కాలేదు. సరిహద్దు కడప జిల్లాలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తిరుపతి రుయా, రిమ్స్ ఆసుపత్రుల్లో మాత్రమే ప్రస్తుతం కొవిడ్ స్వాబ్ పరీక్షలు చేస్తున్నారు. అనుమానిత కేసులు వస్తే స్వాబ్ పరీక్షలకు రెండు ఆసుపత్రులకు పంపి అక్కడ పరీక్షలు చేయిస్తున్నారు.
పెరుగుతున్న కరోనా కేసులు - విజయవాడ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు

