ETV Bharat / state

ఇంకా ఎవరి పాత్రైనా ఉందా? నిందితులుగా చేర్చాలా? - తిరుమల లడ్డూ కల్తీ కేసులో దర్యాప్తుపై సమీక్ష

తిరుమల లడ్డూ కల్తీ కేసు దర్యాప్తుపై అధికారుల సమీక్ష - 14 నెలల దర్యాప్తుపై సిట్‌ ఉన్నాతాధికారుల సుదీర్ఘ సమీక్ష - ఫిర్యాదుదారుడే నిందితుడైన నేపథ్యంలో న్యాయపరమై చిక్కులపై చర్చ

Tirumala Laddu Adulteration Case Updates
Tirumala Laddu Adulteration Case Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 11, 2026 at 1:49 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tirumala Laddu Adulteration Case Updates: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు తుది అంకానికి చేరిన నేపథ్యంలో ఇంకా ఎవరినైనా ప్రశ్నించాల్సి అవసరముందా? అనే అంశంపై అధికారులు సమాలోచనలు చేశారు. గత 14 నెలలుగా జరిగిన విచారణపై సుదీర్ఘంగా సమీక్షించి నిందితులుగా ఇంకా ఎవరినైనా చేర్చాలా అనే అంశంపై చర్చించారు. మరోవైపు ఫిర్యాదుదారుడే నిందితుడు కావడంతో న్యాయపరమైన అంశాలపై సమాలోచనలు చేశారు.

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి సరఫరా కేసు తుది అంకానికి చేరిన నేపథ్యంలో 14 నెలలుగా జరిగిన దర్యాప్తుపై సిట్‌ ఉన్నతాధికారులు శనివారం సమీక్షించారు. అలిపిరి సమీపంలోని సిట్‌ కార్యాలయంలో సీబీఐ జేడీ వీరేశ్‌ ప్రభు, గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజ్‌ డీఐజీ గోపినాథ్‌ జెట్టీ, సీబీఐ డీఐజీ మురళీ రాంబా, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సలహాదారు డాక్టర్‌ సత్యేన్‌కుమార్‌ పాండా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ కేసుపై సుదీర్ఘంగా చర్చించారు.

తుది అంకానికి చేరిన టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా కేసు - 14 నెలల విచారణపై సుదీర్ఘ సమీక్ష (ETV)

మలి ఛార్జ్‌షీట్‌కు కసరత్తు: విచారణాధికారిగా ఉన్న ఏఎస్పీ వెంకట్రావు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, అరెస్టుల గురించి వారికి వివరించారు. నాటి టీటీడీ ఛైర్మన్లు భూమన కరుణాకరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఈవోలు ధర్మారెడ్డి, శ్యామలరావు, కొనుగోళ్ల కమిటీ సభ్యులు, భోలేబాబా డైరెక్టర్లు పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌తో పాటు ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఇంకా ఎవరినైనా ప్రశ్నించాల్సిన అవసరముందా? అని సమీక్షించారు. మలి ఛార్జ్‌షీట్‌కు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు నిందితులుగా గుర్తించిన 36 మంది కాకుండా ఇంకా ఎవరి పాత్రైనా ఉందా? నిందితులుగా చేర్చాలా? అని చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. విచారణకు సహకరించని వ్యక్తుల విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనే అంశంపై వారు సమాలోచనలు జరిపారు.

గతంలో కొనుగోళ్ల విభాగం జీ.ఎం.ప్రళయకావేరి మురళీకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేయగా అనంతర పరిణామాల్లో ఆయనకూ ఇందులో హస్తం ఉందని గుర్తించి నిందితుడిగా చేర్చారు. దాంతో తదుపరి అనుసరించాల్సిన వ్యూహం, న్యాయపరమైన చిక్కులు వస్తే ఎలా అధిగమించాలనేది సమీక్షించారు. వేరే ఎవరినైనా ఫిర్యాదుదారులుగా చేర్చాలా? అనే అంశంపైనా మాట్లాడారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు అప్రూవర్లుగా మారినట్టు ప్రచారం జరుగుతోంది.

ఎవరికైనా లబ్ధి చేకూరిందా? : గత ప్రభుత్వంలో టీటీడీలో నెయ్యి కొనుగోళ్ల టెండర్‌ నిబంధనల మార్పునకు సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకున్నందున ధర్మకర్తల మండలిలో ఉన్న సభ్యులు, ఉన్నతాధికారులకు ఎవరికైనా లబ్ధి చేకూరిందా? అని దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అధికారులను సీబీఐ జేడీ అడిగినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏమైనా ఆధారాలు లభించాయా? అని ఆరా తీశారు.

ఇదిలా ఉండగా మరోవైపు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్‌ ఇటీవల మరో 12 మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. వీరిలో ఏడుగురు టీటీడీకి చెందిన ఉద్యోగులు కాగా, మరో ఐదుగురు డెయిరీ ప్లాంట్లు తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందంలోని సభ్యులు. కల్తీ నెయ్యి సరఫరాలో వీరందరి ప్రమేయం ఉన్నట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. వీరిలో కొందరూ డెయిరీల ప్రతినిధుల నుంచి లంచాలు తీసుకుని వాటికి అనుకూలంగా నివేదికలు ఇచ్చారని, నిర్ణయాలు తీసుకున్నారని సిట్‌ గుర్తించింది. ఆ వివరాలతో ఈనెల 23న నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమో సైతం వెలుగు చూసింది.

నెయ్యి కల్తీ గురించి వైవీ సుబ్బారెడ్డికి అప్పుడే చెప్పా - సిట్​ విచారణలో మాజీ జీఎం

తిరుమల కల్తీ నెయ్యి కేసు - నిందితుడు లంచం తీసుకున్నట్లు అంగీకరించారని తెలిపిన సిట్