వారం రోజులుగా ఫ్రీజర్‌లో 'మాంసాహారం' - అధికారుల తనిఖీల్లో భారీగా నాన్‌వెజ్ సీజ్
హోటళ్లు, బేకరీలు, పాస్ట్‌పుడ్ సెంటర్లపై ఆహార భద్రత విభాగం తనిఖీలు - నాణ్యత పాటించని హోటళ్లకు నోటీసులు ఇచ్చిన అధికారులు - ముందస్తు సమాచారంతో హోటళ్లు మూసేసిన నిర్వాహకులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 11, 2026 at 4:07 PM IST
Food Safety Rides : గుంటూరు నగరంలో ఉన్న పలు రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, బేకరీలు, స్వీట్స్ దుకాణాల్లో మంగళవారం (10-02-26) ఆహార భద్రత నియంత్రణశాఖ, తూనికలు-కొలతలశాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. పది బృందాలుగా ఏర్పడి అరండల్‌పేట, కింగ్స్ హోటల్‌సెంటర్, లాలాపేట, బ్రాడీపేట, లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్ సెంటర్, నగరాలు ప్రాంతాల్లో ఉన్న పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిన పలువురు హోటళ్ల నిర్వాహకులు రెస్టారెంట్లను సైతం మూసేశారు. ఈ తనిఖీల్లో భాగంగా మొత్తం 16 నమూనాలు సేకరించామని రాష్ట్ర జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఇన్‌ఛార్జి నూతలపాటి పూర్ణచంద్రరావు తెలిపారు.
ఫ్రిజ్‌లో నిల్వలు :
- నగరంలోని లక్ష్మీపురం మెయిన్‌రోడ్డులో ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో దాదాపు 60 కిలోల చికెన్‌తో పాటు మటన్‌ను సీజ్ చేశారు. నిర్వహకులు సుమారు వారం రోజులుగా చికెన్, మటన్‌ను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్టు అధికారులు గుర్తించారు. ఇందులో ఎక్కువ శాతం ఉడకబెట్టిందేనని, వండిన తర్వాత దాన్ని ఫ్రీజ్‌లో నిల్వ చేయటం చట్ట విరుద్ధమని ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు తెలిపారు. కస్టమర్లకు దాన్ని వేడి చేసి ఇస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇలా చేయడం వల్ల ఆ మాంసంపై ఫంగస్ ఏర్పడి, అది వ్యాపించి తిన్నవారు డయేరియా బారిన పడే ప్రమాదం ఉందని పూర్ణచంద్రరావు చెప్పారు.
- ఆ ప్రాంతంలో ఉన్న ఒక స్వీట్ షాపు నిర్వాహకుడు సుమారు 13 కిలోల పూర్ణాల పిండిని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచారు.
- అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లను తయారు చేస్తున్న వ్యాపారులకు కూడా అధికారులు నోటీసులిచ్చారు.
- రెస్టారెంట్లలో వండే ప్రతి వంటకంలో మోతాదుకు మించి రంగులు కలిపినట్టు తనిఖీలో తేలింది.
- వంటగదిలో వాడుతున్న నూనెను పరిశీలించగా అది పూర్తిగా రంగు మారిపోయినట్లు గుర్తించారు.
ఎక్కువ ధరకు అమ్మిన వారిపై చర్యలు : ఆహార నమూనాలను ల్యాబ్ పరీక్షకు పంపుతామని, నివేదిక వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఇన్‌ఛార్జి పూర్ణచంద్రరావు తెలిపారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటామని తూనికలు కొలతలు శాఖ సంయుక్త కమిషనర్ మాధురి తెలిపారు. ఎటువంటి నాణ్యత లేని, కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్ల్లో విక్రయిస్తున్నట్టు గుర్తిస్తే 94403 79755 ఫోన్ నంబరుకు సమాచారం అందించాలి. గుంటూరు నగరంలో చేసిన తనిఖీల్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు బి.శ్రీనివాస్‌తో పాటు జి.వెంకటేశ్వరరావు, తూనికలు-కొలతలశాఖ జాయింట్ కంట్రోలర్ ఎంఎన్‌ఎస్ మాధురి, డిప్యూటీ కంట్రోలర్ డీవీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
"లక్ష్మీపురం మెయిన్‌రోడ్డులో ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఉన్న దాదాపు 60 కిలోల చికెన్‌తో పాటు మటన్‌ను సీజ్ చేశాం. సుమారు వారం రోజులుగా చికెన్, మటన్‌ను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్టు గుర్తించాం. ఇందులో ఎక్కువ శాతం ఉడకబెట్టిందే ఉంది. కస్టమర్లకు దాన్ని వేడి చేసి ఇస్తున్నట్లు కూడా గుర్తించాం. ఇలా చేయడం వల్ల ఆ మాంసంపై ఫంగస్ ఏర్పడి, అది వ్యాపించి తిన్నవారు డయేరియా బారిన పడే ప్రమాదం ఉంది. ఆహార నమూనాలను ల్యాబ్ పరీక్షకు పంపుతాము, నివేదిక వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం." - నూతలపాటి పూర్ణచంద్రరావు, రాష్ట్ర జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఇన్‌ఛార్జి
గ్యాస్ కనెక్షన్ కావాలా? - ఏజెన్సీకి వెళ్లకుండానే సులభంగా ఇలా పొందండి!

